అనుష్క ఫోన్‌ నంబర్‌ అనుకుని షర్ట్‌ లేకుండా ఫొటోలు పంపారు: దర్శకుడు

‘అంటే సుందరానికీ..!’తో గతేడాది ప్రేక్షకులను అలరించిన దర్శకుడు వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఆ సినిమాకు వచ్చిన ఫలితంపై పూర్తి బాధ్యత తనదేనని అన్నారు.

Published : 24 Feb 2023 16:49 IST

హైదరాబాద్‌: ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే.. సుందరానికీ’.. ఇలా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఇప్పుడున్న రోజుల్లో సోషల్‌మీడియా(Social Media)లో నెగెటివిటీ ఎక్కువైందన్నారు. కొంతమంది నెటిజన్లు కావాలనే విమర్శలు చేస్తున్నారని చెప్పారు. సెలబ్రిటీలందరూ సోషల్‌మీడియాకు దూరంగా ఉంటే ఇలాంటివి తగ్గుతాయని తెలిపారు. కొవిడ్‌ సమయంలో చోటుచేసుకున్న ఓ సంఘటనను ఈ సందర్భంగా పంచుకున్నారు.

‘‘కొవిడ్‌ సమయంలో నా స్నేహితుడి తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు రక్తం అవసరమైంది. ఆయన బ్లడ్‌ గ్రూప్‌నకు సరిపడే రక్తదాత కోసం మేం ఎంతగానో వెతికాం. నా ఫోన్‌ నంబర్‌ని జత చేస్తూ అందరికీ సందేశాలూ పంపాను. ఈ విషయం తెలుసుకున్న నటి అనుష్క (Anushka).. మాకు సాయం చేయడం కోసం నేను పంపిన సందేశాన్ని తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. ఆ పోస్ట్‌లో ఉన్న ఫోన్‌ నంబర్‌ ఆమెదే అనుకుని.. చాలామంది కాల్స్‌ చేశారు. ఆ పోస్ట్‌ పెట్టిన తర్వాత నా ఫోన్‌కు వచ్చిన కాల్స్‌ ఎవరూ ఊహించి ఉండరు. ఒకరు వీడియో కాల్‌ చేస్తే.. మరొకరు షర్ట్‌ లేకుండా ఫొటోలు పంపారు.. బాబోయ్‌.. ఆ దారుణాలను చెప్పలేను. నటీమణుల జీవితం ఇంత కష్టంగా ఉంటుందా.. అని ఆరోజు నేను షాక్‌ అయ్యాను. కొంత కాలానికే ఆ ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేసేశాను’’ అని వివేక్‌ వివరించారు.

అనంతరం ఆయన ‘అంటే.. సుందరానికీ’ (Ante Sundaraniki) చిత్రానికి వచ్చిన మిశ్రమ స్పందనలపై స్పందించారు. ‘‘అంటే సుందరానికీ’ చిత్రానికి వచ్చిన ఫలితానికి పూర్తి బాధ్యత నాదే. ఆ సినిమా చూసి కొంతమంది నచ్చిందన్నారు. మరికొంతమంది సినిమా ఎక్కువ నిడివి ఉందని కామెంట్స్‌ చేశారు. సినిమా సిద్ధం చేసిన తర్వాతే నిడివి పది నిమిషాలు ఎక్కువైందని మాక్కూడా తెలిసింది. దాన్ని ఎడిట్‌ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఎందుకంటే ఆ సినిమాలో ఒక సీన్‌కు మరో సీన్‌కు లింక్‌ ఉంటుంది. దేన్ని తొలగించినా అర్థం లేకుండా పోతుంది. అందుకే మేము సినిమా నిడివిని తగ్గించలేకపోయాం. అయితే, సినిమాకు ఎక్కువగా దగ్గర కాకూడదని ఈ సినిమా నుంచే నేర్చుకున్నా. ఎందుకంటే ఈ సినిమా ఫలితం నన్ను ఎంతో బాధపెట్టింది’’ అని ఆయన వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని