Vijay Antony: కుమార్తె లేదన్న దుఃఖాన్ని దిగమింగుకుని.. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని!

తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ పెద్ద కుమార్తె ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుఃఖాన్ని దిగమింగుకుని విజయ్‌ తన కొత్త సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నారు.

Published : 29 Sep 2023 02:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాము నటించిన సినిమాలను ప్రేక్షకులకు చేరువయ్యేలా ప్రచారం చేయడంపై కొందరు నటులు ఆసక్తి చూపరు. కానీ, కుమార్తెను కోల్పోయిన పది రోజుల్లోనే తన సినిమా ప్రమోషన్‌లో పాల్గొని ఆదర్శంగా నిలుస్తున్నారు తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony). వ్యక్తిగత సమస్యల వల్ల సినిమాకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఆయన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైనట్లు సమాచారం. విజయ్‌ హీరోగా దర్శకుడు సీఎస్‌ ఆముదన్‌ తెరకెక్కించిన చిత్రం ‘రత్తం’ (Ratham). ఈ సినిమా అక్టోబరు 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం చెన్నైలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. దుఃఖాన్ని దిగమింగుకుని మరీ విజయ్‌ ఆంటోనీ రెండో కుమార్తెతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబంధిత ఫొటోలు నెట్టింట విడుదలకాగా అభిమానులు, పలువురు నెటిజన్లు నిబద్ధత కలిగిన నటుడంటూ విజయ్‌ని కొనియాడుతున్నారు. పెద్ద కుమార్తె లేదన్న బాధ నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో

విజయ్‌ పెద్ద కుమార్తె ఈ నెల 19న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 16 ఏళ్లకే బలవన్మరణానికి పాల్పడం అందరినీ కలచి వేసింది. ఇకపై తాను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తానని విజయ్‌ ఇటీవల అన్నారు. ‘‘నా పెద్ద కుమార్తె ఎంతో దయగలది. అంతకుమించి ధైర్యవంతురాలు. కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణం లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్లిపోయింది. ఆమె ఇప్పటికీ నాతోనే మాట్లాడుతోంది. తనతో పాటే నేనూ చనిపోయాను’’ అని ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘రత్తం’ సినిమా విషయానికొస్తే.. మీడియా, న్యాయవ్యవస్థల మధ్య ఉన్న బంధం ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇందులో పరిశోధక అధికారిగా, భిన్న కోణాలున్న వ్యక్తిగా విజయ్‌ కనిపించనున్నారు. హీరోయిన్‌ నందితా శ్వేత జర్నలిస్ట్‌గా నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని