Vimanam Movie Review: రివ్యూ: విమానం.. సముద్రఖని, అనసూయల చిత్రం ఎలా ఉంది?

Vimanam Movie Review: సముద్రఖని, అనసూయ, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘విమానం’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 09 Jun 2023 09:48 IST

Vimanam Movie Review: చిత్రం: విమానం: న‌టీనటులు: స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్ త‌దిత‌రులు; సినిమాటోగ్రఫీ: వివేక్ కాలేపు; ఎడిటింగ్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌; సంగీతం: చ‌ర‌ణ్ అర్జున్‌; ఆర్ట్‌‌: జె.జె.మూర్తి; పాట‌లు: చరణ్ అర్జున్‌; సంభాష‌ణ‌లు: హ‌ను రావూరి (తెలుగు); నిర్మాణం: జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌); ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శివ ప్ర‌సాద్ యానాల‌; సంస్థ‌: జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌; విడుదల‌: 09-06-2023

వేస‌విలో అగ్ర తార‌ల సినిమాల విడుద‌ల‌లు అంతంత మాత్ర‌మే.  దాంతో వారం వారం ప‌రిమిత వ్య‌యంతో రూపొందిన సినిమాలు థియేట‌ర్ల‌కి పోటెత్తుతూ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాయి. బ‌ల‌మైన ఈ సీజ‌న్  చిన్న సినిమాల‌కి ఓ మంచి త‌రుణంలా మారింది. ఈ వారం విడుద‌లైన చిన్న సినిమాల్లో ‘విమానం’ (Vimanam Movie Review) ఒక‌టి. తండ్రీకొడుకుల క‌థ‌తో  తెలుగు, తమిళ భాష‌ల్లో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది?

క‌థేంటంటే: విక‌లాంగుడైనా క‌ష్ట‌పడి ప‌నిచేసే మ‌న‌స్త‌త్వ‌మున్న వ్య‌క్తి వీర‌య్య (సముద్ర‌ఖ‌ని). భార్య మ‌ర‌ణించ‌డంతో త‌న కొడుకు రాజు (ధ్రువ‌న్‌)తో క‌లిసి ఓ బ‌స్తీలో జీవ‌నం సాగిస్తుంటాడు. ఆటోస్టాండ్ ద‌గ్గ‌ర మ‌రుగుదొడ్ల నిర్వ‌హ‌ణ‌తో వ‌చ్చే చాలీ చాల‌ని సంపాద‌నే ఆ కుటుంబానికి ఆధారం. బ‌డికి వెళ్లే రాజుకి విమానం అంటే ఇష్టం. పెద్ద‌య్యాక పైలట్ కావాల‌ని క‌ల‌లు కంటూ ఉంటాడు. అయితే రాజు పెద్ద‌య్యే వ‌ర‌కూ కాకుండా... నెల రోజుల్లోపేవిమానం ఎక్కించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. త‌న కొడుకు కోరిక‌ని నెర‌వేర్చేందుకు ఆ తండ్రి ఏం చేశాడు?అంత తొంద‌ర‌గా విమానం ఎక్కించాల్సిన అవ‌స‌రం ఎందుకొచ్చింది?(Vimanam Movie Review) అందుకోసం ఏం చేశాడు?ఆ  బ‌స్తీలోనే ఉండే సుమ‌తి (అన‌సూయ‌), కోటి (రాహుల్ రామ‌కృష్ణ‌), డేనియ‌ల్ (ధ‌న్‌రాజ్‌)ల జీవితాల వెన‌క క‌థేమిటి?వీర‌య్యకి వాళ్లు ఎలా సాయం చేశార‌నేది తెర‌పైనే చూడాలి.

ఎలా ఉందంటే: తండ్రీ కొడుకుల మ‌ధ్య భావోద్వేగాలే ప్ర‌ధానంగా సాగే చిత్ర‌మిది. త‌న కొడుకు కోరిక‌ని తీర్చే క్ర‌మంలో ఓ తండ్రి జీవితంలోని సంఘ‌ర్ష‌ణ‌ని హృద‌యాల‌కి హ‌త్తుకునేలా తెర‌పైన ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు.  ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అయ్యే భావోద్వేగాలు... పాత్ర‌లు ఇందులో ఉంటాయి. అయితే క‌థని ఎక్కువ‌గా వీర‌య్య‌... అత‌ని కొడుకు చుట్టూనే తిప్ప‌డంతో క‌థ ఓ చిన్న పార్శ్వానికే ప‌రిమిత‌మైనట్టు అనిపిస్తుంది. (Vimanam Movie Review) సినిమాలో మిగిలిన పాత్ర‌ల్ని  పైపైనే తేల్చేయ‌డంతో క‌థ‌, క‌థ‌నాలు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించ‌వు. హైద‌రాబాద్‌లో విమానాశ్ర‌యం బేగంపేట్ నుంచి శంషాబాద్‌కి మారిన రోజుల‌నాటి క‌థ ఇది. వీర‌య్య‌... అత‌ని వ్య‌క్తిత్వం, బ‌స్తీ జీవితాన్ని ఆవిష్క‌రిస్తూ సినిమా టేకాఫ్ అవుతుంది. అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌డానికి స‌మ‌యం తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. అయితే రాజుకి విమానంపై ఉన్న  ఇష్టంతో అత‌ను వేసే ప్ర‌శ్న‌లు...  స్కూల్లో త‌న స్నేహితుల‌తో క‌లిసి విమానం గురించి  చెప్పుకొనే ముచ్చ‌ట్లు న‌వ్విస్తాయి. 

చిన్నారుల అమాయ‌క‌త్వం నుంచి మంచి వినోదం పండుతుంది. మ‌రోవైపు కోటి, సుమతి పాత్ర‌ల హంగామా కాల‌క్షేపాన్నిస్తుంది. (Vimanam Movie Review) రాజు క‌ల‌ని తొంద‌ర‌గా నెర‌వేర్చాల్సి రావ‌డం... అదే స‌మ‌యంలోనే వీర‌య్య జీవ‌నాధార‌మైన మ‌రుగుదొడ్డి కూల్చివేయ‌డం నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ద్వితీయార్ధంలో వీర‌య్యకి  ఎదుర‌య్యే క‌ష్టాల్ని మ‌రీ సినిమాటిక్‌గా చూపించ‌డం... మిగిలిన పాత్ర‌ల‌పై దృష్టిపెట్ట‌క‌పోవ‌డంతో క‌థ ఏ దిశ‌గా వెళుతుందో ముందే అర్థ‌మ‌వుతుంది. కీల‌క‌మైన ఎగ్జిబిష‌న్‌లోని స‌న్నివేశాల్ని సాదాసీదాగా మ‌లిచారు. వేశ్యగా మారిన సుమతి పాత్ర నుంచి సంఘ‌ర్ష‌ణ ఏమైనా ఉంటుందేమో అని ఆశించినా ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కూ ఆ పాత్ర‌పై దృష్టిపెట్ట‌లేదు ద‌ర్శ‌కుడు.  చివ‌ర్లో  కోటి, సుమతి నేప‌థ్యంలో తీర్చిదిద్దిన స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి.  విమానాశ్ర‌యంలో  వీర‌య్య‌, రాజుల మ‌ధ్య తీర్చిదిద్దిన  ప‌తాక సన్నివేశాలు హృద్యంగా సాగుతాయి.  ఒక‌ప్ప‌టి క‌థానాయిక మీరా జాస్మిన్ అతిథి పాత్ర‌లో మెరుస్తారు.

ఎవ‌రెలా చేశారంటే: విక‌లాంగుడైన తండ్రి పాత్ర‌లో స‌ముద్ర‌ఖ‌ని చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌దర్శించాడు.  త‌న‌యుడి కోరిక‌ని నెర‌వేర్చే క్ర‌మంలో ఎదుర‌య్యే  సంఘ‌ర్ష‌ణ, అందులో ఆయ‌న న‌ట‌న ప్రేక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేస్తుంది. మాస్ట‌ర్ ధ్రువ‌న్‌తోపాటు, డేనియ‌ల్ త‌న‌యుడిగా న‌టించిన మ‌రో చిన్నారి చాలా బాగా న‌టించారు. సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ సంద‌డి ఆక‌ట్టుకుంటుంది. రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సంగీతం సినిమాకి ప్ర‌ధాన బ‌లం. ముఖ్యంగా సంద‌ర్భోచితంగా వ‌చ్చే పాట‌లు, వాటిలోని సాహిత్యం అర్థ‌వంతంగా ఉంది. కెమెరా ప‌నిత‌నం బాగుంది. మాట‌లు చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. అన‌సూయ పాత్ర ప‌లికే సంభాష‌ణ‌లు బాగుంటాయి. ద‌ర్శ‌కుడు  శివ ప్ర‌సాద్ క‌థ‌లో భావోద్వేగాలు ఉన్నా... అది సింగిల్ లేయ‌ర్‌కే ప‌రిమితం అయ్యింది.  క‌థ‌నంలోనూ కొత్త‌ద‌నం లేదు. నిర్మాణం బాగుంది.

  • బ‌లాలు
  • + భావోద్వేగాలు
  • + ప‌తాక స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగే క‌థ‌, క‌థ‌నం
  • చివ‌రిగా:  హృద్యంగా సాగే  ‘విమానం’ (Vimanam Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని