నిజమైన రాబందులు మెడపై పొడుస్తుంటే..

తనదైన నటనతో అటు మాస్‌, ఇటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించగల అగ్ర నటుడు వెంకటేష్‌.

Published : 28 Apr 2023 17:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తనదైన నటనతో అటు మాస్‌, ఇటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించగల అగ్ర నటుడు వెంకటేష్‌. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన ఆయన ఇటీవల సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. తాజాగా ‘రానానాయుడు’ వెబ్‌సిరీస్‌ తనశైలికి పూర్తి భిన్నమైన పాత్రలో నటించారు. ఆయన నటించిన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’తోనే బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు వెంకటేష్‌. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అందరినీ అలరించింది.

వెంకటేష్‌ తొలిసారి వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం కావడంతో దర్శకుడు రాఘవేంద్రరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా హీరో పాత్రను కాస్త వైవిధ్యంగా తీర్చిదిద్దారు. తొలి సన్నివేశాల్లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉండేలా చూపించి, ఆ తర్వాత మారిన కథానాయకుడిని చూపించారు. క్లైమాక్స్‌లో హీరోని అతని స్నేహితుల బృందాన్ని బంధించి రాబందులతో పొడిపించే సన్నివేశం ఉంది. అందుకోసం ఫైట్‌మాస్టర్‌ విజయన్‌ నిజమైన రాబందులను తీసుకొచ్చారు. అందులో ఒకటి వెంకటేష్‌ మెడపై పొడుస్తున్నట్లు కనిపించడానికి వెనకవైపు చెక్క ముక్క పెట్టి ,దానికి మాంసం గుచ్చారట. రాబందు మాంసాన్ని పొడిచి తింటుంటే, అవి తననెక్కడ పొడుస్తాయోనని వెంకటేష్‌ కాస్త భయపడ్డారట.

అంతేకాదు.. హీరో పరిచయ సన్నివేశానికి ఓ అర్థం ఉంది. వెంకటేష్‌ తన స్నేహితులతో మాట్లాడుతూ మెట్లు ఎక్కుతాడు. తన స్నేహితుల కన్నా పైమెట్టుపై ఉండగా అప్పుడు వెనక్కి తిరిగి మెడలో శాల్‌ వేసుకుని ‘వి ఫర్‌ విక్టరీ అన్నది పాత సామెత. విజయ్‌ ఫర్‌ విక్టరీ అన్నది నేను సృష్టించిన సామెత’ అంటూ డైలాగ్‌ చెబుతూ కనిపిస్తారు. అలా తొలి చిత్రంలో పలికిన ‘విక్టరీ’ పదం చివరకు వెంకటేష్‌ విజయాలకు చిరునామాగా నిలిచింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని