‘రాజరాజ చోళుడు హిందువు కాదు’.. వెట్రిమారన్‌, కమల్‌ వ్యాఖ్యలపై దుమారం!

తమిళనాట కొత్త వివాదం రాజుకుంది. రాజరాజ చోళుడి గురించి ప్రముఖ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ మద్దతు తెలపడం వివాదానికి దారితీసింది.

Published : 07 Oct 2022 14:12 IST

చెన్నై: తమిళనాట కొత్త వివాదం రాజుకుంది. రాజరాజ చోళుడి గురించి ప్రముఖ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ మద్దతు తెలపడం వివాదానికి దారితీసింది. దీనిపై పుదుచ్ఛేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సహా భాజపా నేతలు విమర్శిస్తున్నారు.

రాజరాజ చోళుడి కథను స్ఫూర్తిగా తీసుకుని రాసిన నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్‌సెల్వన్‌-1’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీని పై ఓ కార్యక్రమంలో వెట్రిమారన్‌ మాట్లాడుతూ.. ‘రాజరాజ చోళన్‌ అసలు హిందువే కాదు. కానీ, కొందరు (భాజపా) మన గుర్తింపును దోచుకెళ్లాలని చూస్తున్నారు. ఇప్పటికే తిరువళ్లూర్‌ను కాషాయీకరించారు. ఇలాంటివి ఏమాత్రం సహించకూడదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. వెట్రిమారన్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ కథానాయకుడు కమల్‌ హాసన్‌ మద్దతు తెలిపారు. రాజరాజ చోళుని కాలంలో అసలు హిందూ మతమే లేదని చెప్పారు. అ కాలంలో కేవలం వైనం, శివం, సమానం మాత్రమే ఉన్నాయన్నారు. తూత్తుకుడిని.. ట్యుటికొరైన్‌ చేసినట్లు ఈ మూడింటినీ హిందూగా వారు పిలిచేవారని తెలిపారు.

వెట్రిమారన్‌, కమల్‌ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. రాజ రాజ చోళుడు తనకు తాను శివపాద శేఖర్‌ అని చెప్పుకొన్నాడని ఆ పార్టీ నేత హెచ్‌జె రాజా గుర్తుచేశారు. మరి అలాంటప్పుడు ఆయన హిందువు కాదా? అని ప్రశ్నించారు. తమిళుల గుర్తింపుని కొందరు వారి అవసరాల కోసం దాచే ప్రయత్నం చేస్తున్నారని పుదుచ్చేరి ఇన్‌ఛార్జి ఎల్‌జీ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. కోయంబత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ.. వెట్రిమారన్‌ చేసిన వ్యాఖ్యలకు కమల్‌హాసన్‌ మద్దతు తెలపడంపై స్పందించారు. తమిళుల గుర్తింపును కొందరు తమ అవసరాల కోసం దాచే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలన్నారు. శైవం, వైష్ణవ మతాలు హిందుత్వ గుర్తింపు అని, వాటిని దాచడానికి ప్రయత్నించడం సరైనది కాదన్నారు. గతంలో రాజరాజ చోళుడి గురించి పా రంజిత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన కాలంలో దళితులకు చీకటి రోజులు నడిచాయని ఆయన పేర్కొనడం అప్పట్లో వివాదానికి దారితీసింది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts