Vijay sethupathi: విన్న కథలు 500.. చేసింది 50

పాత్రలో జీవించడం ఎలాగో తెలిసిన నటుడు విజయ్‌ సేతుపతి. అందుకే ఆయన నటించిన సినిమాలు చూస్తే తెరపై పాత్రే కనిపిస్తుంది తప్ప, ఆయన కనిపించడు. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే... మరోవైపు అగ్ర తారల సినిమాల్లో కీలక పాత్రల్లో ఒదిగిపోతుంటారు.

Published : 13 Jun 2024 04:35 IST

పాత్రలో జీవించడం ఎలాగో తెలిసిన నటుడు విజయ్‌ సేతుపతి. అందుకే ఆయన నటించిన సినిమాలు చూస్తే తెరపై పాత్రే కనిపిస్తుంది తప్ప, ఆయన కనిపించడు. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే... మరోవైపు అగ్ర తారల సినిమాల్లో కీలక పాత్రల్లో ఒదిగిపోతుంటారు. తెలుగు, తమిళం, హిందీ... ఎక్కడికెళ్లినా అంతే ప్రభావం చూపిస్తుంటారు. ఇటీవలే విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా ‘మహారాజ’ తెరకెక్కింది. నితిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఎస్వీఆర్‌ సినిమా పతాకంపై ఈ నెల 14న తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విజయ్‌ సేతుపతి బుధవారం విలేకర్లతో ముచ్చటించారు.

50వ సినిమా అని ప్రత్యేకంగా ఈ కథని ఎంచుకున్నారా? 

ప్రత్యేకంగా ఇది నా యాభయ్యో సినిమాగా ఉండాలని ఎంచుకుని చేసిన కథే ఇది. విన్నప్పుడే ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. కథ కంటే కథనం నన్నెంతగానో ప్రభావితం చేసింది. ‘పిజ్జా’ సినిమాని గుర్తు చేసింది. అంత ఆసక్తికరమైన మలుపులు ఇందులో ఉంటాయి. దర్శకుడు ఈ కథ చెప్పిన వెంటనే నా యాభయ్యో సినిమా ఇదే  అని ప్రకటించాం. 

ఈ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది?

విడుదలైన నా సినిమాలు 50 మాత్రమే కావొచ్చు. కానీ నేను 500 కంటే ఎక్కువ కథలు విన్నా. ఎంతో మందిని కలిశా. విజయాలు చూశా, పరాజయాలూ చూశా. ప్రతి ఫలితం తర్వాత ఏం జరిగిందో ఆలోచిస్తాం కదా. అలా ఎంతో అనుభవాన్ని సంపాదించా. ఇదొక గొప్ప ప్రయాణం. 

యాభై సినిమాల మైలురాయిని దాటారు కదా, తదుపరి కెరీర్‌ పరంగా ప్రత్యేక వ్యూహాలు, ప్రణాళికలేమైనా ఉన్నాయా? 

గతాన్ని మోసుకుంటూ ప్రయాణం చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇదివరకటిలాగే ఇకముందు కూడా నా కెరీర్‌ కొనసాగుతుంది. కలలు, అంచనాలు ఎప్పుడూ భారమే. అందుకే రోజూ కెమెరా ముందుకు కొత్తగా వెళతాను. సినిమా విషయంలో అదే రకమైన థ్రిల్‌తో ఉంటా. ఇకపైనా ఇంతే బాధ్యతతో పనిచేయడమే నా వ్యూహం. 

గతంలో మీరు చేసిన సినిమాలకీ, ‘మహారాజ’కీ మధ్య వ్యత్యాసం ఏమిటంటే?

ఇది ఎప్పుడూ వచ్చే కమర్షియల్‌ సినిమాల్లా ఉండదు. అలాగని ఆర్ట్‌ సినిమా కాదు. తన కుటుంబాన్ని సంరక్షించుకోవడం కోసం ఓ వ్యక్తి ఏం చేశాడు? ఎంత దూరం వెళ్లాడనేది ఈ సినిమాలో ఆసక్తికరం. దర్శకుడు నితిలన్‌ ప్రతి పాత్రనీ ఎంతో బలంగా మలిచారు. నిర్మాత సుధన్‌తో ఇది నాకు మూడో చిత్రం. అజనీష్‌ సంగీతం ప్రధాన బలం. 

దర్శకత్వం  ఎప్పుడు చేస్తారు?

మంచి కథ కుదిరితే తప్పకుండా దర్శకత్వం చేస్తా. మూడు సినిమాలకి కథ, స్క్రీన్‌ప్లే రాశాను. మరికొన్ని కథలూ రాసుకున్నా. కథానాయకుడిగా ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నా. హిందీలో ఓ సినిమా చేస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని