Vikramarkudu Review: రివ్యూ: విక్రమార్కుడు

విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించిన ‘విక్రమార్కుడు’ ఎలా ఉందంటే?

Updated : 11 Jul 2021 15:46 IST

చిత్రం: విక్రమార్కుడు; నటీనటులు: విజయ్‌ సేతుపతి, సాయేషా, మడోనా సెబాస్టియన్‌, యోగిబాబు, సురేశ్‌ చంద్ర మేనన్‌ తదితరులు; సంగీతం: సిద్ధార్థ్‌ విపిన్‌; సినిమాటోగ్రఫీ: డుడ్లీ; ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌; నిర్మాత: విజయ్‌ సేతుపతి, అరుణ్‌ పాండియన్‌, డాక్టర్‌ కె.గణేశ్‌, ఆర్‌.ఎం.రాజేశ్‌కుమార్‌; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్‌; విడుదల: ఆహా

మిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు విజయ్‌ సేతుపతి. తొలి నుంచి వైవిధ్య పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ఇటీవల కాలంలో నేరుగా తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా గోకుల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ యాక్షన్‌ కామెడీ చిత్రం ‘జుంగా’. బాక్సాఫీస్‌ వద్ద అలరించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇందులో విజయ్‌ సేతుపతి పాత్ర ఏంటి?ఆయన ఎలా నటించారు? తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందా?

కథేంటంటే: జుంగా(విజయ్‌ సేతుపతి) కండక్టర్‌గా పనిచేస్తుంటాడు. తను పనిచేసే రూట్‌లో రోజూ బస్సు ఎక్కే తమిళ అమ్మాయి (మడోనా సెబాస్టియన్‌)ను ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని కొందరు ఆకతాయిలు ఏడిపిస్తుంటే వారిని చితక్కొడతాడు. ఈ విషయం తెలిసిన జుంగా తల్లి(శరణ్య) కోప్పడుతుంది. జుంగా తండ్రి, తాతలు ఇలా గొడవలకు వెళ్లి.. కుటుంబాన్ని సర్వనాశనం చేశారని, అందుకే తనని వాటికి దూరంగా తీసుకొచ్చి పెంచుతున్నానని చెబుతుంది. తన తండ్రి, తాతను మోసం చేసి, సినిమా ప్యారడైజ్‌ అనే థియేటర్‌ను రెడ్డి(సురేశ్‌ చంద్రమేనన్‌) తక్కువ ధరకే దక్కించుకున్నాడన్న విషయం తల్లి ద్వారా జుంగాకు తెలుస్తుంది. దీంతో ఆ థియేటర్‌ను ఎలాగైనా తిరిగి సొంతం చేసుకోవాలని తన స్నేహితుడు యోయో(యోగిబాబు)తో కలిసి చెన్నై బయలుదేరతాడు జుంగా. థియేటర్‌ కోసం జుంగా ఏం చేశాడు? డాన్‌లా ఎలా మారాడు? రెడ్డి కూతురు యాళిని(సయేషా) ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: హీరో కుటుంబాన్ని మోసం చేసే విలన్‌.. హీరో అతడి దగ్గరకు వెళ్లి తన తండ్రి, తాత ఆస్తులను తిరిగి ఇచ్చేయమని చెప్పడం.. అప్పుడు హీరోను విలన్‌ అవమానించడం.. ఆ వెంటనే హీరో సవాళ్లు, ప్రతిజ్ఞలు చేయటం.. ఈ పాయింట్‌తో ప్రతి భాషలోనూ కొన్ని వందల సినిమాలు వచ్చాయి. రొటీన్‌ ఫార్ములా అయినా, ఆసక్తిగా తెరకెక్కించిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అదే థీమ్‌తో తెరకెక్కిన తమిళ చిత్రం ‘జుంగా’ ఇప్పుడు ‘విక్రమార్కుడు’గా డబ్‌ అయింది. జుంగా కండక్టర్‌గా పనిచేయడం, తమిళ అమ్మాయితో ప్రేమ, గొడవలు.. జుంగా గతాన్ని అతని తల్లి చెప్పడం ఇలా ప్రథమార్ధమంతా పరమ రొటీన్‌గా, విసుగెత్తించేలా సాగుతుంది. దానికి తోడు పాత తమిళ సినిమాల్లో పాత్రలు ఏవిధంగా అతిగా ప్రవర్తిస్తాయో అలాగే అందరూ నటిస్తారు. ఆఖరికి విలక్షణ నటుడిగా పేరున్న విజయ్‌ సేతుపతి కూడా అలాగే నటిస్తుండటం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా రుచించదు. సీన్‌కు అవసరమైనంత కాకుండా తమ ప్రతిభనంతా చూపించాలని నటిస్తునట్లు ప్రతి సన్నివేశం సాగుతుంది.

ఎప్పుడైతే రెడ్డిపై జుంగా సవాల్‌ విసురుతాడో అప్పటి నుంచి కథ కాస్త ఆసక్తిగా ఉంటుంది. రెడ్డి కూతురు యాళిని కోసం జుంగా, యోయోలు పారిస్‌ వెళ్తారు. అక్కడ వచ్చే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. డబ్బులు పొదుపు చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు నవ్వులు పంచుతాయి. యాళినిని కిడ్నాప్‌ చేసి, రెడ్డిని బెదిరిద్దామనుకున్న జుంగాకు ఊహించని ట్విస్ట్‌ ఎదురవుతుంది. దాని నుంచి అతను ఎలా బయటపడ్డాడు? చివరకు తన థియేటర్‌ను ఎలా దక్కించుకున్నాడన్నది క్లైమాక్స్‌. పతాక సన్నివేశాలు రొటీన్‌గా ఉన్నా పర్వాలేదు. ప్రథమార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధం కాస్త ఉపశమనం. యోగిబాబు లేకపోతే అది కూడా చప్పగా పరమ బోరింగ్‌గా సాగేది.

ఎవరెలా చేశారంటే: మంచి కథలు, పాత్రలు ఎంచుకునే నటులు అప్పుడప్పుడు ఇలాంటి రొటీన్‌ ఫార్ములాలను ఎందుకు ఎంచుకుంటారో తెలియదు. తెలుగులోనూ ఇలాంటి కథానాయకులు ఉన్నారు. బహుశా ఇతరులను నొప్పించటం ఇష్టంలేక, ముందుగా చేసిన వాగ్దానాల కారణంగా ఇలాంటి సినిమాలు చేయాల్సి వస్తుందేమో. విజయ్‌సేతుపతి కూడా అలాగే చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఫార్ములా కొత్తదేమీ కాదు. తెలుగులో అల్లరి నరేశ్‌ ఇలాంటి పాత్రలు అలవోకగా చేసేశారు. అలాంటి పాత్రలో విజయ్‌ సేతుపతిని చూడటం కాస్త కష్టమే. పైగా ప్రథమార్ధంలో హీరో పాత్ర ప్రవర్తించే తీరు అసాధారణం. కథానాయికలు మడోనా సెబాస్టియన్‌, సాయేషాలు పర్వాలేదు. యోగిబాబు ఈ సినిమాకు ప్రధానబలం. చాలా వరకూ తనదైన టైమింగ్‌తో మెప్పించాడు. ఒకప్పుడు తెలుగులో బ్రహ్మానందం ఏవిధంగానైతే సినిమాకు బలం అయ్యేవారో అలాగే చాలా చోట్ల కథను తన భుజాలపై మోశారు. మిగిలిన పాత్రల్లో నటులు పరిధి మేరకు నటించారు.

సిద్ధార్థ్‌ విపిన్‌ సంగీతం ఓకే. అయితే, గుర్తుండిపోయే పాట ఒక్కటీ లేదు. డూడ్లీ కెమెరా బాగుంది. పారిస్‌ అందాలను చక్కగా చూపించారు. వి.జె. సాబు జోసెఫ్‌ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సిందే. తెలుగులో డబ్‌ చేసినప్పుడైనా పాటలకు కత్తెర వేసి ఉంటే బాగుండేది. దర్శకుడు గోకుల్‌ పాత, రొటీన్‌ ఫార్ములా కథను ఎంచుకున్నాడు. ఈ కథకు విజయ్‌సేతుపతి కాకుండా మరో హీరోను ఎంచుకుని ఉంటే బాగుండేది. సన్నివేశాల్లో కూడా కొత్తదనం లేదు. ఇక తెలుగు డబ్బింగ్‌ వరకూ పర్వాలేదు. అయితే టైటిల్‌ గంభీరంగా ‘విక్రమార్కుడు’ అని పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటో తెలియదు. తమిళంలో పెట్టినట్లే ‘జుంగా’ అని పెడితే సరిపోయేది.

బలాలు

+ ద్వితీయార్ధం

+ యోగిబాబు - విజయ్‌ సేతుపతి మధ్య వచ్చే సీన్లు

బలహీనతలు

- ప్రథమార్ధం

- తెలిసిన కథ కావటం

- తమిళ ఓవరాక్షన్‌

చివరిగా: రొటీన్‌ ‘విక్రమార్కుడు’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని