Viduthala telugu review: రివ్యూ: విడుద‌ల‌: పార్ట్ 1

viduthala telugu review: సూరి, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలలో వెట్రిమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విడుదల పార్ట్‌-1’ ఎలా ఉందంటే?

Updated : 15 Apr 2023 17:35 IST

viduthala telugu review: చిత్రం: విడుదల: పార్ట్‌-1; నటీనటులు: సూరి, విజయ్‌ సేతుపతి, భవానీశ్రీ, గౌతమ్‌ వాసుదేవ మేనన్‌, రాజీవ్‌ మేనన్‌ తదితరులు; సంగీతం: ఇళయరాజా; సినిమాటోగ్రఫీ: ఆర్‌.వేల్‌రాజ్‌; ఎడిటింగ్‌: రమర్‌; నిర్మాత: ఎల్రెడ్‌ కుమార్‌; రచన, దర్శకత్వం: వెట్రిమారన్‌; విడుదల: 15-04-2023

వెట్రిమార‌న్‌... త‌మిళనాట ఈ పేరు ఓ సంచ‌ల‌నం.  ఆయ‌న సినిమా వ‌స్తోందంటే చాలు.. అమాంతం అంచ‌నాలు పెరిగిపోతుంటాయి. స్టార్ల కంటే కూడా క‌థ‌ల‌కే పెద్ద‌పీట వేస్తూ సినిమాలు తీయ‌డం ఆయ‌న శైలి. జాతీయ పుర‌స్కారాల్లో ఆయ‌న పేరు త‌ర‌చూ వినిపిస్తుంటుంది. అంత ప్ర‌భావ‌వంత‌మైన సినిమాలు చేస్తుంటారు. ఆయ‌న త‌మిళంలో తీసిన అసుర‌న్ తెలుగులో నార‌ప్ప‌గా రీమేక్ అయ్యింది. ఆయ‌న ఇటీవ‌ల త‌మిళంలో తీసిన చిత్రం ‘విడుద‌లై:  పార్ట్‌1.  హాస్య ప్ర‌ధాన‌మైన పాత్ర‌ల్లో న‌టించే సూరి ఇందులో క‌థానాయ‌కుడు కావ‌డంతో అంద‌రిలోనూ సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. అక్క‌డ ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా తెలుగులో ‘విడుద‌ల:  పార్ట్‌1’ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి చిత్ర కథేంటి? వెట్రిమారన్‌ టేకింగ్‌ ఎలా ఉంది?

క‌థేంటంటే: కుమ‌రేశ‌న్ (సూరి)  కొత్త‌గా ఉద్యోగంలో చేరిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌.  ప్ర‌జాద‌ళం నాయ‌కుడైన పెరుమాళ్‌(విజ‌య్ సేతుప‌తి)ని ప‌ట్టుకునేందుకు ప‌నిచేస్తున్న ప్ర‌త్యేక‌మైన పోలీస్ ద‌ళంలో డ్రైవ‌ర్‌గా చేర‌తాడు. ద‌ట్ట‌మైన అడ‌విలో ప‌నిచేస్తున్న పోలీస్ ద‌ళానికి రోజూ జీప్‌లో ఆహారం సర‌ఫ‌రా చేయ‌డమే కుమరేశ‌న్ ప‌ని. ప్ర‌జ‌ల‌కి క‌ష్టం వ‌స్తే ఆదుకోవ‌డ‌మే పోలీస్ విధి అనేది ఆయ‌న న‌మ్మిన సిద్ధాంతం. అనుకోకుండా అడ‌విలో ఓ మ‌హిళ‌పై ఎలుగుబంటి దాడి చేయ‌డంతో ఆమెని ఆస్ప‌త్రిలో చేర్పించేందుక‌ని పోలీస్ జీప్‌ని వాడ‌తాడు. దాంతో పై అధికారుల ఆగ్ర‌హానికి గుర‌వుతాడు.(Viduthala telugu review) క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే అంటాడు అధికారి. కుమ‌రేశ‌న్ మాత్రం త‌ప్పు చేయ‌లేదు కాబ‌ట్టి క్ష‌మాప‌ణ చెప్ప‌నంటాడు. మ‌రోవైపు  గాయ‌ప‌డిన ఆ మ‌హిళ మ‌న‌వరాలు పాప (భ‌వానీ శ్రీ)తో కుమ‌రేశ‌న్ స్నేహం చేస్తాడు. అది కాస్త ప్రేమ‌కి దారితీస్తుంది. ఒక ప‌క్క ప్రేమ‌, ఇంకోవైపు పెరుమాళ్ కోసం సాగించే వేట‌లో ఎలాంటి కుమ‌రేశ‌న్ ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కి గుర‌వుతాడ‌న్న‌ది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: వెట్రిమార‌న్ మ‌ట్టి క‌థ‌ల‌కి, మ‌ట్టి మ‌నుషుల్ని పోలిన  పాత్ర‌ల‌కి పెట్టింది పేరు. త‌న క‌థా ప్ర‌పంచాన్ని స‌హ‌జంగా తెర‌పై ఆవిష్క‌రిస్తూ ప్రేక్ష‌కుల్ని లీనం చేయ‌డం ఆయ‌న శైలి. ఈ సినిమాతోనూ అదే ప్ర‌య‌త్నం చేశాడు. 1987 నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. రైలు ప్ర‌మాదంతో సినిమా ఆరంభమైనా.. ద‌ట్ట‌మైన అడ‌వుల్ని చూపించ‌డం నుంచే ద‌ర్శ‌కుడు విడుద‌ల ప్ర‌పంచంలోకి ప్రేక్ష‌కుల్ని తీసుకెళ్లాడు. బేస్ క్యాంప్ నుంచి కుమ‌రేశ‌న్ విధులు నిర్వ‌ర్తించే తీరు... ఆ క్ర‌మంలో ఎదుర‌య్యే అనుభ‌వాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. అడ‌వుల్లో జీవితాల్ని అత్యంత స‌హ‌జంగా తెర‌పైకి తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు. (Viduthala telugu review) సినిమాతో ఓ కొత్త ప్ర‌పంచాన్నైతే ఆవిష్క‌రించారు కానీ... అందులో సంఘ‌ర్ష‌ణ‌, డ్రామా మాత్రం పెద్ద‌గా మెప్పించ‌దు. రెండు భాగాలుగా తీస్తున్నాడు కాబ‌ట్టి క‌థ‌ని మ‌లి భాగం కోసం అట్టి పెట్టుకున్నాడో ఏమో కానీ... ఈ భాగంలో కేవ‌లం పాత్ర‌ల్ని, ఆ క‌థా ప్ర‌పంచాన్ని మాత్రమే చూపించారు ద‌ర్శ‌కుడు. దాంతో రెండున్న‌ర గంట‌ల నిడివి ఉన్న ఈ సినిమా సాగ‌దీత‌లా అనిపిస్తుంది.  అడ‌వుల్లో ద‌ళాలు, వాళ్ల‌ని పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్ర‌య‌త్నాలు, వాళ్లిద్ద‌రి మ‌ధ్య న‌లిగిపోయే సామాన్యుల  చుట్టూ సాగే క‌థ‌లు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్తేమీ కాదు.  త‌ర‌చూ ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నాలు తెలుగులో త‌ర‌చూ తెర‌పైకొస్తూనే  ఉంటాయి. ఈ క‌థ త‌మిళ ప్రేక్ష‌కుల‌కు కొత్త‌ద‌నాన్ని పంచుతుందేమో కానీ, తెలుగు ప్రేక్ష‌కుల‌కు కాదు. ఈ సినిమా వ‌ర‌కు మెచ్చుకోద‌గిన‌దేమైనా ఉంటే... ద‌ట్ట‌మైన ఆ అడవుల చుట్టూ అత్యంత స‌హ‌జంగా స‌న్నివేశాల్ని తీర్చిదిద్ద‌డ‌మే.(Viduthala telugu review) ప్ర‌జాద‌ళం నాయ‌కుడి కుటుంబం ఉందంటూ ఊళ్లో ఉన్న జ‌నం అంద‌రినీ పిలిపించి వాళ్ల‌ని హింసించే స‌న్నివేశాలు మ‌న‌సుల్ని క‌లిచివేస్తాయి. ముఖ్యంగా మ‌హిళ‌ల నేప‌థ్యంలో సాగే ఆ స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు త‌న‌దైన శైలిలో తెర‌పైకి తీసుకొచ్చారు.  ప్రేమ‌క‌థలో కొత్త‌ద‌నం లేదు. ప్ర‌త్యేక‌ద‌ళంలో మ‌న‌స్సాక్షికి క‌ట్టుబడిన ఓ కిందిస్థాయి పోలీస్ జీవితం ఎలా ఉంటుందో? అధికారుల తీరు ఎలా ఉంటుందో? ఈ సినిమాలో బాగా చూపించారు. సూరి, విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ మేన‌న్ చుట్టూ సాగే  ప‌తాక స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. వాటితోనే పార్ట్‌-2పై ఆస‌క్తిని పెంచారు.

ఎవ‌రెలా చేశారంటే: పాత్ర‌ల‌కి త‌గ్గ న‌టుల్ని ఎంపిక చేసుకున్నారు ద‌ర్శ‌కుడు. కుమరేశ‌న్‌, పాప పాత్ర‌ల్లో అమాయ‌క‌త్వం క‌నిపిస్తుంది. ఆ పాత్ర‌ల‌కి త‌గ్గ‌ట్టుగా సూరి, భ‌వానీ శ్రీల‌ని ఎంపిక చేసుకోవ‌డం బాగుంది. ఆ ఇద్దరూ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.  క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే అని ప‌ట్టుబ‌డుతూ, క్రూరంగా వ్య‌వ‌హ‌రించే అధికారి పాత్ర‌లో చేత‌న్ అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌జాద‌ళం నాయ‌కుడైన పెరుమాళ్‌గా విజ‌య్ సేతుప‌తి క‌నిపించేది కొన్ని స‌న్నివేశాల్లోనే. కానీ ఆ ప్ర‌భావం సినిమా మొత్తం క‌నిపిస్తుంది. గౌత‌మ్ మేన‌న్‌,  రాజీవ్ మీన‌న్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది.  ఇది పీరియాడిక్ సినిమా కావ‌డంతో గ‌తాన్ని గుర్తు చేసేలా నేప‌థ్య  సంగీతం అందించారు ఇళ‌యరాజా. పాట‌లు ఆక‌ట్టుకుంటాయి. కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. (Viduthala telugu review) ప్రేక్ష‌కుల్ని ఆ అడ‌వుల్లో లీన‌మ‌య్యేలా చేస్తుంది. జ‌య‌మోహ‌న్ రాసిన ఓ చిట్టి క‌థ  ఆధారంగా ఈ క‌థ‌ని అల్లుకున్నాడు ద‌ర్శ‌కుడు. పాత్ర‌ల్ని బ‌లంగా ప‌రిచ‌యం చేశారు త‌ప్ప  తొలి భాగంలో క‌థంటూ ఏమీ లేదు. కానీ ఆయ‌న మేకింగ్ మాత్రం మెప్పిస్తుంది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. ప‌క్కాగా త‌మిళ నేల‌ని ఆవిష్క‌రించిన క‌థ కావ‌డంతో.. తెలుగులోనూ పాత్ర‌ల్ని కూడా అదే పేరుతోనే  చూపించారు.

బ‌లాలు: + క‌థా ప్ర‌పంచం; +నటీన‌టులు; + ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు: - సంఘ‌ర్ష‌ణ లేని క‌థ; - సాగ‌దీత‌గా ప్ర‌థ‌మార్ధం

చివ‌రిగా: విడుద‌ల‌.. వెట్రిమారన్‌ మార్క్‌ మూవీ!(Viduthala telugu review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు