Vikram: విక్రమ్‌ వచ్చేస్తున్నాడు.. ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే..!

విశ్వనటుడు కమల్‌హాసన్‌(Kamal Haasan) రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘విక్రమ్‌’ (Vikram) రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్...

Updated : 29 Jun 2022 12:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విశ్వనటుడు కమల్‌హాసన్‌(Kamal Haasan) రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘విక్రమ్‌’ (Vikram) ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney plus Hotstar) వేదికగా జులై 8 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఓ స్పెషల్‌ వీడియోని షేర్‌ చేసింది. ఇందులో కమల్‌.. ‘‘మనకు నచ్చిన చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా చాల్లేదు కదూ. పదండి చూసుకుందాం డిస్నీ+హాట్‌స్టార్‌లో’’ అని చెప్పుకొచ్చారు. లోకేశ్‌ కనకరాజ్‌(Lokesh Kanakaraj) దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూళ్లు రాబట్టింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi), ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh fazil) కీలకపాత్రలు పోషించారు. నటుడు సూర్య (Surya) ‘రోలెక్స్‌’గా(Rolex) అతిథి పాత్రలో అదరగొట్టేశారు.

అసలు విక్రమ్‌ కథేంటంటే:

‘విక్రమ్‌’... పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. గ్యాంగ్‌స్టర్‌, ఆయన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీస్‌ బృందానికి మధ్య జరిగే పోరు ఇది. ఇందులో కమల్‌హాసన్‌.. కర్ణన్‌ అనే పాత్రలో నటించారు. భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్న పోలీస్‌ అధికారి ప్రభంజన్‌, ఆయన తండ్రి కర్ణన్‌ (కమల్‌హాసన్‌)ను ఓ ముఠా చంపేస్తుంది. ఈ డ్రగ్స్‌ దందాను నిలువరించి, హత్యలకు పాల్పడుతున్న ఆ ముఠాను పట్టుకునేందుకు అమర్‌(ఫహద్‌ ఫాజిల్‌) అనే స్పై ఏజెంట్‌, అండర్‌ కవర్‌ ఆఫీసర్‌ రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తు చేస్తోన్న సమయంలో ఈ డ్రగ్స్‌ మాఫియా వెనుక సంతానం (విజయ్‌ సేతుపతి) హస్తం ఉన్నట్లు గుర్తిస్తాడు. అంతేకాకుండా కర్ణన్‌ బతికే ఉన్నట్లు తెలుసుకుంటాడు. అసలు కర్ణన్‌ ఎవరు? చనిపోయినట్లు ఎందుకు బయట ప్రపంచాన్ని నమ్మించాడు? అమర్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు? రోలెక్స్‌ (సూర్య) పాత్ర ఏమిటి?.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో లోకేశ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని