Vishwak Sen: చేయని తప్పులకు నిందలు పడ్డా కానీ..: విశ్వక్‌ సేన్‌

నటుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) తాజాగా పెట్టిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ మారింది. దీనిని చూసిన నెటిజన్లు విశ్వక్‌ ఎందుకిలా పోస్ట్‌ పెట్టారు అని మాట్లాడుకుంటున్నారు.  

Updated : 14 May 2023 15:25 IST

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌, లేదా ఆఫ్‌లైన్‌లో ఎప్పుడూ చలాకీగా కనిపించే టాలీవుడ్‌ మాస్‌ నటుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen). సోషల్‌మీడియాలో తరచూ సరదా పోస్టులు, ఫన్నీ మీమ్స్‌ షేర్‌ చేసే ఆయన తాజాగా ఓ సందేశాత్మక పోస్ట్‌ పెట్టారు. జీవితంలో తాను జయాపజయాలను చూశానని అన్నారు. అలాగే, కొన్నిసార్లు చేయని తప్పులకూ నిందలు పడ్డానని తెలిపారు. తనపై వ్యతిరేకత సృష్టించినప్పటికీ తాను ఏ ఒక్కరికీ ద్రోహం చేయలేదని పేర్కొన్నారు.

‘‘విజయం, పరాజయం, ప్రశంసలు, విమర్శలు రెండింటినీ నేను చూశాను. అలాగే నేను చేయని తప్పులకు ప్రశ్నలు ఎదుర్కొన్నాను. నిందలు పడ్డాను. నా హార్డ్‌వర్క్‌కు పొగడ్తలు అందుకున్నాను. ఒకవేళ తెలియక చేసిన తప్పుల వల్ల విమర్శలు ఎదుర్కొని ఉండొచ్చు. కానీ, ఎవరికీ హానీ చేయలేదు. పోరాటాలు జరుగుతున్నప్పటికీ నా ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను. ఉద్దేశపూర్వక ప్రతికూలత.. నిన్ను ఒక ఫెయిల్యూర్‌గా నిర్వచించడానికి తావు ఇవ్వొద్దు. క్లిష్ట సమయాలకు మించి జీవితంలో మరెంతో ఉంటుంది. మానవ జన్మ ఎత్తినందుకు ఆనందించండి. కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడండి’’ అంటూ విశ్వక్‌ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. విశ్వక్‌ సేన్‌ ఉన్నట్టుండి ఇలాంటి సందేశం ఎందుకు పట్టాడా? అని ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఇక, సినిమాల విషయానికి వస్తే ‘దాస్‌ కా ధమ్కీ’తో ఇటీవల విశ్వక్‌ సేన్‌ ప్రేక్షకులను అలరించారు. మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆయనే స్వీయ దర్శకత్వం వహించారు. మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. దీని తర్వాత ఆయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఊరమాస్‌ సినిమా ఓకే చేశారు. ఇటీవల ఆ సినిమా షూట్‌ మొదలైంది. ఇందులో విశ్వక్‌ కాస్త సీరియస్‌ లుక్‌లో కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని