VJ Sunny: ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు!

‘‘కథను నమ్మి చేసిన సినిమా ‘అన్‌స్టాపబుల్‌’. స్క్రిప్ట్‌ విన్నంత సేపూ నవ్వుతూనే ఉన్నా. రేపు థియేటర్లలో ప్రేక్షకులూ అదే అనుభూతి పొందుతారు’’ అన్నారు వీజే సన్నీ.

Updated : 07 Jun 2023 14:00 IST

‘‘కథను నమ్మి చేసిన సినిమా ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable). స్క్రిప్ట్‌ విన్నంత సేపూ నవ్వుతూనే ఉన్నా. రేపు థియేటర్లలో ప్రేక్షకులూ అదే అనుభూతి పొందుతారు’’ అన్నారు వీజే సన్నీ (VJ Sunny). ఆయన, సప్తగిరి హీరోలుగా డైమండ్‌ రత్నబాబు తెరకెక్కించిన చిత్రమే ‘అన్‌స్టాపబుల్‌’. రజిత్‌రావు నిర్మాత. నక్షత్ర, అక్సాఖాన్‌ కథానాయికలు. ఈ సినిమా ఈనెల 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సన్నీ.

* బిగ్‌బాస్‌ తర్వాత కొత్త నిర్మాణ సంస్థల నుంచి చాలామంది నన్ను సంప్రదించారు. అయితే ఆ కథలన్నీ ఎక్కువగా మాస్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నవి. నాకేమో కామెడీ, థ్రిల్లర్‌, హారర్‌ కామెడీ కథలు చేయాలని ఉండేది. పక్కింటి కుర్రాడిలా అనిపించే పాత్రలు చేయాలని ఉండేది. ఇలాంటి సమయంలో ‘అన్‌స్టాపబుల్‌’ లాంటి అన్‌ లిమిటెడ్‌ ఫన్‌ కథ విన్నాను. చాలా నచ్చి, వెంటనే ఓకే చెప్పేశాను.

* ఈ సినిమాలో నేను.. సప్తగిరి చిచ్చా, మచ్చాలుగా కనిపిస్తాం. ఆయన సినిమా అంతా నాతోనే ఉంటారు. మేమిద్దరం అనుకోకుండా ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటాం.. దాని నుంచి ఎలా బయటపడ్డాం అన్నది ఆసక్తికరం. ప్రధానంగా డబ్బు చుట్టూ తిరిగే కథ ఇది. అది మా జీవితాలతో ఎలా ఆడుకుందనేది తెరపై చూసి తెలుసుకోవాలి. ఆద్యంతం ఇదొక ఫన్‌ రైడ్‌లా ఉంటుంది. సినిమాలోని ప్రతి పాత్రా నవ్వులు పంచుతుంది. ఎక్కడా బోర్‌ కొట్టదు.

* హీరోగా పేరు తెచ్చుకోవడం కన్నా ఒక ఆర్టిస్ట్‌గా ముందుకు వెళ్లాలని ఉంది. హీరోగా చేస్తూనే విభిన్నమైన పాత్రలూ పోషించాలని ఉంది. ప్రస్తుతం నేను రెండు సినిమాలు చేస్తున్నా. అందులో ఒకటి ఫన్‌.. మరొకటి సస్పెన్స్‌ థ్రిల్లర్‌.

* బిగ్‌బాస్‌నే కాదు.. ఏ ఫేమ్‌ కూడా ఎక్కువ కాలం ఉండదు. ఒక సూపర్‌ డూపర్‌ హిట్టు కొట్టినా సరే ఆ క్రేజ్‌ రెండు మూడు నెలలే ఉంటుంది. అయితే దాన్ని కాపాడుకుంటూ ఆ తర్వాత మనం ఏం చేస్తామన్నదే ముఖ్యం. అందుకే నేను బిగ్‌బాస్‌ నుంచి బయటకు రాగానే సినిమానే లక్ష్యంగా పెట్టుకున్నా. ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో వెతుక్కుంటూ వెళ్లిపోయా. ఈ క్రమంలోనే దిల్‌రాజు బ్యానర్‌లో ‘ఏటీఎం’ వెబ్‌సిరీస్‌ చేసే అవకాశం దొరికింది. ఆ సిరీస్‌ చూసి దర్శకుడు హరీష్‌శంకర్‌ నన్ను ప్రశంసించారు. అది నాలో ఇంకా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని