Liger: కొవిడ్‌ ఎఫెక్ట్‌.. విజయ్‌ దేవరకొండ, సల్మాన్‌ఖాన్‌ చిత్రాల షూట్‌ వాయిదా

రెండు సంవత్సరాలు.. రెండు వేవ్‌లతో కొవిడ్‌ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ‘ఇప్పటికైనా పరిస్థితి చక్కబడింది’ అని అనుకునేలోపు మరోసారి తన ఉద్దృతిని చూపిస్తోంది.

Published : 07 Jan 2022 18:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండు సంవత్సరాలు.. రెండు వేవ్‌లతో కొవిడ్‌ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ‘ఇప్పటికైనా పరిస్థితి చక్కబడింది’ అని అనుకునేలోపు మరోసారి తన ఉద్ధృతిని చూపిస్తోంది. రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారీ బడ్జెట్‌ చిత్రాలన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినిమాల విడుదలే కాదు ఇప్పుడు చిత్రీకరణలు వాయిదా పడుతున్నాయి. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని విజయ్‌ దేవరకొండ, సల్మాన్‌ఖాన్‌ తమ చిత్రాల షూటింగ్‌ను వాయిదా వేశారు.

ఇంట్లో సేదతీరుతున్న లైగర్‌

‘‘కొవిడ్ మళ్లీ తుపానులా విజృంభిస్తుండటంతో ‘లైగర్‌’ చిత్రీకరణ రద్దయింది. ఇంటికి తిరిగొచ్చేలా చేసింది’’ అని విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. తన ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని కనిపించారు. విజయ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. అనన్య పాండే కథానాయిక. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషించారు. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ  చివరి దశలో ఉంది. భారీ యాక్షన్‌ సన్నివేశాల షూట్‌తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని సినీ వర్గాల సమాచారం.

సల్మాన్‌ టైగర్‌ ఇలా..

సల్మాన్‌ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’. మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు టర్కీ, రష్యా, ముంబయి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను దిల్లీలో తెరకెక్కించాలని చిత్ర బృందం భావించింది. నాయకానాయికలపై 15 రోజులపాటు సాగాల్సిన షూటింగ్‌ వాయిదా పడినట్టు బాలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. కొవిడ్‌ కేసులు పెరుగుతుండటం, దేశ రాజధానిలో కొవిడ్‌ సంబంధిత ఆంక్షలు ఉండటంతో ఈ షెడ్యూల్‌ను చిత్ర బృందం రద్దుచేసుకుందట. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని