Vijay Deverakonda: తెలుగు ప్రెస్‌మీట్‌ వివాదం.. స్పందించిన విజయ్‌ దేవరకొండ

‘లైగర్‌’ (Liger) ప్రమోషన్స్‌లో భాగంగా దక్షిణాది, ఉత్తరాదిలో వరుస ప్రెస్‌మీట్స్‌ నిర్వహిస్తున్నారు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), అనన్యా పాండే....

Published : 19 Aug 2022 13:13 IST

హైదరాబాద్‌: ‘లైగర్‌’ (Liger) ప్రమోషన్స్‌లో భాగంగా దక్షిణాది, ఉత్తరాదిలో వరుస ప్రెస్‌మీట్స్‌ నిర్వహిస్తున్నారు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), అనన్యా పాండే (Ananya Pandey). ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో విజయ్‌ ప్రవర్తనను తప్పుబడుతూ పలువురు విమర్శలు చేస్తున్నారు. దీనిపై తాజాగా విజయ్‌ స్పందిస్తూ.. జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయని చెప్పుకొచ్చారు. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో పలువురు తెలుగు జర్నలిస్టులతో విజయ్ - అనన్య ముచ్చటించారు. తమ సినిమా కబుర్లు వెల్లడించారు. అయితే, ఈ ప్రెస్‌మీట్‌లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ విజయ్‌ టేబుల్‌పై రెండు కాళ్లు పెట్టాడు. దీంతో.. పాన్‌ ఇండియా హీరో అయ్యే సరికి ఆయనకు పొగరు పెరిగిందని పలు వెబ్‌సైట్స్‌, సోషల్‌మీడియాల్లో వార్తలు కనిపించాయి.

ఈ ప్రచారంపై తాజాగా ఓ జర్నలిస్టు స్పందించాడు. ఆరోజు ప్రోగ్రామ్‌లో ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు. ‘‘విజయ్‌ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన మాతో ఎంతో సరదాగా ఉంటారు. ప్రెస్‌మీట్‌లో ఓ ఫిల్మ్‌ జర్నలిస్టు విజయ్‌ నటించిన ‘టాక్సీవాలా’ రోజుల్ని గుర్తు చేస్తూ..‘అప్పట్లో మీతో ఎంతో సరదాగా ముచ్చటించా. ఇప్పుడు మీరు పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా చేస్తున్నారు. మీతో ఫ్రెండ్లీగా మాట్లాడాలంటే కాస్త బెరుకుగా ఉంది’ అని చెప్పడంతో.. అతడిలోని భయాన్ని పొగొట్టడానికి.. ‘అవన్నీ పట్టించుకోవద్దు. మనం సరదాగా మాట్లాడుకుందాం. మీరు కాలు మీద కాలేసుకుని కూర్చొండి. నేనూ కాలు మీద కాలేసుకుని కుర్చుంటా’’ అని ఫ్రెండ్లీగా చెబుతూ అలా చేశారు. విజయ్‌ మాటలకు అక్కడున్న మేమంతా నవ్వుకున్నాం’’ అని వివరించాడు.

తాజాగా ఈ వీడియోని విజయ్‌ షేర్‌ చేస్తూ.. ‘‘తమ రంగాల్లో ఎదిగేందుకు ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎంతో మందికి టార్గెట్‌ అవుతారు. వ్యతిరేక ప్రచారాలు ఎదుర్కొంటారు. మనం తిరిగి వాటిపై పోరాటం చేస్తూనే ఉండాలి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, నీకు నువ్వు నిజాయతీగా ఉన్నప్పుడు.. ప్రజల ప్రేమ, దేవుడి దయ నిన్నెప్పటికీ రక్షిస్తూనే ఉంటాయి’’ అని రాసుకొచ్చారు. విజయ్‌ స్పందనతో నెగెటివ్‌ ప్రచారానికి తెర పడినట్లు అయ్యింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని