Virupaksha: సవాలు స్వీకరించాం.. దానికి సమాధానమే ‘విరూపాక్ష’: సాయిధరమ్‌ తేజ్‌

రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్నాక హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటించిన చిత్రం ‘విరూపాక్ష’. కార్తిక్‌ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలై హిట్‌టాక్‌ సొంతం చేసుకుంది.

Published : 23 Apr 2023 18:39 IST

హైదరాబాద్‌: బలమైన, వినూత్న కథ ఉంటేనే థియేటర్లకు వచ్చి సినిమా చూస్తామని ప్రేక్షకులు విసిరిన సవాలు స్వీకరించామని, దానికి సమాధానమే ‘విరూపాక్ష’ (Virupaksha) అని ఆనందం వ్యక్తం చేశారు సాయిధరమ్‌ తేజ్‌ ( Sai Dharam Tej). ఈయన హీరోగా.. సంయుక్త (Samyuktha) కథానాయికగా.. నూతన దర్శకుడు కార్తిక్‌ దండు ( Karthik Dandu) తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. దర్శకులు మారుతి (Maruthi), గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) ముఖ్య అతిథులుగా హాజరై, ‘విరూపాక్ష’ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకనుద్దేశించి సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ విజయం మా బృందానిదేకాదు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన అందరిది. గతేడాది కొన్ని సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లలేదు. ‘మేం థియేటర్లకు రావాలంటే కథ అద్భుతంగా ఉండాలి’ అని మాకు (సినిమా వాళ్లకు) సవాలు విసిరారు. మీ ఛాలెంజ్‌ని స్వీకరించాం. దానికి సమాధానమే ఈ ‘విరూపాక్ష’. ఈ చిత్రంలోని మెయిన్‌ ఆర్టిస్ట్‌ గురించి చెప్పడం అందరూ మర్చిపోయారు. నేను మర్చిపోలేను. అదెవరో కాదు కాకి’’ అంటూ నవ్వులు కురిపించారు. తనకు చికిత్స అందించిన వైద్యులకు ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘ఈ సినిమా విషయంలో ముఖ్యంగా నేపథ్య సంగీతం గురించి మాట్లాడుతున్నారు. ఆరున్నర రోజుల్లో ఆ పనిని పూర్తి చేశాడు అజనీష్‌ లోక్‌నాథ్‌. విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని కార్తిక్‌ పేర్కొన్నారు.

ఆశ్చర్యం.. కోపం: మారుతి

‘‘దెయ్యం సినిమాలంటే సాయిధరమ్‌ తేజ్‌కి చాలా భయం. అలాంటి వ్యక్తి ‘విరూపాక్ష’లో నటించాడంటే ఆశ్చర్యంగా ఉంది. మరోవైపు అతడిపై కోపమూ ఉంది. ఎందుకంటే అలాంటి జానర్‌ చిత్రాల్లో ఎప్పుడూ నటించనని నాతో చెప్పాడు. నా సినిమా ‘ప్రేమకథా చిత్రమ్‌’ చూశావా అని అడిగితే ‘అది హారర్‌ సినిమా అంటున్నారు. నేను చూడను’ అన్నాడు. కథ చాలా బాగా నచ్చిందంటూ ఓ రోజు ‘విరూపాక్ష’ గురించి వివరించాడు. సాయి ఇష్టపడని నేపథ్యానికి సంబంధించిన స్టోరీ చెప్పి, సినిమా తీసినప్పుడే దర్శకుడు కార్తిక్‌ సక్సెస్‌ అందుకున్నాడు.

కార్తిక్‌, సాయి రియల్‌ హీరోలు: గోపీచంద్‌

‘‘సాయిధరమ్‌ తేజ్‌ నా సోదరుడిలాంటివాడు. ‘విరూపాక్ష’ విజయంతో తనెంత ఆనందంగా ఉన్నాడో నేనూ అంతే ఆనందిస్తున్నా. సమస్యలెదురైనా తట్టుకుని మళ్లీ ఫామ్‌లోకి రావడం స్ఫూర్తిదాయకం. దర్శకుడు కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారనే విషయం ఇక్కడికి వచ్చాక తెలిసింది. వారిద్దరు రియల్‌ హీరోలు. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఊహకందని కథ ఆద్యంతం ఆసక్తి రేకెత్తించింది’’ అని మలినేని గోపీచంద్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని