
క్షమాపణలు చెప్పిన విజయ్‌సేతుపతి
ఇంటర్నెట్ డెస్క్: తమిళ నటుడు విజయ్‌సేతుపతి క్షమాపణలు చెప్పాడు. తన పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా ప్రయత్నించి కేక్ కట్ చేయడమే ఇందుకు కారణం. కేక్ కోస్తే క్షమాపణలు చెప్పడం దేనికి అనుకుంటున్నారా..? ఆయన ఆ కేకును ఖడ్గంతో కోశారు మరి. ఆ ఫొటో కాస్తా వైరలైంది. ఇంకేముంది నెటిజన్లు విమర్శలు చేయడం ప్రారంభించారు. ‘‘గతంలో కొందరు సంఘవిద్రోహశక్తులు ఇలాగే చేసినందుకు వాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మరి ప్రముఖుల విషయంలో ఆ న్యాయం వర్తించదా..?’’ అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై నటుడు విజయ్ వివరణ ఇవ్వడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పాడు.
‘‘నా పుట్టినరోజు సందర్భంగా కేకును పెద్ద కత్తితో కోయడం వివాదానికి దారితీసింది. ప్రస్తుతం నేను పొన్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాను. ఆ చిత్రంలో ఖడ్గం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే చిత్రబృందం నాతో ఇలా చేయించింది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి’’ అని విజయ్ ట్వీట్ చేశాడు. తనదైన నటనతో దక్షిణాదిలో మంచి పేరు సంపాదించుకున్నాడు విజయ్‌సేతుపతి. ఆయన నటించిన ‘మాస్టర్’ ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తున్నాడు.
ఇదీ చదవండి..
మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు