Vishwak Sen: అందుకే పేరు మార్చుకున్నా: విశ్వక్‌ సేన్‌

తన పేరుని మార్చుకోవడానికి గల కారణాన్ని తాజాగా నటుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) బయటపెట్టారు. దినేశ్‌ నాయుడు నుంచి విశ్వక్‌గా మారడం వెనుక ఉన్న కథను ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు.

Published : 03 Jun 2023 01:59 IST

హైదరాబాద్‌: దినేశ్‌ నాయుడు అంటే తెలియకపోవచ్చు కానీ విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. యూత్‌ఫుల్‌, లవ్‌, కమర్షియల్‌ చిత్రాలతో మాస్‌ కా దాస్‌గా ప్రేక్షకులకు చేరువైన విశ్వక్‌.. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని తన పేరు మార్చుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. తాను నటించిన ఓ సినిమా దాదాపు రెండేళ్లు వాయిదా పడిందని అందుకే పేరు మార్చుకున్నానని చెప్పారు. 

‘‘అనుకోని ఆలస్యం తర్వాత సినిమా విడుదలైతే వచ్చే ఆనందం ఎలా ఉంటుందో నాక్కూడా తెలుసు. నేను నటించిన తొలి చిత్రం ‘వెళ్ళిపోమాకే’ను రూ.12 లక్షలు ఖర్చుపెట్టి తెరకెక్కించాం. ‘ఇదిగో రిలీజ్‌.. అదిగో రిలీజ్‌’ అంటూ సుమారు 24 నెలలపాటు దాన్ని వాయిదా వేశారు. అప్పుడు ఇంట్లో వాళ్లు న్యూమరాలజిస్ట్‌కు నా జాతకం చూపించారు. దినేశ్‌ నాయుడు అనే పేరుతో ఎంత కష్టపడినా ఇండస్ట్రీలో గుర్తింపు రాదని.. వీలైతే వెంటనే పేరు మార్చమన్నారు. అంతేగాకుండా నాలుగు పేర్లు కూడా ఆయనే సజెస్ట్‌ చేశారు. అందులోంచి నేను విశ్వక్‌ సేన్‌ను ఎంచుకున్నా.’’

‘‘బెంగాళీ పేరు నీకు ఎందుకు?’ అని ఇంట్లో వాళ్లు అన్నారు. ఏదో ఒక పేరు ముందు సినిమా రిలీజ్‌ కావాలంతే అని ఫిక్స్‌ అయిపోయా. అలా, నా పేరుని దినేశ్‌ నాయుడు నుంచి విశ్వక్‌ సేన్‌గా మార్చుకున్నాక నెల రోజుల్లోనే ‘వెళ్ళిపోమాకే’ రిలీజ్‌ అయ్యింది. అది రిలీజైన మూడు రోజుల తర్వాత రామానాయుడు స్టూడియోస్‌లో తరుణ్‌ భాస్కర్‌కు ‘ఈ నగరానికి ఏమైంది’ ఆడిషన్‌ ఇచ్చాను. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఓపిక ఎంతో అవసరం. అందుకే, ఇప్పటివరకూ ఎలాంటి సమస్య వచ్చినా ‘నెవర్‌ గివప్‌’ అనే ఆలోచనలోనే ఉన్నా’’ అని విశ్వక్‌ సేన్‌ వివరించారు. ఇటీవల ‘దాస్‌ కా దమ్కీ’తో ప్రేక్షకులను అలరించిన విశ్వక్‌.. ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ సినిమా చేస్తున్నారు. కృష్ణచైతన్య దీనికి దర్శకత్వం వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని