VijayDeverakonda: ఓవర్‌నైట్‌ స్టార్‌ కాదు

‘అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించలేరు. అద్భుతం జరిగాక ఎవరూ గుర్తించనవసరం లేదు’ ఖలేజా చిత్రంలోని ఈ డైలాగ్‌ యువ నటుడు విజయ్‌ దేవరకొండ విజయానికి ప్రతీకగా నిలుస్తుంది.

Published : 09 May 2021 10:14 IST

‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు. జరిగాక గుర్తించనవసరం లేదు’ ఖలేజా చిత్రంలోని ఈ డైలాగ్‌ యువ నటుడు విజయ్‌ దేవరకొండ విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. విజయ్‌ సినీ కెరీర్‌లో జరిగిన ఆ అద్భుతమే ‘అర్జున్‌ రెడ్డి’. ఈ సినిమా విజయ్‌ని యూత్‌ ఐకాన్‌గా నిలబెట్టి, ఓ తరాన్ని ప్రభావితం చేయగలిగే ఆత్మ విశ్వాసాన్నిచ్చింది. ఇదంతా ఒక్క రాత్రిలో సాధ్యమైంది కాదు. దాని వెనక ఎన్నో కష్టాలున్నాయి. మే 9 విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ సంగతులు తెలుసుకుందాం...

నాన్న కల..

విజయ్‌ దేవరకొండ స్వస్థలం అచ్చంపేట దగ్గర తుమ్మన్‌పేట. విజయ్ తండ్రి గోవర్ధన్‌రావుకి నటన అంటే ఆసక్తి. ఆ కోరికతోనే సొంతూరు వదిలి హైదరాబాద్‌ చేరుకున్నారు. హీరో అవకాశాల కోసం ప్రయత్నించి చివరకు టీవీ డైరెక్టరుగా మారారు. నటుడవ్వాలనే జిజ్ఞాస ఆయనలో అలానే ఉండటంతో విజయ్‌ నటనవైపు మొగ్గుచూపినా ఆయన ఏం అనేవారు కాదు. అలా అని విజయ్‌కి చిన్నప్పటి నుంచే నటనపై దృష్టి పెట్టలేదు. డిగ్రీ పూర్తయ్యాక నటించాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి నాన్న కలని తను నిజం చేసి చూపించాడు.

అలా నటుడిగా..

కాచిగూడ (హైదరాబాద్‌)లోని బద్రుకా కళాశాలలో బీకామ్‌ చదివే రోజుల్లో ఎక్కువగా ఇంట్లోనే గడిపేవాడు విజయ్‌. టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడని వాళ్ల నాన్న మందలించేవారు. ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో విజయ్‌కి నటనపై ఉన్న ఆసక్తిని గమనించి ఓ యాక్టింగ్‌ స్కూల్‌లో చేర్పించారాయన. అక్కడ ఎక్కువగా నాటకాలు ప్రదర్శిస్తుంచేవాడు విజయ్‌. ఇంకెన్నాళ్లు ఇలా సినిమాల్లోకి వెళ్లవా? అని ప్రశ్నించగా సినీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు విజయ్. అదే సమయంలో శేఖర్‌ కమ్ముల ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమా కోసం ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారని తెలుసుకుని, ఆడిషన్‌ ఇచ్చి ఈ సినిమాలో ఓ పాత్రకు ఎంపికయ్యాడు. అంతకు ముందు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నువ్విలా’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించాడు.

మలుపుతిప్పిన పెళ్లిచూపులు

‘నువ్విలా’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ తర్వాత నాని హీరోగా తెరకెక్కిన ‘ఎవడే  సుబ్రహ్మణ్యం’లో సహా నటుడిగా కనిపించాడు. రిషి పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనలోని సహజ నటుడ్ని గుర్తించిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ ‘పెళ్లి చూపులు’ చిత్రానికి కథానాయకుడిగా విజయ్‌ని ఎంపిక చేశాడు. కథ ఓకే అయింది కానీ, అప్పటికి విజయ్‌కి అనుకున్నంత ఫేమ్‌ రాకపోవడంతో అతనితో చిత్రాన్ని తీసేందుకు నిర్మాతలెవరూ ముందుకు రాని పరిస్థితి. తన స్నేహితుడు, నటుడు సుధాకర్‌ ద్వారా రాజ్ కందుకూరికి కథ వినిపించారు. బాగా నచ్చడంతో సినిమాని నిర్మించడానికి ఆయన ముందుకు వచ్చారు. విభిన్న కథాంశంతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది ఆ చిత్రం. జాతీయ స్థాయిలోనూ అవార్డు అందుకుంది. ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు విజయ్‌. ఆ తర్వాత ‘ద్వారక’ చిత్రం చేసినా ఆశించిన ఫలితం అందుకోలేకపోయాడు.

ఊహించని సంచలనం.. అర్జున్‌ రెడ్డి

ఇటు ప్రేక్షకులు.. అటు చిత్ర వర్గాలు ‘అర్జున్‌ రెడ్డి’ విషయంలో విజయ్‌ ఆరో చిత్రం.. దర్శకుడు సందీప్‌రెడ్డి నూతన పరిచయం అని లెక్కలు వేసుకున్నారు తప్ప ఇంతటి సంచలనం సృష్టిస్తుందని ఊహించలేదు. ‘వాళ్లే కాదు నేనే ఇంతటి విజయం సాధిస్తుందని అనుకోలేదు’ అని చెబుతుంటాడు విజయ్‌. బోల్డ్‌ కంటెంట్‌ అని ప్రముఖ కథానాయకులు (అల్లు అర్జున్‌, శర్వానంద్‌) తిరస్కరిస్తే వచ్చిన అవకాశం వదులుకోకూడదని పాత్రలో ఒదిగిపోయి, విజయ్‌ తప్ప మరెవ్వరూ ఇలా నటించలేరు అనిపించుకున్నాడు. తనదైన యాటిట్యూడ్‌, డైలాగులతో యువతరాన్ని తనవైపు తిప్పుకొన్నాడు. అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. రౌడీ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు.

జయపజయాలు..

‘అర్జున్‌ రెడ్డి’ తర్వాత వైవిధ్య కథల్ని ఎంపిక చేసుకున్నా అన్నీ విజయం సాధించలేకపోయాయి. ‘ఏ మంత్రం వేశావె’, ‘నోటా’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ మిశ్రమ స్పందన పొందగా.. ‘గీతగోవిందం’, ‘ట్యాక్సీవాలా’ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ‘మహానటి’లో కీలక పాత్ర పోషించి ఫిదా చేశాడు.

క్రేజ్‌ పెరుగుతూనే ఉంది..

తన సినిమాల ఫలితం ఎలా ఉన్నా విజయ్‌ నటనకు, ఆయన వ్యక్తిత్వానికి రోజురోజుకూ క్రేజ్‌ పెరుగుతూనే ఉంది. సోషల్‌ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్‌ చూస్తే ఇది అర్థమవుతుంది. మరోవైపు విజయ్‌ చిత్రాలు బాలీవుడ్‌ డబ్‌ అయి రికార్డులు సృష్టిస్తున్నాయి. అలా పరోక్షంగా హిందీ ప్రేక్షకుల్ని పలకరించిన విజయ్‌ త్వరలోనే ‘లైగర్‌’ సినిమాతో ప్రత్యక్షంగా అలరించనున్నాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న చిత్రమిది.

ఆ కష్టం తెలిసే..

కెరీర్‌ ప్రారంభంలో కథని ఓకే చేసి నిర్మాతల చుట్టూ తిరగాల్సిన సందర్భాలెన్నో చవిచూశాడు విజయ్‌. ఆ కష్టం తెలిసే కొత్త వాళ్లని ప్రోత్సహించేందుకు నిర్మాతగా మారాడు. కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్థాపించి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ‘నన్ను నమ్మి కొందరు నిర్మాతలు నాతో సినిమాలు తీయకపోతే ఎక్కడో ఉండేవాణ్ని. అందుకే రిస్క్‌తో కూడిన పనైనా మరికొందరికి అవకాశం కల్పించేందుకు ముందుకొచ్చాను’ అని అంటాడు విజయ్‌.

వ్యాపారంలోనూ..

చిత్ర నిర్మాణంతోపాటు వ్యాపారంలోనూ అడుగుపెట్టి తనదైన ముద్ర వేస్తున్నాడు విజయ్‌. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘రౌడీ’ పేరుతోనే వస్త్ర వ్యాపారాన్ని మొదలుపెట్టాడు.

సాయంలోనూ..

విజయ్‌ ఈ స్థాయికి చేరుకున్నా ఎక్కిన మెట్టుని వదిల్లేదు.. నడిచిన దారిని మరవలేదు అని చెప్పడానికి గతేడాది లాక్‌డౌన్‌లో చేసిన సాయమే నిదర్శనం. ‘మిడిల్‌ క్లాస్‌ ఫండ్‌’ పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎన్నో మధ్యతరగతి కుటుంబాల్లో ఆనందం నింపాడు.  సమాజంలో జరుగుతోన్న అన్యాయాలపై అప్పుడప్పుడూ తన గళం వినిపిస్తూనే ఉంటాడు.

 

ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన రికార్డు

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న నటుల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. ఆయన్ను అనుసరిస్తోన్న వారి సంఖ్య 11.6 మినియన్లకి పైగానే.

చిత్ర పరిశ్రమలో స్నేహితులు..

యువ కథానాయకుడు రానాని ఎక్కువగా కలుస్తుంటారు విజయ్‌. రానా ఇంటికి వెళ్లి సరదాగా కాసేపు మాట్లాడుతుంటాడు.

ట్రోల్స్‌ ఇష్టమే కానీ..

సినిమా ముందస్తు విడుదల వేడుకల్లో తనశైలిలో మాట్లాడి అందరిని ఆకర్షిస్తుంటాడు విజయ్‌. అయితే ఆ మాటలు కొందరిని మెప్పిస్తాయి.. మరికొందరిని నొప్పిస్తాయి. దాంతో సోషల్‌ మీడియాలో విజయ్‌పై రకరకాల ట్రోల్స్‌ వస్తుంటాయి. దీనికి తన సమాధానం ఇది. ‘నాపై చేసే విమర్శల్ని కూడా నేను ఇష్టపడతా‌. ఓ వ్యక్తి నన్ను ఎంతగా ఇష్టపడితే ట్రోల్‌ చేస్తాడో కదా. అయితే అవి రొటీన్‌గా ఉంటే మాత్రం నేను పట్టించుకోను.

నాయికల నోట విజయ్‌ మాట..

 

విజయ్‌కి అందం ఓ ప్లస్‌ పాయింట్‌. స్టైలిష్ లుక్‌, విభిన్న వస్త్రధారణతో యువతను ఎట్రాక్ట్ చేస్తుంటాడు. అందుకే బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ మీరు  ఏ హీరోతో నటించాలనుకుంటున్నారు? అని అడిగితే అందరూ చెప్పేది విజయ్‌ పేరే. సీనియర్‌ తారలు సైతం విజయ్‌ నా క్రష్ అంటుంటారు.

నా కష్టం ఎవరికీ తెలిదు..

ఓవర్‌నైట్‌ స్టార్‌ అనే మాట గురించి ఓ సందర్భంలో అడిగితే..  నా సినీ కష్టాలన్నీ తెరవెనక పడ్డాను. నేనెవరో తెలియని సమయంలో అవన్నీ ఎదుర్కొన్నాను. నా తొలి ఐదు సినిమాలకు ముందు ఎంతో కష్టపడ్డాను. ఆ కష్టమే ఇంతటి పేరు, ఇంతమంది అభిమానుల్ని అందించింది.

విజయ్‌కి వాళ్లమ్మ అంటే ఎంతో ప్రేమ. విజయ్‌కి ఓ సోదరుడు ఉన్నాడు. తనూ నటుడిగా మారాడు. ‘దొరసాని’, ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. పుట్టపర్తి సత్యసాయి పాఠశాలలో పదోతరగతి వరకు చదివాడు. అక్కడే ఇంటర్మీడియట్‌ చదవాల్సింది కానీ, తను అనుకున్న గ్రూపులో సీటు రాకపోవడంతో ఉప్పల్‌లోని లిటిల్‌ ఫ్లవర్‌ కాలేజీలో చేరాడు. పాఠశాల రోజుల్లో విజయ్‌ పుస్తక ప్రియుడనే విషయం చాలామందికి తెలియదు. కథలు చెప్పడం విజయ్‌కి మహా సరదా. నాలుగో తరగతిలోనే ‘మై బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎ మంకీ’ అనే పుస్తకం రాయలనుకున్నాడట.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని