Paagal: అమెజాన్‌ ప్రైమ్‌లో విష్వక్‌సేన్‌ ‘పాగల్‌’ ఎప్పుడంటే?

Paagal: విష్వక్‌సేన్‌, నివేదా పేతురాజు జంటగా నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పాగల్‌’ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.

Updated : 30 Aug 2022 15:36 IST

హైదరాబాద్‌: విష్వక్‌సేన్‌, నివేదా పేతురాజు జంటగా నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాగల్‌’. ఇటీవల విడుదలైన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబరు 3న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ  సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్‌లలో విడుదలైన నెల రోజులోపే నెటిజన్లను అలరించేందుకు వస్తుండటం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడారు.

* ‘‘మునుపటితో పోల్చితే ఇప్పుడు సినిమాలు చూసే వాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. వందలో అరవై మందే థియేటర్లకు వస్తున్నారు. కరోనా భయాలే దానికి కారణం. వందల కోట్ల వసూళ్లన్నవి ఇప్పుడు కష్టమే. మునపటిలా కుటుంబ ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్లకు వచ్చినప్పుడే అంతటి వసూళ్లు చూడగలుగుతాం’’

* ‘‘పాగల్‌’ని ఏప్రిల్‌ నెలాఖరులో విడుదల చేద్దామనుకున్నాం. కరోనా ఉద్ధృతి వల్ల ఆలస్యమైంది. ఆగస్టు తొలి వారం వరకు చిత్ర విడుదల తేదీపై మాకు ఏ స్పష్టతా లేదు. ‘తిమ్మరుసు’,  ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’ చిత్రాల ఓపెనింగ్స్‌ చూశాక రాత్రికి రాత్రే ఓ నిర్ణయానికి వచ్చాం. అలా సినిమాని ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం’’

* ‘‘ఎగ్జిబ్యూటర్, డిస్టిబ్యూటర్, ప్రొడ్యూసర్‌.. ఈ ముగ్గురిని ఆనందంగా ఉంచే చిత్రమే నా దృష్టిలో సూపర్‌ హిట్‌ సినిమా. మా ‘పాగల్‌’ అలాంటి చిత్రమే. విడుదలకు ముందే శాటిలైట్, డిజిటల్‌ రైట్స్‌ క్లోజ్‌ అవడంతో.. తొలి రెండు రోజుల ఓపెనింగ్స్‌తోనే బ్రేక్‌ ఈవెన్‌కు చేరుకున్నాం. ఇప్పటికే రూ.12కోట్ల పైన గ్రాస్‌ సాధించాం. ఈ చిత్రం సెప్టెంబరు 3న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది’’

* ‘‘కొత్తవాళ్లతో చేసినా.. పేరున్న హీరోతో చేసినా ప్రేక్షకుల్ని అలరించే విజయవంతమైన చిత్రం తీయడమే నా లక్ష్యం. ప్రస్తుతం శ్రీవిష్ణుతో ఓ చిత్రం చేస్తున్నా. ప్రదీప్‌ దర్శకుడు. 50శాతం చిత్రీకరణ పూర్తయింది. ఓ పోలీస్‌ అధికారి బయోపిక్‌లా ఉంటుంది. యాక్షన్‌కు ఎంతో   ప్రాధాన్యముంది. డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’అని వేణుగోపాల్‌ చెప్పుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని