anabelle sethupathi review: రివ్యూ: ‘అనబెల్‌ సేతుపతి’

విజయ్‌ సేతుపతి నటించిన ‘అనబెల్‌ సేతుపతి’ రివ్యూ

Published : 19 Sep 2021 01:19 IST

చిత్రం: అనబెల్‌ సేతుపతి; నటీనటులు: విజయ్‌ సేతుపతి, తాప్సీ, యోగిబాబు, వెన్నెల కిషోర్‌, రాజేంద్రప్రసాద్‌, రాధిక తదితరులు; సంగీతం: క్రిష్ణ కిషోర్‌; సినిమాటోగ్రఫీ: గౌతమ్‌ జార్జ్‌‌; ఎడిటింగ్‌: ప్రదీప్‌ రాఘవ్‌‌;  నిర్మాత: సుధన్‌ సుందరమ్‌, జి. జయరామ్‌‌ ; బ్యానర్‌: ప్యాషన్‌ స్టూడియోస్‌; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దీపక్‌ సుందరరాజన్‌; విడుదల: డిస్నీ+హాట్‌స్టార్‌

విజయ్‌సేతుపతి, తాప్సీలకు వైవిధ్యమైన సినిమాలందిస్తారనే పేరుంది. ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్తదనంతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తారు. ‘పిజ్జా’తో సేతుపతి, ‘గేమ్ ఓవర్’‌, ‘ఆనందో బ్రహ్మ’లతో తాప్సీలు హారర్‌ జానర్‌లో మంచి హిట్లు కొట్టారు. వాళ్ల కెరీర్‌ మలుపు తిప్పడంలో ఈ హారర్‌ చిత్రాలు కీలకంగా నిలిచాయి. వీరిద్దరూ కలిసి సినిమా తీస్తుండటంతో  కొత్తగా ఉంటుందనే అంచనాలు ఏర్పడ్డాయి. అలా వచ్చిన చిత్రమే ‘అనబెల్‌ సేతుపతి’. తాజాగా తెలుగుతో పాటు మొత్తం నాలుగు భాషల్లో డిజిటల్‌ వేదికగా విడుదలైంది. మరీ ఈ హారర్‌ కామెడీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం. 

కథేంటంటే: వీర సేతుపతి(విజయ్‌ సేతుపతి) తన ప్రేయసికి కానుకగా ఒక అద్భుతమైన రాజభవనాన్ని కట్టిస్తాడు. సకల సౌకర్యాలతో, సరికొత్త హంగులతో దర్జాగా ఉండే రాజకోటది. కొన్నాళ్లనుంచి నిర్మానుష్యంగా ఉంటుంది. అందులో ఉండేందుకు వెళ్లిన వారు వెళ్లినట్టే చనిపోయి ఆత్మలుగా మారిపోతారు.  కుటుంబంతో కలిసి దొంగతనాలు చేసే రుద్ర(తాప్సీ) తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. కొన్ని ఆత్మలు విముక్తి లభించక అందులోనే తిరుగుతుంటాయి. గతంలో ఆ రాజమహల్‌లోనే వంటవాడిగా పనిచేసిన సాంబయ్య(యోగిబాబు) ఆ దెయ్యాల గుంపుకి నాయకుడిగా ముందుకు నడిపిస్తుంటాడు. రుద్ర కుటుంబం అక్కడి దెయ్యాలతో ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? ఆ కోటకు రుద్రకు ఉన్న సంబంధమేంటి? కోటలోని ఆత్మలకు విముక్తి కలిగిందా? లేదా?  ఇంతకీ అనబెల్‌, వీర సేతుపతిలు ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

ఎలా ఉందంటే: పాడుబడ్డ కోట, అందులో చిక్కుకున్న ఆత్మలు, ప్రతీకారం చుట్టూ అల్లుకున్న కథాంశంతో చాలా సినిమాలే వచ్చాయి. ఎంచుకున్న పాయింట్‌ పాతదే. దీనికి కాస్త ఫాంటసీని జోడించి కథను చెప్పే ప్రయత్నంలో దర్శకుడు పూర్తిగా బోల్తా పడ్డాడు. లాజిక్‌లు లేని సన్నివేశాలు, హస్యం పండని పంచు డైలాగులతో సగటు ప్రేక్షకుడికి పరీక్ష పెట్టేలా ఉంటుందీ సినిమా. ‘అనబెల్‌ సేతుపతి’ కథంతా  కోటలోనే తిరుగుతుంది. తొలి అర్ధభాగంలో సాంబయ్య (యోగిబాబ్‌) తన ఆత్మల గ్యాంగ్‌ చేసే సందడి కొంత మేర నవ్వులు పూయిస్తుంది. రుద్ర కుటుంబం పడే పాట్లు, వారికి ఎదురయ్య వింత ఘటనలు గతంలో వచ్చిన హారర్‌ కామెడీ సినిమాల్లో చూసినట్లే అనిపిస్తుంది. ఇక ద్వితీయార్ధంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ మరింత  నిస్సారంగా ఉండి నిరుత్సాహానికి గురిచేస్తుంది.  హీరోహీరోయిన్ల  మధ్య రొమాన్స్‌ పండించే ప్రయత్నం జరిగినా అది ఏ కోశానా మెప్పించదు. ద్వితీయార్ధం చాలా నిదానంగా సాగుతుంది.  పతాక సన్నివేశాల్లోనూ కొత్తదనముండదు. హారర్‌ కామెడీగా వచ్చిన ఈ చిత్రంలో భయపెట్టే సన్నివేశం ఒక్కటి కూడా లేకపోవడం విడ్డూరం. యోగిబాబు గ్యాంగ్‌ చేసిన కామెడీ కొంత ఊరటినిస్తుంది. అదీ చెప్పుకోదగ్గ హాస్యమేమీ కాదు. ఫ్రేములనిండా కమెడియన్లతో అర్థంలేని సన్నివేశాలతో గందరగోళంగా ఉంటుంది. 

ఎవరెలా చేశారంటే: విజయ్‌ సేతుపతి హీరోగా చేసినా.. ద్వితీయార్ధంలోని ఫ్లాష్‌బ్యాక్‌, పతాక సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తాడు. హీరోగా ఆయనది తక్కువ నిడివి. తాప్సీ దొంగగా, సేతుపతి ప్రేయసిగా రెండు పాత్రలు చేసింది.  తాప్సీ  మంచి నటి అనే విషయం గతంలో వచ్చిన సినిమాలే చెబుతాయి. ఇందులో చూపించిన కొత్తదనమేమీ లేదు. ‘అనబెల్‌- సేతుపతి’ చిత్రాన్ని హాస్యనటుడు యోగిబాబు తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. సీనియర్‌ నటీనటులు రాధిక, రాజేంద్రప్రసాద్‌ ఆయా పాత్రలకు న్యాయం చేశారు. విలన్‌గా జగపతిబాబుకు ఇలాంటి పాత్రలు కొట్టినపిండి.  కథ, పాత్రలు, కథనాలను బలహీనంగా రాసుకొని సగటు ప్రేక్షకుడి ఓపికను పరీక్షించాడు దర్శకుడు దీపక్‌ సుందరరాజన్‌. మొదటి సినిమానే ఇంత పేలవమైన స్క్రీన్‌ప్లే రాసుకోవడం ఆశ్చర్యమనిపిస్తుంది. చాలా సీన్లలో లాజిక్‌లుండవు. హారర్‌ సినిమాల్లో ఉండే మేజిక్‌ ఎక్కడా కనిపించదు. ఇంకా చెప్పాలంటే ఇందులో అసలు హారరే కనిపించదు. గౌతమ్‌ జార్జ్‌ సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది.  రాజభవనాన్ని చాలా అందంగా చూపించారు. క్రిష్ణ కిషోర్‌ అందించిన సంగీతం ఫర్వాలేదు. ఫ్లాష్‌బ్యాక్‌లోవచ్చే మెలోడీ సాంగ్‌ వినసొంపుగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో కాస్ట్యూమ్స్‌ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. విజయ్‌ సేతుపతి కాస్ట్యూమ్స్‌ ఆయనకు ఏమాత్రం నప్పలేదు. ఉండేందుకు రిచ్‌గానే కనిపించినా ఆయనకు మాత్రం సరిగా కుదరలేదు. సినిమా నిండా మంచి నటులున్నా, వారి ప్రతిభను ఏ మాత్రం వాడుకోకుండా బోరింగ్‌ కథనంతో ప్రేక్షకులకు హారర్‌ చూపించాడు దర్శకుడు.

బలాలు 

+ యోగిబాబు పండించే హాస్యం

+ హీరోహీరోయిన్ల నటన

బలహీనతలు

ఫ్లాష్‌బ్యాక్‌

నిదానంగా సాగే కథనం

లాజిక్‌లు లేని సన్నివేశాలు

చివరగా: నవ్వించని, భయపెట్టని హారర్‌ కామెడీ ‘అనబెల్‌ సేతుపతి’

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని