VJ sunny: సన్నీ టైమ్‌ ఆగయా... కప్పు కొట్టేశాడు ‘బిగిలూ’

‘గ్లాడియేటర్‌’ సినిమాలో ఒక డైలాగ్‌ ఉంటుంది. ‘జనాల హృదయాలు గెలుచుకో.. తప్పకుండా స్వేచ్ఛను సొంతం చేసుకుంటావు’ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో వీజే సన్నీ చేసిన పని ఇదే!

Updated : 08 Dec 2022 14:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘గ్లాడియేటర్‌’ సినిమాలో ఒక డైలాగ్‌ ఉంటుంది. ‘జనాల హృదయాలు గెలుచుకో.. తప్పకుండా స్వేచ్ఛను సొంతం చేసుకుంటావు’ అని. బిగ్‌బాస్‌ సీజన్‌-5లో వీజే సన్నీ చేసిన పని ఇదే! తన ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని కప్పుతో ప్రైజ్‌ మనీని సొంతం చేసుకున్నాడు. వీడియో జాకీగా, యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సన్నీ అసలు పేరు అరుణ్‌ రెడ్డి. పలు టెలివిజన్‌ ఛానళ్లలో వివిధ కార్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరించాడు. ‘కల్యాణ వైభోగం’ సీరియల్‌తో నటుడిగా కెరీర్‌ ప్రారంభించాడు. అందులో లీడ్‌ రోల్‌ పోషించాడు. ఇక ‘సకల గుణాభిరామ’ చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ క్రమంలో వచ్చిన ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని షోలో ఒక్కో ఎలిమినేషన్‌ దాటుతూ... చివరకు విజేతగా నిలిచాడు.

హౌస్‌లో బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా..

సెప్టెంబరు 5న ప్రారంభమైన బిగ్‌బాస్‌ షోలో రెండో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టాడు వీజే సన్నీ. ఈ జర్నీలో తన స్వప్న సుందరిని వెతుక్కుంటానని వేదికపైనే నాగార్జునకు చెప్పాడు. అప్పటికే హౌస్‌లో వెళ్లిన సిరి అతడికి స్వాగతం పలకగా.. ఆమెతో సరదాగా ముచ్చట్లు చెప్పాడు. ఇక హౌస్‌లోకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్‌తో సరదాగా కలిసిపోయాడు. మొదటి నుంచి అందరితో కలిసి పోయిన సన్నీ.. టాస్క్‌ల విషయంలో మాత్రం అగ్రెసివ్‌గా ఉండేవాడు. ప్రతి టాస్క్‌ గెలవాలని కసితో ఆడేవాడు. ‘వేటగాడు-కోతి’, ‘ప్రభావతి-గుడ్లు’ ఇలా ఏ టాస్క్‌ అయినా సన్నీ మార్కు ఉండేది. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేవాడు. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా రవి యువరాజుగా ఎంపికైనప్పుడు సన్నీ చేసిన హడావుడి ‘బాహుబలి’లో భళ్లాలదేవుడి పట్టాభిషేక సన్నివేశాన్ని తలపించింది. టాస్క్‌ల సమయంలో ఎవరితోనైనా గొడవ పడితే, అది అయిపోగానే వచ్చి మాట్లాడి వాళ్ల మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసేవాడు. ఇక టాస్క్‌లు లేని సమయంలో జోకులు చెబుతూ, ఇతరులను అనుకరిస్తూ నవ్వులు పంచేవాడు. వీకెండ్‌లోనూ నాగార్జున వేసే పంచ్‌లను సరదాగా తీసుకుని, దానికి రెండింతలు వినోదాన్ని పంచేవాడు. చివరి వారాల్లో హమీద, ప్రియాంకలా గెటప్‌లు వేసుకుని అలరించాడు. ఇక బాలకృష్ణ గెటప్‌లో సన్నీ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

నిందలు, అవమానాలను ఎదురొడ్డి..

కంటెస్టెంట్‌ల మధ్య అభిప్రాయాలు భేదాలు బిగ్‌బాస్‌ హౌస్‌లో సర్వసాధారణం. ముఖ్యంగా టాస్క్‌ల సమయంలో గెలిచేందుకు వారు చేసే ప్రయత్నాలు పోటీదారులకు నచ్చకపోవచ్చు. బిగ్‌బాస్‌ సీజన్‌-5లో జరిగిన టాస్క్‌ల సందర్భంగా సన్నీ అనేక ఆరోపణలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే, ఏం జరిగినా తాను అన్నమాటపై నిజాయతీగా నిలబడటం సన్నీ పట్ల ప్రజల్లో అభిమానం పెరిగేలా చేసింది. బ్యాటన్‌ టాస్క్‌ సందర్భంగా సిరి షర్టులో చేయి పెట్టాడని సన్నీపై ప్రధాన ఆరోపణ వచ్చింది. తాను కూడా చూశానని షణ్ముఖ్ చెప్పడంతో అతడిని వరెస్ట్‌ పెర్ఫార్మర్‌గా ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో నిర్ణయించి జైలుకు కూడా పంపారు. వీకెండ్‌లో నాగార్జున వచ్చి వీడియో ప్లే చేసిన తర్వాత సన్నీ అలా చేయలేదని తెలిసింది. దాంతో సన్నీ కరెక్ట్‌ అనుకున్నారు.

ప్రియ వివాదంతో సన్నీ మరోసారి టాక్‌ ఆఫ్‌ ది హౌస్‌ అయ్యాడు. ప్రతి విషయంలోనూ సన్నీని తప్పుబడుతూ ఆమె చేసిన ఆరోపణలు, వెక్కిరింతలు, ‘చెంప పగిలిపోతుంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వివాదంలో సన్నీ తప్పులేదని చూస్తున్న ప్రేక్షకులందరూ ముక్తకంఠతో సామాజిక మాధ్యమాల వేదికగా అతడిని సపోర్ట్‌ చేయడం మొదలు పెట్టారు. ఈ సంఘటనే సన్నీకి అభిమానులు పెరిగేలా చేసింది. ఆ తర్వాత ‘టవర్‌లో ఉంది పవర్‌’ టాస్క్‌ సందర్భంగా ‘వెనక్కి పడితే అప్పడం అవుతావు’ అని సిరిపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. వీకెండ్‌లో నాగార్జున కూడా సిరి, షణ్ముఖ్‌లకు పూర్తి మద్దతుగా మాట్లాడుతూ సన్నీని కార్నర్‌ చేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. గిల్ట్‌ బోర్డు పెట్టుకుని ఇంట్లో తిరగాల్సి వచ్చింది. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా సన్నీకి సపోర్ట్‌గా నిలిచే వారి సంఖ్య మరింత పెరిగింది.

స్నేహానికి కేరాఫ్‌ అడ్రస్‌ సన్నీ

బిగ్‌బాస్‌ జర్నీ అంటే భావోద్వేగాలతో కూడుకున్నది. హౌస్‌లో ఉన్న వారు తప్ప బయట ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. దీంతో అభిప్రాయాలు కలిసి వారు ఒక జట్టుగా ఏర్పడటం సహజం. అలా మానస్‌, అనీ మాస్టర్‌లతో సన్నీ స్నేహాన్ని కొనసాగించాడు. మరీ ముఖ్యంగా మానస్‌, సన్నీ శరీరాలు వేరైనా ఆత్మలు ఒక్కటే అన్న స్థాయిలో కలిసిపోయారు. సన్నీ తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అని అనీ మాస్టర్‌ బహిరంగంగానే చెప్పారు. ఆ స్నేహ భావంతోనే సన్నీని కెప్టెన్‌ చేయాల్సి వచ్చినప్పుడు అతడికే మద్దతుగా నిలిచారు. ఇక కాజల్‌తో మొదటి నుంచి గొడవలు పడిన సన్నీ.. ఆ తర్వాత ఆమెతో స్నేహం చేశాడు. దీంతో సన్నీని అనీ మాస్టర్‌ దూరం పెట్టినా ఆమె అంటే ప్రేమ, ఆప్యాతతో ఉండేవాడు.

మానస్‌, సన్నీ, కాజల్‌ స్నేహం హౌస్‌లో మరింత బలపడింది. టాస్క్‌ల సమయంలో సన్నీ అగ్రెసివ్‌ అవ్వకుండా మానస్‌, కాజల్‌ నియంత్రించేవారు. చాలా సందర్భాల్లో అది సన్నీకి ఎంతో హెల్ప్‌ అయింది. సన్నీ తప్పులేకపోతే అతడి తరఫున గట్టిగా మాట్లాడేవారు. ఒకానొక సందర్భంలో సన్నీ కోసం కాజల్‌ ఏకంగా నాగార్జునతోనే వాగ్వాదానికి దిగిందంటే వారి స్నేహం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ‘ఎస్‌ఎంకే’ (సన్నీ, మానస్‌, కాజల్‌) ఫ్రెండ్‌షిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఫ్రీ ఎవిక్షన్‌ పాస్‌ సన్నీకి దక్కడం కోసం మానస్‌తోనే కాజల్‌ వాగ్వాదానికి దిగిందంటే వీరి స్నేహం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆమె కోసమే సన్నీ ఆ పాస్‌ను వాడాడు కూడా.

తనదైన మేనరిజమ్‌తో గుర్తింపు

ఇతర ఇంటి సభ్యులతో పోలిస్తే, సన్నీ కాస్త ప్రత్యేకంగా కనిపించేవాడు. టాస్క్‌లు, నామినేషన్స్‌ సమయంలో తలపై టోపీ ఉండేది. ఇక ఇంట్లో ప్రతి ఒక్కరినీ ‘మచ్చా’ అని పిలిచేవాడు. ఇక ఎవరికైనా థ్యాంక్స్‌ చెప్పాలంటే, రెండు చేతులను జోడించి లవ్‌ సింబల్‌తో కృతజ్ఞతలు చెప్పేవాడు.

కొండలను ఢీకొని నిలబడిన సన్నీ

బిగ్‌బాస్‌లాంటి రియాల్టీ షోలకు వచ్చే కంటెస్టెంట్‌లకు ప్రజల్లో అంతో ఇంతో ఆదరణ ఉంటుంది. ఈ సీజన్‌లో వచ్చిన 19 మంది కంటెస్టెంట్‌లలో అత్యధిక ఫ్యాన్‌ బేస్‌ ఉన్న వారు నలుగురైదుగురు అన్నారు. అయితే వాళ్లలో సన్నీ లేకపోవటం గమనార్హం. ముఖ్యంగా షణ్ముఖ్‌, శ్రీరామ చంద్ర, రవి, మానస్‌, నటరాజ్‌ మాస్టర్‌, అనీ మాస్టర్‌తో పాటు మరికొందరు జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్నవారే. సన్నీకి ‘కల్యాణ వైభోగం’ సీరియల్‌ తప్ప పెద్దగా ప్రేక్షకులకు దగ్గర చేసిన వేదిక లేదు. మొదటి నుంచి తనదైన ఆటతీరుతో ప్రేక్షకుల మెప్పు పొందుతూ ఒక్కో మెట్టు ఎక్కాడు. అలా లక్షల్లో అభిమానులు ఉన్న రవి, షణ్ముఖ్‌, శ్రీరామచంద్ర వంటి కొండలను ఢీకొట్టి నిలబడ్డాడు.

సన్నీ సిట్యువేషన్‌కి తగ్గట్టుగా తనను తాను మలచుకుంటాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఓ మూలకు పోయి మూడీగా ఉండటం నచ్చదు. ‘అప్నా టైమ్‌ ఆయేగా’ అంటూ ‘గల్లీ బాయ్స్‌’లోని పాటను పాడుకుంటాడు. అది అతడి మూడ్‌ స్వింగ్స్‌ను కంట్రోల్‌ చేసే ఆయుధం అనుకోవచ్చు. అలాగే తన చుట్టూ ఉండేవాళ్లు ఆనందంగా ఉండటానికి ఎంతకైనా తెగిస్తాడు. అలాగే స్నేహానికి విలువిచ్చి తనవాళ్లు వద్దు అంటే.. ఆ పని ఆపేస్తాడు. వీలు చిక్కినప్పుడల్లా సినిమా డైలాగ్‌లను చెబుతూ జోష్‌ ప్రదర్శిస్తాడు. ‘విజిల్‌’ సినిమాలోని ‘కప్పు ముఖ్యం బిగిలూ’ అనే మాట సన్నీ తరచూ చెబుతూ ఉండేవాడు. కెమెరాలతో సన్నీ చేసే సరదా చేష్టలు అయితే నభూతో నభవిష్యత్తు అని చెప్పొచ్చు. ‘ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి సర్‌ ఎంటర్‌టైన్‌ చేస్తా’ అని అడిగేవాడు. ప్రేక్షకులు 15 వారాలూ ఇచ్చారు. అందుకే విజేతగా నిలిచాడు. సన్నీ నీ టైమ్‌ వచ్చింది...!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని