Vijay Devarakonda: అభిమానులకు ‘లైగర్‌’ అంకితం

‘‘నా సినిమా విడుదలై రెండేళ్లవుతోంది. ఇంతకుముందు విడుదలైన చిత్రమూ పెద్దగా చెప్పుకునేది కాదు. అయినా ‘లైగర్‌’ విషయంలో అభిమానులు చేస్తున్న రచ్చ చూస్తుంటే ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. ఈ సినిమాని అభిమానులకే అంకితం చేస్తున్నా’’

Updated : 22 Jul 2022 10:15 IST

‘‘నా సినిమా విడుదలై రెండేళ్లవుతోంది. ఇంతకుముందు విడుదలైన చిత్రమూ పెద్దగా చెప్పుకునేది కాదు. అయినా ‘లైగర్‌’ (Liger) విషయంలో అభిమానులు చేస్తున్న రచ్చ చూస్తుంటే ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. ఈ సినిమాని అభిమానులకే అంకితం చేస్తున్నా’’ అన్నారు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda). ఆయన కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం   ‘లైగర్‌’. అనన్య పాండే (Ananya Pandey) కథానాయిక. అపూర్వ మెహతా, కరణ్‌ జోహార్‌తో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించారు. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా  ట్రైలర్‌ గురువారం విడుదలైంది. తెలుగు ట్రైలర్‌ని ప్రముఖ కథానాయకులు చిరంజీవి, ప్రభాస్‌ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చుని ట్రైలర్‌ని వీక్షించింది చిత్రబృందం. ఈ ప్రదర్శన అనంతరం విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం దేహాన్ని సిద్ధం చేయడం, పోరాట ఘట్టాలు చేయడం ఒకెత్తైతే, డ్యాన్స్‌ చేయడం మరో ఎత్తు. అభిమానులు ఆస్వాదించాలనే డ్యాన్సులు చేశా. సినిమా విడుదల రోజు  థియేటర్లో పండగ వాతావరణం కనిపించాలి. ప్రేక్షకులతో నిండిపోవాలి. ఆ రోజు భారతదేశం మొత్తం ఊగిపోతుంది’’ అన్నారు. పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ  ‘‘లైగర్‌ గురించి కాదు, విజయ్‌ గురించి చెబుతున్నా. భారతీయ సినిమా పరిశ్రమలో విజయ్‌ దేవరకొండ పెద్ద పాత్ర పోషించనున్నారు. కరణ్‌ జోహార్‌ ఈ చిత్రం విషయంలో మాకొక పెద్ద అండ. మనకు సినిమా అంటే ఎంత ఇష్టమో చూపించడానికే ఆయన్ని ఈ వేడుకకి పిలిపించా. నెల రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రం ఇదే స్థాయిలో అలరిస్తుంది’’ అన్నారు. కరణ్‌ జోహార్‌ (Karan Johar) మాట్లాడుతూ ‘‘లైగర్‌పై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఛార్మి, అపూర్వ మెహతా, అనన్య పాండే,   అనిల్‌ తడాని తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు