Bollywood: ఫొటోల కోసం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. స్టార్‌ డైరెక్టర్ ట్వీట్‌

ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్ని హోత్రి (Vivek Agnihotri)మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల జరుగుతున్న పెళ్లిళ్లపై ఆయన ట్వీట్‌ చేశారు.

Updated : 15 May 2023 17:36 IST

ముంబయి: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు వివేక్‌ అగ్ని హోత్రి (Vivek Agnihotri). అప్పటి నుంచి ప్రతి విషయంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న పెళ్లిళ్ల విషయంలో ఆయన చేసిన ట్వీట్‌ వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

‘ఇప్పటి వాళ్లు ఫొటోల కోసం మాత్రమే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ వారి స్టేటస్‌ను తెలియజేసుకుంటున్నారు. ఇటీవల నాకు ఒక వీడియోగ్రాఫర్‌ చెప్పింది విని ఆశ్చర్యపోయాను. ఏదో పెళ్లిలో ఫొటోగ్రాఫర్‌ రావడం ఆలస్యమవుతుందని తెలిసి పెళ్లి కూతురు సృహ తప్పి పడిపోయిందట. ఈ సంఘటన నిజంగా జరిగిందని చెప్పాడు’ అని వివేక్‌ అగ్ని హోత్రి ట్వీట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు యాక్టివ్‌గా స్పందిస్తున్నారు. ‘మీరు చెబుతుంది నిజమే’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘అందులో తప్పులేదు. అలాంటి మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంటాయి’ అని మరొకరన్నారు. మరికొందరేమో ఇటీవల జరిగిన బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Priyanka Chopra) నిశ్చితార్థం గురించే మాట్లాడారని అంటున్నారు. రెండు రోజుల ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ఎంపీ... రాఘవ్‌ చద్దాతో బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. 

ఇక తాజాగా వివేక్‌ బాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తనను బాలీవుడ్‌ (Bollywood) పూర్తిగా దూరం పెట్టిందన్నారు. హిందీ చిత్రాలు వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉంటున్నాయని అందుకే వాటికి ప్రేక్షకులు కనెక్ట్‌ కాలేకపోతున్నారని అన్నారు. ఈ కారణంగానే హిందీ చిత్రాలు పరాజయం పాలవుతున్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని