Rana Naidu: ఎట్టకేలకు ‘రానానాయుడు’ సిరీస్‌పై స్పందించిన వెంకటేశ్‌

Rana Naidu: ‘అహింస’ విలేకరుల సమావేశంలో పాల్గొన్న వెంకటేశ్‌ ‘రానా నాయుడు’వెబ్‌సిరీస్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Published : 31 May 2023 06:09 IST

హైదరాబాద్‌: ‘రానానాయుడు’(Rana Naidu) లో కొన్ని సన్నివేశాలు, తీసిన విధానం కొందరిపై ప్రభావం చూపిన మాట వాస్తవమేనని అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ (Venkatesh) అన్నారు. ఇటీవల రానాతో కలిసి ఆయన నటించిన యాక్షన్‌ క్రైమ్‌ డ్రామా ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ చూసి, చాలా మంది అవాక్కయ్యారు. కుటుంబ కథానాయకుడిగా వెంకటేశ్‌ను చూసిన అభిమానులు షాకయ్యారు. చాలా సన్నివేశాల్లో అసభ్యపదజాలం, శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు ఉండటంతో సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే రానా స్పందించగా, తాజాగా వెంకటేశ్‌ తొలిసారి మాట్లాడారు. అభిరామ్‌ దగ్గుబాటి కథానాయకుడిగా నటిస్తున్న ‘అహింస’ చిత్ర ప్రచారంలో భాగంగా విలేకరుల సమావేశంలో వెంకటేశ్‌ పాల్గొన్నారు. ‘రానా నాయుడు’పై వచ్చిన నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌పై మీ స్పందన ఏంటి? అని అడగ్గా, అందుకు సమాధానం చెప్పేందుకు మొదట వెంకటేశ్‌ ఆసక్తి చూపలేదు. ఇది సరైన వేదిక కాదని, ఇంకొకసారి మాట్లాడుకుందామని దాటవేసేందుకు ప్రయత్నించారు.  మరొకసారి విలేకరి ప్రశ్నించగా, తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

‘‘రానానాయుడు’ సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్‌ చాలా సంతోషంగా ఉంది. చాలా మంది నుంచి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కన్నా ముందుకు వెళ్లిపోవడమే మంచిదని నేను నమ్ముతా. తర్వాతి సీజన్‌ అందరికీ నచ్చేలా తీర్చిదిద్దుతాం. అలాగని అందరినీ మెప్పించడం కూడా కష్టమే. ఒక విషయమైతే చెప్పగలను. ఫస్ట్‌ సీజన్‌లో కొన్ని సన్నివేశాలు, వాటిని తీసిన విధానం  ప్రభావం చూపిన మాట వాస్తవం. అయితే,  మొదటి సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్‌కు కచ్చితంగా ప్రేక్షకులు పెరుగుతారు. ఆదరిస్తారు. చూద్దాం అందరికీ నచ్చేలా ఉత్తమమైన కంటెంట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం’’ అని వెంకటేశ్‌ అన్నారు.  అలాగే నంది అవార్డులపైనా వెంకటేశ్‌ స్పందించారు. అవార్డుల గురించి తాను ఎక్కువ ఆలోచించనని అన్నారు. అయితే, అవార్డులు ఇస్తే ప్రతి నటుడికీ ప్రోత్సాహంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అభిరామ్‌ నటించిన ‘అహింస’ మంచి విజయాన్ని అందుకోవాలని ఈ సందర్భంగా వెంకటేశ్‌ ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని