Vishwak Sen: 20 ఏళ్లనాటి చిత్రం.. 1000 స్క్రీన్లు.. దేశమంతా చర్చించుకుంటుంది: విశ్వక్‌ సేన్‌

ఎన్టీఆర్‌- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌హిట్‌ చిత్రం ‘సింహాద్రి’ మరోసారి విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ వీరాభిమాని, హీరో విశ్వక్‌సేన్‌ హాజరై సందడి చేశారు.

Published : 18 May 2023 11:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 20 ఏళ్ల క్రితం విడుదలైన ‘సింహాద్రి’ (Simhadri) సినిమా ఈ ఏడాది మే 20న 1000 స్క్రీన్‌లపై ప్రదర్శితంకాబోతుండడం చిన్న విషయం కాదని హీరో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) అన్నారు. ఆ సినిమా రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఎన్టీఆర్‌ హీరోగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘సింహాద్రి’.. 2003 జులై 9న విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మే 20 ఎన్టీఆర్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని మళ్లీ ఆ సినిమాని విడుదల (simhadri re release) చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుక (simhadri re release event)లో విశ్వక్‌తోపాటు దర్శకులు హను రాఘవపూడి, గోపీచంద్‌ మలినేని, నిర్మాత నవీన్‌ యెర్నేని పాల్గొన్నారు.

విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. ‘‘దేశమంతా ఈ సినిమా రీ రిలీజ్‌ గురించి చర్చించుకుంటుంది. ఇది నేషనల్‌ న్యూస్‌ అవుతుంది. ఎన్టీఆర్‌ అభిమానిగా గర్వపడుతున్నా. నాకు తెలిసినంత వరకు ఏ అభిమానికి ఇలాంటి అవకాశం వచ్చి ఉండదు. లాస్‌ఏంజిల్స్‌లో జరిగిన ‘ఆస్కార్‌’ వేడుక అనంతరం మరో రెండు రోజులు ఉండమని అక్కడి వారు ఎన్టీఆర్‌ని కోరితే.. హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌కు హాజరకావాలని అన్నారట. ఈ విషయం ఒకరు నాకు చెబితే తెలిసింది. ఆ స్థాయికి చేరుకున్న ఆయన ఫ్యాన్‌కు ఇచ్చిన మాట తప్పకూడదని నా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చాడు. ఆ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. సినిమాల రీ రిలీజ్ కల్చర్‌ మన టాలీవుడ్‌లోనే మొదలైంది. వాటికి ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించే స్థాయికి చేరుకున్నాం’’ అని విశ్వక్‌ సేన్‌ ఆనందం వ్యక్తం చేశారు. తన అభిమాన హీరోకి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. థియేటర్‌ తెరలను, కుర్చీలను ధ్వంసం చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

రీ రిలీజ్‌ సినిమాకు ఫంక్షన్‌ జరగడం ఇదే తొలిసారి అని గోపీచంద్‌ మలినేని అన్నారు. ఆ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని తెలిపారు. హైదరాబాద్‌, ఒంగోలు, విజయవాడలో ఈ చిత్రాన్ని చూశానని నాటి సంగతులు గుర్తుచేసుకొన్నారు. హను రాఘవపూడి మాట్లాడుతూ.. దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి దగ్గర పనిచేస్తున్న సమయంలో ‘సింహాద్రి’ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌, చిత్రీకరణ చూశానని తెలిపారు. తాను ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానినన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని