Vivek Agnihotri: ఆయన ప్రకాశ్‌రాజ్‌ కాదు.. అంధకార్‌ రాజ్‌..: వివేక్‌ అగ్నిహోత్రి

Vivek Agnihotri: ది కశ్మీర్‌ఫైల్స్‌ చెత్త సినిమా అంటూ వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్‌రాజ్‌పై ఆ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి మండిపడ్డారు. ప్రకాశ్‌రాజ్‌ను అర్బన్‌ నక్సల్‌ అంటూ విమర్శించారు.

Published : 11 Feb 2023 15:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri) మండిపడ్డారు. ఆయన ప్రకాశ్‌రాజ్‌ కాదని, ‘అంధకార్‌ రాజ్‌’అంటూ తీవ్రంగా స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వివేక్‌ తెరకెక్కించిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files) చెత్త సినిమా అంటూ ఇటీవల నటుడు ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడికి భాస్కర్‌ అవార్డు కూడా రాదని విమర్శించారు. ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యలపై మండిపడటమే కాదు, ఆయనను అర్బన్‌ నక్సల్‌ అంటూ విమర్శించారు.

‘‘ది కశ్మీర్‌ఫైల్స్‌ అనే చిన్న సినిమా కొందరు ‘అర్బన్‌ నక్సల్స్‌’ను రాత్రిపూట కూడా నిద్రపోనీయడం లేదు. ఏడాది అయినా కూడా ఆ సినిమా వాళ్లు మర్చిపోలేకపోతున్నారు. అవన్నీ మొరిగే కుక్కలు. మిస్టర్‌ అంధకార్‌ రాజ్‌ భాస్కర్‌ అవార్డులన్నీ మీకే వస్తుంటే ఇక మాకు అవకాశం ఎక్కడ ఉంటుంది’’ అంటూ ఘాటూగా స్పందించారు.

ఇటీవల కేరళలో నిర్వహించిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌ ఇన్‌ కేరళ’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ ‘‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files) ఒక చెత్త సినిమా. దాన్ని ఎవరు నిర్మించారో మాకు తెలుసు. సిగ్గులేనితనం. ఇంటర్నేషనల్‌ జ్యూరీ కూడా ఈ చిత్రాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఇంత జరిగినా వాళ్లకు ఇంకా సిగ్గురాలేదు. ఆ చిత్ర దర్శకుడు ఇప్పటికీ.. ‘‘నాకు ఎందుకు ఆస్కార్ రాలేదు‌?’’ అని మాట్లాడుతున్నాడు. అతడికి ఆస్కార్‌ కాదు కదా..  భాస్కర్‌ కూడా రాదు. ఇలాంటి ప్రచార చిత్రాలు తీయడానికి కొంతమంది రూ.2000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని నాకు తెలిసిన వాళ్లు చెప్పారు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కశ్మీర్‌ పండిత్‌లపై జరిగిన అకృత్యాల నేపథ్యంలో వివేక్‌ అగ్నిహోత్రి ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. అనుపమ్‌ ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, మిథున్‌ చక్రవర్తి, పల్లవి జోషీ తదితరులు కీలక పాత్ర పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని