IIFA 2023: కమల్‌ హాసన్‌కు అరుదైన అవార్డు.. ఐఫా వేదికపై అందుకోనున్న నటుడు

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ను (Kamal Haasan) ఇప్పటికే ఎన్నో అవార్డులు వరించాయి. తాజాగా ఆయన ఖాతాలో మరో అవార్డు చేరనుంది. 

Published : 22 May 2023 11:18 IST

హైదరాబాద్‌: ఆరు దశాబ్దలకు పైగా తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కమల్‌ హాసన్‌ (Kamal Haasan). నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా సేవలందిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకుంటున్నారు. తాజాగా ఆయన ఖాతాలో మరో అవార్డు చేరనుంది. ఇన్ని సంవత్సరాలుగా సినీరంగానికి చేసిన సేవలకు గాను ఆయన్ని ఐఫా జీవితకాల సాఫల్య పురస్కారం వరించింది. ఈ నెల 27న అబుదాబిలో జరగనున్న అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో (IIFA 2023) ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఐఫా నిర్వాహకులు వెల్లడించారు. ఇప్పటికే కమల్‌కు ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. తాజాగా ఈ లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు రావడంతో ఆయన అభిమానులు ఆనందిస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం కమల్‌ ‘ఇండియన్‌2’ (Indian 2) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. తాను నటించిన సన్నివేశాలకు కమల్‌ డబ్బింగ్‌ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal), రకుల్ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) కీలకపాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే దీని టీజర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత కమల్‌హాసన్‌ ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో ఓ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని