Vikram: ‘కోబ్రా’లో పది వేరియేషన్స్‌ ఉంటాయి.. అయితే, ఆ విషయంలో ఎంతో బాధపడ్డా: విక్రమ్‌

‘కోబ్రా‌’ తెరకెక్కించే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కష్టపడి దాన్ని పూర్తి చేశామని నటుడు విక్రమ్‌ అన్నారు....

Published : 28 Aug 2022 17:28 IST

హైదరాబాద్‌: ‘కోబ్రా‌’ తెరకెక్కించే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కష్టపడి దాన్ని పూర్తి చేశామని నటుడు విక్రమ్‌ (Vikram) అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘కోబ్రా’ (Cobra) ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఇందులో విక్రమ్‌ మాట్లాడుతూ.. ‘‘మా దర్శకుడు అజయ్‌ సినిమా పనిలోనే ఉన్నారు. అందుకే ఇక్కడికి రాలేకపోయారు. తెలుగు ప్రేక్షకులు నా సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. ఈ కథ నాకు బాగా నచ్చింది. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేసి మీ ముందుకు తీసుకురావాలనుకున్నాం. కాకపోతే కరోనా కారణంగా ఆలస్యమైంది. మైనస్‌ 35 డిగ్రీల వాతావరణంలోనూ కష్టపడి సినిమా చేశాం. అసిస్టెంట్‌ డైరెక్టర్లకు ముక్కులో నుంచి రక్తం వచ్చిన సందర్భాలున్నాయి’’

‘‘ఇందులో నేను చాలా రోల్స్‌ చేశా. ప్రతి రోల్‌ కోసం ఐదు గంటలపాటు మేకప్‌ వేసుకునేవాడిని. ప్రతి పాత్రని ఎంజాయ్‌ చేశా. అందువల్ల ఏదీ కష్టంగా అనిపించలేదు. ఇదొక సైకలాజికల్‌‌, యాక్షన్‌ థ్రిల్లర్‌‌. ఈ సినిమా ప్రారంభించే సమయంలో శ్రీనిధి శెట్టి నటించిన ‘కేజీయఫ్‌’ విడుదలైంది. అప్పుడు ఆమె ఇండస్ట్రీకి కొత్త. కానీ, ఇప్పుడు పెద్ద స్టార్‌ అయ్యింది. ‘కోబ్రా’లో ఆమె చక్కగా నటించింది’’ అని విక్రమ్‌ తెలిపారు.

ఈ సినిమాలో మీరు మొత్తం ఎన్ని వేరియేషన్స్‌ చేశారు?

విక్రమ్‌: దాదాపు 10 వేరియేషన్స్‌. పోస్టర్స్‌లో 8 కనిపిస్తాయి. మిగిలినవి చిన్న గెటప్‌లు మాత్రమే. ఈ సినిమాలో నేను లెక్కల టీచర్‌గా కనిపిస్తా. వాస్తవానికి చిన్నప్పటి నుంచి నాకు గణితశాస్త్రమంటే ఇష్టం లేదు. స్కూల్‌లో టీచర్స్‌ కూడా మందలించేవారు. అలాంటిది ఇప్పుడు నేను లెక్కల టీచర్‌గా చేస్తున్నా.

సినిమాల విషయంలో కమల్‌ హాసన్‌ని స్ఫూర్తిగా తీసుకున్నారా?

విక్రమ్‌: కథ నచ్చి పాత్ర డిమాండ్‌ చేస్తే నేను ఎలాంటి సాహసమైనా చేస్తా. ‘నాన్న’ కోసం సమయంలోనూ చిన్న ప్రయోగం చేశా. మొదట డ్రెస్సింగ్‌ స్టైల్‌ మార్చా. ఎలాంటి తేడా కనిపించలేదు. దాంతో హెయిర్‌స్టైల్‌ మార్చా. జుత్తుని చిందరవందర కట్‌ చేయించుకున్నా.

‘కోబ్రా’ అంటే ఏమిటి?

విక్రమ్‌: పాము మాదిరిగానే నేనూ ఈ సినిమాలో సమయానుగుణంగా మారుతుంటా. లెక్కల టీచర్‌ మెయిన్‌ రోల్‌. అందులోనే నటన పరంగా మూడు రకాల వేరియేషన్స్ చూపిస్తా. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో ఇదే ఎక్కువ కష్టంగా అనిపించింది. నటన పరంగానే కాకుండా డబ్బింగ్‌లోనూ సుమారు ఆరు రకాల వాయిస్‌లు మార్చా. 

ఇకపై సినిమాలు వరుసగా చేస్తారా? లేదా బ్రేక్‌ తీసుకుంటారా?

విక్రమ్‌: చిన్నప్పటి నుంచే నాకు నటన అంటే ఇష్టం. కమర్షియల్‌, బాక్సాఫీస్‌ నంబర్స్‌, మార్కెట్‌పై కంటే నటనపైనే ఎక్కువగా శ్రద్ధ పెట్టాలనుకున్నా. అలా, సినిమా సినిమాకీ గ్యాప్‌ తీసుకున్నా. ఇకపై ఎక్కువ బ్రేక్‌ తీసుకోకుండా వరుస సినిమాల్లో చేయాలని కరోనా సమయంలో నిర్ణయించుకున్నా. అందుకే వరుసపెట్టి ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తున్నా.

‘అపరిచితుడు’తో దేశంలో ఉన్న ఇబ్బందులపై మాట్లాడారు. మరి, ఈ సినిమాలో దేని గురించి చూపించారు?

విక్రమ్‌: ఇది కేవలం మెస్సేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా కాదు. లవ్‌, ఎమోషనల్‌గా సాగే కథ ఇది.

ప్రతి పాత్ర కోసం మీరెంతో కష్టపడుతున్నారు కదా? ఇంత కష్టపడటానికి ఏ విషయం ప్రభావితం చేస్తోంది?

విక్రమ్‌: సాధారణంగా ఉండే పాత్రలు చేసి బోర్‌ కొట్టింది. విభిన్నమైన పాత్రలు చేయాలని ఆసక్తి ఉంది. ఎందుకంటే నటన అంటే నాకు పిచ్చి. మా నాన్నగారు స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌. నటుడు కావాలనుకుని సొంత ఊరు నుంచి మద్రాస్‌ వచ్చారు. ఆయన వల్లే నాక్కూడా ఈ రంగంపై ఆసక్తి వచ్చింది. ఆయన కలను నేను ఇలా నెరవేరుస్తున్నా.   

‘కోబ్రా’ చేయడానికి కారణమేమిటి?

శ్రీనిధి శెట్టి: విక్రమ్‌‌, అజయ్‌ వర్క్. కథ విన్నా వెంటనే చేస్తానని చెప్పా.

యశ్‌, విక్రమ్‌లో మీకు బాగా నచ్చిన లక్షణాలు?

శ్రీనిధి శెట్టి: యశ్‌, విక్రమ్‌లో ఉన్న కామన్‌ విషయం ఇద్దరికీ పొడవాటి జుత్తు, గడ్డం. ఇద్దరూ మంచి వ్యక్తులు. పట్టుదల, శ్రద్ధతో పనిచేస్తుంటారు.

ఇర్ఫాన్‌ పఠాన్‌ని ఎంచుకోవాలనేది ఎవరి ఆలోచన?

విక్రమ్‌: దర్శకుడు అజయ్ ఆలోచన అది. ఇందులో ఇర్ఫాన్‌ టర్కీష్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. 

మీరూ మీ అబ్బాయి కలిసి నటించిన ‘మహాన్‌’ ఓటీటీలో విడుదలైంది. దానిపై మీ అభిప్రాయం?

విక్రమ్‌: ఆ విషయంలో నాకెంతో బాధగా అనిపించింది. మేమిద్దరం కలిసి నటించిన ఆ చిత్రాన్ని థియేటర్‌లో చూడాలనుకున్నా. కాకపోతే కరోనా కారణంగా ఏమీ చేయలేని పరిస్థితిలో దాన్ని ఓటీటీలో విడుదల చేశాం. పర్వాలేదు భవిష్యత్తులో మేమిద్దరం కలిసి మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటాం.

ఇప్పుడు ఎక్కడ చూసినా బాయ్‌కాట్‌ ట్రెండ్‌ నడుస్తోంది? దానిపై మీ అభిప్రాయం?

విక్రమ్‌: ప్రస్తుతానికి నా ఆలోచన అంతా ‘కోబ్రా’పైనే ఉంది. 

ఇటీవల నేను అనారోగ్యానికి గురైనప్పుడు కొన్ని సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ఏవేవో వార్తలు చూశా. నా ఫొటోకి దండ వేసేసి, కొంతమంది హీరోలు కన్నీటి పర్యంతమవుతున్నట్లు ఏవేవో రాసేశారు. వాటిని చూసి ఇంట్లో వాళ్లు షాకయ్యారు. - విక్రమ్‌


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని