Venkatesh: రానాతో అలా నటించడం కష్టమనిపించింది: వెంకటేశ్‌

రానా- వెంకటేశ్‌ (Venkatesh) కలిసి నటించిన వెబ్‌సిరీస్‌  ‘రానా నాయుడు’ (Rana Naidu). ఈ సిరీస్‌ మార్చి10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా వెంకటేశ్‌ కొన్ని విశేషాలు పంచుకున్నారు.

Published : 03 Mar 2023 01:52 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు వెంకటేశ్‌ (Venkatesh)‌. ఈ అగ్ర హీరో ‘రానా నాయుడు’ (Rana Naidu) వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. తన సోదరుడు సురేశ్‌బాబు తనయుడు రానా (Rana)తో కలిసి ఆయన నటించిన ఈ సిరీస్‌ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో మార్చి 10 విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మీడియాతో ముచ్చటించారు.

‘‘సినిమాలో నటించడానికి, వెబ్‌ సిరీస్‌లో నటించడానికి చాలా తేడా ఉంటుంది. సిరీస్‌లో కథ నడిచే వేగానికి తగ్గట్టు నటించేలా అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది. నెగెటివ్‌ రోల్‌లో నటించడం సవాలుగా అనిపించినా నాలోని కొత్త కోణాన్ని చూపించేందుకు అది దోహదపడింది’’

‘‘నాకు సంతృప్తినిచ్చిన పాత్రల్లో ఇదొకటి. రానాకు ఎదురుతిరిగి నటించడం అంత సులువు కాదు. మేమిద్దరం వ్యక్తిగతంగా బాబాయ్‌- అబ్బాయ్‌గా కంటే స్నేహితుల్లా ఉంటాం. కానీ, ఈ సిరీస్‌లో ఒకరంటే ఒకరికి పడని తండ్రీ కొడుకుల్లా నటించడం కష్టంగా అనిపించింది. అయినా ఓ నటుడిగా చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్‌లోని భావోద్వేగాలకు ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్‌ అవుతారు. మా ఇద్దరికీ ఇది కొత్త ప్రయత్నం’’ అని వివరించారు. 

రానా హీరోగా గతంలో తెరకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’లో వెంకటేశ్‌ ఓ పాటలో కనిపించిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయిలో వీరిద్దరు కలిసి ఎప్పుడు నటిస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు ఈ సిరీస్‌ను ప్రకటించి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఇందులో రానా టైటిల్‌ పాత్ర పోషించగా.. వెంకటేష్‌ నాగ నాయుడు పాత్రలో నటించారు. సుర్వీన్‌ చావ్లా, సుశాంత్‌ సింగ్‌, ఆశిష్‌ విద్యార్థి, గౌరవ్‌ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ను అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు