ప్రముఖ రచయిత వెన్నెలకంటి కన్నుమూత

ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి కన్నమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస...

Updated : 05 Jan 2021 19:47 IST

చెన్నై‌: ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి(63) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెన్నెలకంటి పూర్తిపేరు రాజేశ్వరప్రసాద్‌. దాదాపు 300 చిత్రాల్లో 2వేలకు పైగా పాటలు రాశారు. వెన్నెలకంటి స్వస్థలం నెల్లూరు. 1957లో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అంతా అక్కడే పూర్తి చేశారు. ఎస్‌బీఐలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయనకు సాహిత్యమంటే మక్కువ. అదే ఆయనను గీత రచయితను చేసింది. తన 11వ ఏటే ‘‘భక్త దుఃఖనాశ పార్వతీశా’’ అనే మకుటంతో శతకాన్ని రాశారు. అలా విద్యార్థి దశలో ‘‘రామచంద్ర శతకం’’, ‘‘లలితా శతకం’’ కూడా రచించారు. అయితే, మనసంతా నాటకాలు, సినిమాల మీదే ఉండటంతో అప్పుడప్పుడు నాటకాలు కూడా వేసేవారు. ఎప్పటికైనా సినిమాలో పాటలు రాయకపోతానా అనే ఆత్మ విశ్వాసంతో ఉండేవారు. అదే ఆయన్ను సినీ గేయ రచయితగా నిలబెట్టింది.

తొలి అవకాశం అలా వచ్చింది!

నెల్లూరుకు చెన్నై దగ్గరే కావడంతో వెన్నెలకంటి సరదాగా అక్కడకు వెళ్లి వస్తుండేవారు. అలా 1986లో నటుడు, నిర్మాత ప్రభాకరరెడ్డి ‘శ్రీరామచంద్రుడు’ సినిమాలో ‘‘చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల’’ పాట రాసే అవకాశమిచ్చారు. అదే వెన్నెలకంటి తొలి సినీగీతం. 1987లో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో ‘అన్నా చెల్లెలు’ సినిమాకి ‘‘అందాలు ఆవురావురన్నాయి’’ పాట రాశారు. అలా వెన్నెలకంటి ప్రయాణం నెమ్మదిగా ఊపందుకుంది. దీంతో ఎస్‌బీఐలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, సినిమా రంగంలో సాహిత్య ప్రయాణం కొనసాగించారు.

అప్పట్లో ఓ ఊపు ఊపేసిన ‘మాటరాని మౌనమిది’

‘మహర్షి’ (1988) సినిమాలో ఆయన రాసిన ‘‘మాటరాని మౌనమిది’’ పాట అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. దాని వెనుక జరిగిన కథను వెన్నెలకంటి ఓ సందర్భంలో పంచుకున్నారు. ‘‘పేర్చలేని, పదాల్లో ఇమడ్చలేని ప్రేమభావాలను ఆవిష్కరించిన ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందర రామ్మూర్తి నాకు గురుతుల్యులు. వారి స్ఫూర్తితో స్రవంతి రవికిషోర్, వంశీ సూచన మేరకు ‘ముక్తపదగ్రస్థం’ వచ్చేట్టు ఒక పాటను, మామూలు వెర్షన్‌లో మరొక పాటను రాశాను. ‘ముక్తపదగ్రస్థం’ అంటే మొదటి పంక్తిలో చివరి పదాన్ని రెండో పంక్తిలో మొదటి పదంగా వాడటమన్నమాట. సన్నివేశానికి తగిన చరణాలను ఎంపిక చేసినప్పుడు రవికిషోర్‌ రెండో వెర్షన్‌ చరణాలను వాడుకున్నారు. పల్లవి మాత్రం అలాగే ఉంచేశారు. ‘‘మాటరాని మౌనమిది... మౌనవీణ గానమిది.. గానమిదీ నీ ధ్యానమిది.. ధ్యానములో నా ప్రాణమిదీ.. ప్రాణమైన మూగ గుండె రాగమిది’’ అనే ఈ పాట బాగా హిట్‌ అయింది. ‘‘ముత్యాల పాటల్లో కోయిలమ్మా.. ముద్దారబోసేది ఎప్పుడమ్మా.. ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా.. దీపాలు పెట్టేది ఎప్పుడమ్మా’’ చరణంతో నిర్మాత బాగా ఇంప్రెస్‌ అయ్యారు. ఇళయరాజా అద్భుతంగా ఈ పాటను స్వరపరిచారు. ఈ పాట హిట్‌ అవడంతో రవికిషోర్‌ నాకు ‘నాయకుడు’ డబ్బింగ్‌ వెర్షన్‌లో రెండు పాటలు రాసే అవకాశాన్ని ఇచ్చి ప్రోత్సహించారు’’ అని చెప్పుకొచ్చారు.

వెన్నెలకంటి కలం నుంచి జాలువారిన ఆణిముత్యాలు

* ‘‘చిరునవ్వుల వరమిస్తావా.. చితినుంచి బ్రతికొస్తాను.. మరుజన్మకు కరుణిస్తావా.. ఈ క్షణమే మరణిస్తాను’’

* ‘‘రాసలీల వేళ రాయబారమేల.. మాటే మౌనమై మాయజేయనేలా’’

* ‘‘మధురమే సుధాగానం.. మనకిదే మరో ప్రాణం. మదిలో మోహనగీతం.. మెదిలే తొలి సంగీతం’’

* ‘‘నీటిమీద రాతేకాదా ప్రాణమైన దేహమూ..ఓటికుండ మోతేలేరా పెంచుకున్న పాశమూ..ఎవరి కోసమేనాడైనా ఆగబోదు కాలమూ.. ఎవరికెవరు ఈ లోకంలో అదే ఇంద్రజాలమూ’’

* ‘‘కొంత కాలం కొంత కాలం కాలమాగిపోవాలి..నిన్నకాలం మొన్న కాలం రేపు కూడా రావాలి’’

* ‘‘శ్రీరంగ రంగనాథుని రూపమే చూడవే.. శ్రీదేవి రంగనాయకి నామం సతతం పాడవే.. నీలవేణిలో నీటిముత్యాలు నీరజాక్షునికి పూలుగా..కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణగీతలే పాడగా’’ ఇటువంటి వైవిధ్య గీతాలన్నీ వెన్నెలకంటి కలం నుంచి జాలువారినవే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని