Sherni movie review: రివ్యూ: షేర్నీ

విద్యాబాలన్‌ కీలక పాత్రలో నటించిన ‘షేర్నీ’ ఎలా ఉందంటే?

Updated : 18 Jun 2021 17:04 IST

చిత్రం: షేర్నీ; నటనటులు: విద్యాబాలన్‌, శరత్‌ సక్సేనా, విజయ్‌ రాజ్‌, అరుణ్‌, బ్రిజేంద్ర కాలా, నీరజ్‌ కబీ తదితరులు; సంగీతం: బందిష్‌ ప్రొజెక్ట్‌, ఉత్కర్ష్‌ ధోతేకర్‌; నేపథ్య సంగీతం: బెనిడిక్ట్‌ టేలర్‌, నరేన్‌ చందవర్కర్‌; సినిమాటోగ్రఫీ: రాకేశ్‌ హరిదాస్‌; ఎడిటింగ్‌: దీపికా కల్రా; నిర్మాత: భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, విక్రమ్‌ మల్హోత్ర, అమిత్‌ వి. మసర్కర్‌; దర్శకత్వం: అమిత్‌ వి. మసర్కర్‌; విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

మనిషికీ అడవికీ అవినాభావ సంబంధం ఉంది. అడవులు లేనిదే మానవ మనుగడ లేదు. కానీ, నాగరికత, అభివృద్ధి పేరుతో అడవులను సైతం మానవుడు కబళించి వేస్తున్నాడు. దీంతో ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటోంది. పులి/సింహం వంటి క్రూర జంతువులు జనావాసాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేయటం, క్రూరంగా చంపేయడం ఇలా ఎన్నో ఘటనలు మనం నిజ జీవితంలో చూస్తూనే ఉన్నాం. వెండితెరపైనా ఇలాంటి కథలతో పలు సినిమాలు వచ్చాయి. తాజాగా ఈ తరహా కథతో విద్యాబాలన్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘షేర్నీ’. ‘న్యూటన్‌’ వంటి వైవిధ్య కథను తెరకెక్కించిన వి.మసర్కర్‌ దీన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం థియేటర్లు అందుబాటు లేకపోవడంతో ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’వేదికగా ఈ సినిమా విడుదలైంది. మరి ఈ ‘షేర్నీ’ కథేంటి? విద్యాబాలన్‌ ఎలా నటించింది?

కథేంటంటే: మధ్యప్రదేశ్‌లోని ఓ అటవీ ప్రాంతానికి విద్యా విన్సెంట్‌(విద్యా బాలన్‌) డీఎఫ్‌ఓ(డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌)గా వెళ్తుంది. అదే అడవిలో రెండు పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తిస్తారు. వాటిలో టీ12 అనే ఓ పులి మనుషులపై దాడి చేసి చంపేస్తుంటుంది. విద్య తన సిబ్బందితో కలిసి ఆ పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. మరోవైపు ఆ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుండటంతో పులి దాడిని రాజకీయ లబ్ధి కోసం వాడుకొంటారు. మరి చివరకు పులిని విద్య పట్టుకుందా? రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎలాంటి పని చేశారు? తెలియాలంటే ‘షేర్నీ’ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ‘‘పులి ఉంటేనే అడవి.. అడవి ఉంటేనే వాన.. వాన ఉంటేనే నీరు.. నీరు ఉంటేనే మనం’’ అని సినిమాలో ఒక డైలాగ్‌ ఉంది. ‘షేర్నీ’ కథ ఇదే. అడవి, క్రూర జంతువుల వేట నేపథ్యంలో సాగే కథలు ఎన్నో వెండితెరపై సందడి చేశాయి. అవన్నీ హీరోయిజాన్ని, మాస్ ఎలిమెంట్స్‌ను మేళవించి తెరకెక్కించినవి. కానీ, ‘షేర్నీ’ అలా కాదు. మానవ మనుగడకు, అడవికీ ఉన్న సంబంధాన్ని చెబుతూనే నేటి సమాజంలో వేటగాళ్లలాంటి మగాళ్ల దుశ్చర్యలకు బలవుతున్న ఎందరో మహిళలు.. కాదు, ఆడ పులులలాంటి మహిళ జీవితాలను అంతర్లీనంగా స్పృశించాడు దర్శకుడు అమిత్‌ మసర్కర్‌. మనిషికీ-జంతువుకూ మధ్య జరిగే సంఘర్షణ.. చుట్టూ అల్లుకున్న కథల సమాహారం ‘షేర్నీ’.  అటవీ అధికారిగా విద్యాబాలన్‌ను పరిచయం చేస్తూ కథను మొదలు పెట్టిన దర్శకుడు, మనుషులపై ఒక పులి దాడి చేస్తోందన్న విషయాన్ని చెబుతూ నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

ప్రథమార్ధమంతా  విద్య, ఆమె సిబ్బంది పులిని పట్టుకునేందుకు ప్రయత్నం చేయటం, అందుకు స్థానిక రాజకీయ నాయకులు అడ్డు తగులుతుండటం తదితర సన్నివేశాలతో సాగుతుంది. పులిని చంపకుండా పట్టుకునేందుకు విద్య చెప్పే ఏ విషయాన్ని అవినీతికి అలవాటు పడిన పై అధికారులు పెద్దగా పట్టించుకోరు. పైగా ఒక మహిళా ఆఫీసర్‌ చెబితే వినాలా? అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. పురుషాధిక్య సమాజంలో మహిళా ఉద్యోగి ఏ స్థాయిలో ఉన్నా అవహేళనలు, వెక్కిరింపులు తప్పడం లేదన్న విషయాలను దర్శకుడు చెప్పాడు. ఫారెస్ట్‌ ఆఫీసర్‌ విద్య కనపడిన ప్రతి సారీ ఎవరో ఒకరు ‘ఈ కేసును డీల్‌ చేయడానికి ఒక మహిళా ఆఫీసరా?’ అంటూ ఎద్దేవాగా మాట్లాడటం  కనిపిస్తుంది. ఉద్యోగం చేస్తున్న మహిళలు అత్తవారింటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వారిపై ఎంత ఒత్తిడి ఉంటుందో విద్య పాత్ర ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్నాడు. మనిషి రక్తం రుచి మరిగిన పులిని చంపేందుకు వేటగాళ్లను ఏర్పాటు చేస్తారు అధికారులు. కానీ, పులిని చంపడం సరైన నిర్ణయం కాదని, దాన్ని పట్టుకుని, మరో ప్రాంతానికి తరలించాలని, విద్య, ఆమె సిబ్బంది చేసే ప్రయత్నాలు ఫలించవు. పులికోసం అటు వేటగాళ్లు, ఇటు విద్య ప్రయత్నించే సన్నివేశాలు ఉత్కంఠగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ‘నువ్వు పులి వేట కోసం వెళ్లినప్పుడు నువ్వు దాన్ని చూసేలోపు అది నిన్ను 100సార్లు చూసి ఉంటుంది’ వంటి సంభాషణలు మెప్పిస్తాయి.

ఎవరెలా చేశారంటే: విద్యా విన్సెంట్‌గా అటవీశాఖ అధికారి పాత్రలో విద్యా బాలన్‌ చక్కగా ఒదిగిపోయింది. ఇటు ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, అటు కుటుంబంలో వచ్చే ఒత్తిడులను మధ్య నలిగిపోయే సగటు మహిళగా చక్కని హావభావాలు పలికించింది. బ్రిజేంద్ర కాలా కామెడీ నవ్వులు పూయిస్తుంది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. బెనిడిక్ట్‌ టేలర్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకుడు లీనమయ్యేలా చేసింది. రాకేశ్‌ హరిదాస్ అడవి అందాలను తన కెమెరాతో చక్కగా చూపించాడు. అడవిలో జీపు ప్రయాణం, రాత్రి సన్నివేశాలు ఉత్కంఠగా తీర్చిదిద్దదాడు. దీపికా కల్రా ఎడిటింగ్‌ బాగుంది. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలకు నిడివి తగ్గిస్తే బాగుండేది. రాజ్‌కుమార్‌ రావ్‌తో ‘న్యూటన్‌’ లాంటి విభిన్న కథను తీసిన వి.మసర్కర్‌ మహారాష్ట్ర యవత్మాల్‌లో జరిగిన ‘అవని’ ఘటనను ఆధారంగా తీసుకుని ‘షేర్నీ’ తీర్చిదిద్దారు. 2018లో జరిగిన ఈ ఘటన యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. అవని ఘటన సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్లింది. అయితే, కేవలం ఆ ఘటననే కాకుండా, సమాజంలో మహిళులు ఎదుర్కొంటున్న అసమానతలను ఎత్తి చూపే ప్రయత్నం చేశాడు మసర్కర్‌.

బలాలు బలహీనతలు
+ విద్యా బాలన్‌ - నిడివి
+ దర్శకత్వం - కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు
+ సాంకేతిక బృందం పనితీరు  

చివరిగా: నటనతో గర్జించిన విద్యాబాలన్‌ ‘షేర్నీ’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని