Liger Review: రివ్యూ: లైగర్‌

Liger Review: విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్‌ ఎలా ఉందంటే?

Updated : 25 Aug 2022 12:26 IST

Liger Review: చిత్రం: లైగర్‌; నటీనటులు: విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌, విషు రెడ్డి, అలీ, మైక్‌ టైసన్‌; సంగీతం: సునీల్‌ కశ్యప్‌, విక్రమ్‌ మాంట్రోస్‌, తనిష్‌ భాగ్చి; సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ; ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ; రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌; బ్యానర్‌: పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌; విడుదల తేదీ: 25-08-2022

హిందీలో ఒక్క సినిమా చేయ‌క‌పోయినా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay devarakonda). ఆయ‌న్ని ‘లైగ‌ర్‌’(Liger Review)తో పాన్ ఇండియా స్థాయిలో ప‌రిచ‌యం చేస్తున్నారు పూరి జ‌గ‌న్నాథ్‌. ఈ క‌ల‌యికే ఒక ప్ర‌త్యేకం అనుకుంటే... ఇందులో బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ న‌టించ‌డం మ‌రో ప్ర‌త్యేక‌త.  కొన్నాళ్లుగా దేశ‌మంతా ‘లైగ‌ర్’ ప్ర‌చార హోరు కొన‌సాగింది. ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకున్నాయి, అంచ‌నాల్ని రేకెత్తించాయి. పాన్ ఇండియా సినిమాల హంగామా కొన‌సాగుతున్న ఈ ద‌శ‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ‘లైగ‌ర్‌’ (Liger Review) ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..!

క‌థేంటంటే: మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ (ఎమ్‌.ఎమ్‌.ఎ)లో త‌న కొడుకు లైగ‌ర్ (విజ‌య్ దేవ‌ర‌కొండ)ని  జాతీయ ఛాంపియ‌న్‌గా చూడాల‌నేది బాలామ‌ణి (ర‌మ్య‌కృష్ణ) కోరిక‌.  త‌న భ‌ర్త కూడా ఫైట‌రే. అందుకే త‌న క‌ల కోసం క‌రీంన‌గ‌ర్ నుంచి ముంబై చేరుకుంటుంది. త‌న కొడుకుతో క‌లిసి ఓ టీస్టాల్ పెడుతుంది. జీవితంలో క‌ల నెర‌వేర్చుకోవాలంటే అమ్మాయిల జోలికి వెళ్ల‌కూడ‌ద‌ని బాలామ‌ణి త‌న కొడుకుకి చెబుతుంటుంది. కానీ,  తానియా (అన‌న్య‌ పాండే)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ అమ్మాయి మాత్రం లైగ‌ర్‌కి న‌త్తి ఉంద‌ని తెలిసి దూర‌మ‌వుతుంది. ప్రేమ‌లో ప‌డి విఫ‌లమైన లైగ‌ర్ త‌న క‌లని నెర‌వేర్చుకున్నాడా?  లేదా?  లైగ‌ర్ లాస్ వేగాస్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది  మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: ఓ సాధార‌ణ ప్రేమ‌క‌థ‌కి మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యాన్ని జోడించి తెర‌కెక్కించిన సినిమా ఇది (Liger Review).  కానీ, ఈ సినిమా ఎక్కువ‌గా ఎమ్.ఎమ్‌.ఎ క‌థ‌గానే ప్ర‌చార‌మైంది. ఆ నేప‌థ్యానికి త‌గ్గ సీరియ‌స్‌నెస్ ఎక్క‌డా క‌నిపించ‌దు. అక్క‌డ‌క్క‌డా కొన్ని స‌న్నివేశాలు మ‌రీ కామెడీగా అనిపిస్తాయి. ప్రేమ‌క‌థ‌లోనైనా బలం, కొత్త‌ద‌నం ఉందా అంటే అదీ లేదు.  లైగ‌ర్‌, తానియా  ఒక‌రికొక‌రు ప‌రిచ‌య‌మైన విధానం, వాళ్లు ప్రేమ‌లో ప‌డ‌టం, ఆ త‌ర్వాత విడిపోవ‌డం... ఎందులోనూ సంఘ‌ర్షణ క‌నిపించ‌దు. క‌థ ఏ ద‌శ‌లోనూ ఆస‌క్తి రేకెత్తించ‌దు. ప్ర‌తీ స‌న్నివేశం ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగుతుంది. విజ‌య్‌ని తెర‌పై చూపించిన విధానం మాత్రం మెప్పిస్తుంది.  ప్ర‌తినాయ‌కుడు, క‌థానాయిక స‌హా మిగ‌తా పాత్ర‌లేవీ మెప్పించ‌వు. ర‌మ్య‌కృష్ణ పాత్ర ప్ర‌థ‌మార్ధం వ‌ర‌కు ఫర్వాలేదు అనిపించినా, ద్వితీయార్ధంలో మ‌రీ నాట‌కీయంగా అనిపిస్తుంది. హీరో  అమెరికాలో ఫైట్ చేస్తుంటే, ఆమె టీవీ చూస్తూ అరుస్తూ, హీరోని ఎంకరేజ్ చేస్తుంటుంది. వాస్త‌విక‌త‌కి దూరంగా ఉండే అలాంటి స‌న్నివేశాలు ద్వితీయార్ధంలో బోలెడ‌న్ని. పూరి జ‌గ‌న్నాథ్ బ‌లం ర‌చ‌న‌. హీరో పాత్ర‌ని రాసే విధానం, వాళ్ల‌తో ప‌లికించే డైలాగులు సినిమాల‌కి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా (Liger Review) నిలుస్తుంటాయి.

కానీ, ఈ సినిమాలో  హీరోని న‌త్తి స‌మ‌స్య ఉన్న యువ‌కుడిగా చూపించేయ‌డంతో, పూరి త‌న చేతులు తానే క‌ట్టేసుకుని ఎమ్‌.ఎమ్‌.ఎ ఫైట్ చేయ‌డానికి రింగ్‌లోకి దిగిన‌ట్టైంది. కొత్త‌ద‌నం లేక‌పోయినా ప్ర‌థ‌మార్ధం వ‌ర‌కు ప‌ర్వాలేద‌నిపించినా, ద్వితీయార్ధంలో సినిమా గాడి త‌ప్పింది. హీరో జాతీయ ఛాంపియ‌న్ అయ్యాక, ఇంట‌ర్నేష‌న‌ల్ పోటీల కోసం ప‌డే సంఘ‌ర్ష‌ణ, స్పాన్స‌ర్‌షిప్ వ్య‌వ‌హారం త‌దిత‌ర స‌న్నివేశాలు ప‌ర‌మ సాదాసీదాగా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో ఫైట్ వ‌ర‌కు ఇది స్పోర్ట్స్ సినిమా అని గుర్తు చేస్తుంది. ప్ర‌చారంలో భాగంగా ముంబై వెళ్లిన‌ప్పుడు అక్క‌డ  మైక్ టైస‌న్ ఎవ‌ర‌ని అడిగార‌ని, వికీపీడియాలో తెలుసుకుని సినిమాకి ర‌మ్మ‌ని చెప్పాన‌న్నారు  పూరి. కానీ, మైక్ టైస‌న్ ఎవ‌రో తెలుసుకోకుండా ఈ సినిమా చూడ‌ట‌మే మేల‌నిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఫైట్ చూశాక‌. విజ‌య్‌కీ,  మైక్ టైస‌న్‌కీ మ‌ధ్య స‌న్నివేశాల్ని టైస‌న్ గురించి తెలిసిన ప్రేక్ష‌కులు జీర్ణించుకోవ‌డం క‌ష్ట‌మే.

ఎవ‌రెలా చేశారంటే: విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న మెప్పిస్తుంది. లైగ‌ర్ పాత్ర కోసం త‌నని తాను తీర్చిదిద్దుకున్న విధానం, న‌త్తి ఉన్న యువ‌కుడిగా త‌ను క‌నిపించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. పోరాట ఘ‌ట్టాల్లో అత‌ని క‌ష్టం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ర‌మ్య‌కృష్ణ పాత్ర ప్ర‌థ‌మార్ధం వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుంది. అన‌న్య పాండే అందంగా క‌నిపించింది కానీ, ఆమె పాత్ర సినిమాపై పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌దు. రోనిత్ రాయ్ కోచ్‌గా మెప్పిస్తాడు. విషు, చంకీ పాండే, అలీ, గెట‌ప్ శ్రీను పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా కెమెరా విభాగం త‌ప్ప మ‌రేదీ పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేదు. సంగీతం ఓకే అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ అక్క‌డ‌క్క‌డా మాత్ర‌మే త‌న మార్క్‌ని ప్ర‌ద‌ర్శించారు. నిర్మాణ విలువ‌లు  ఉన్న‌తంగా ఉన్నాయి.

బ‌లాలు

+ విజ‌య్ న‌ట‌న‌

ఎమ్‌.ఎమ్‌.ఎ నేప‌థ్యం

బ‌ల‌హీన‌త‌లు

- క‌థ‌నం

ద్వితీయార్ధం

చివ‌రిగా: లైగ‌ర్‌...  విజ‌య్‌లో ఫైట‌ర్ క‌నిపిస్తాడంతే! (Liger Review)

గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని