Waltair Veerayya: వాల్తేరు వీరయ్య విజయం అందరిది: చిరంజీవి

విజయాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కార్మికుల కష్టం అందరికీ తెలియాలి. చిత్రం కోసం ప్రేమతో కష్టపడిన వాళ్ల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలి. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) విజయం ఈ సినిమాకి పనిచేసిన కార్మికులందరిదీ’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi).

Updated : 15 Jan 2023 06:58 IST

‘‘విజయాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కార్మికుల కష్టం అందరికీ తెలియాలి. చిత్రం కోసం ప్రేమతో కష్టపడిన వాళ్ల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలి. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) విజయం ఈ సినిమాకి పనిచేసిన కార్మికులందరిదీ’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). రవితేజతో (Raviteja) కలిసి ఆయన నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయిక. బాబీ కొల్లి (Bobby) దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతిని పురస్కరించుకుని శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకి గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం దక్కించుకున్న రచయిత చంద్రబోస్‌ని ఈ వేడుకలో సత్కరించారు చిరంజీవి. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఈ సినిమా విజయం సమష్టి కృషి ఫలితం. దర్శకుడు బాబీ అద్భుతంగా మలిచారు. అనుభవంతో ఏదైనా చెప్పగానే దాన్ని స్వీకరించి ఓ సవాల్‌గా తీసుకుని పనిచేశాడు. నిర్మాతలకి చెప్పిన నిర్మాణ వ్యయంలోనే సినిమా తీసి ఇవ్వడం ఇప్పుడు దర్శకుడికి ముఖ్యం. అదే తొలి విజయం. దర్శకులే నిర్మాతల్ని బతికించాలి. నిర్మాతలు బాగుంటేనే నటులు, పరిశ్రమ బాగుంటుంది. మా సినిమాతో నిర్మాతలకి నయా పైసా వృథా కాలేదు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ వల్లే ఈ సినిమా ఇంత ఘనంగా రూపుదిద్దుకుంది. నా తమ్ముడు రవితేజ లేకపోతే ద్వితీయార్థం అంత అందంగా వచ్చేది కాదు. మీకు గ్లిజరిన్‌ లేకుండానే కన్నీళ్లు వస్తున్నాయని ఛాయాగ్రాహకుడు ఆర్ధర్‌ విల్సన్‌ చెప్పినప్పుడు ‘ఎదురుగా ఉన్నది నా తమ్ముడు’ అన్నా. రవితేజ వల్లే అంత మంచి భావోద్వేగాలు పండాయి. దేవిశ్రీప్రసాద్‌ తన సంగీతంతో పూనకాలు తెప్పించాడు. మంచి కథని ఇస్తే ప్రేక్షకులు ఆనందంగా ఆదరించి, తిరిగి మనకే కృతజ్ఞతలు చెబుతారని ఈ సినిమా నిరూపించింది. వాళ్లకి నా కృతజ్ఞతలు’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ ‘‘అన్నయ్య చిరంజీవితో ఇంతకుముందు రెండు సినిమాలు చేశా. ‘వాల్తేరు వీరయ్య’ సందడి వేరు. సినిమా చూసి వచ్చిన చిన్న పిల్లలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ముందే చెప్పా. ఆ నమ్మకం నిజమైంది’’ అన్నారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘‘సినిమాని చూసిన చాలామంది ‘మా చిరంజీవిని మాకు ఇచ్చావ్‌ అన్నా’ అన్నారు.  ఒక అభిమాని అయిన దర్శకుడికి ఇంతకంటే గొప్ప విజయం ఏం కావాలి? చిరంజీవికి కోట్లలో అభిమానులు ఉన్నారు. వాళ్ల రూపంలో నేను వచ్చాను. రవితేజతో కలిసి చేసిన సన్నివేశాల్ని చూసి చప్పట్లు కొడుతున్నారు. ఇంత గొప్ప మేజిక్‌కి కారణం వాళ్ల మధ్య ఉన్న ప్రేమ, వాత్సల్యమే’’ అన్నారు. దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘బాబీ కథ చెప్పినప్పుడే ఫలితాన్ని ఊహించాను. కథ చెప్పిన వెంటనే టైటిల్‌ ట్రాక్‌ ట్యూన్‌ వినిపించా. ఈ పాట జనాలకు అద్భుతంగా చేరువైంది’’ అన్నారు. ‘‘కథానాయకుడు చిరంజీవిని మళ్లీ తెరపై ఎలా చూడాలనుకున్నారో అలానే చూశారు. వసూళ్లు వరదలా వస్తున్నాయి. రవితేజ స్థానంలో మరొకరిని ఊహించలేం’’ అన్నారు నిర్మాత వై.రవిశంకర్‌. ‘‘మా రెండు చిత్రాలు ఒకేసారి విడుదలై విజయం సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు నవీన్‌ ఎర్నేని. కార్యక్రమంలో చంద్రబోస్‌, రామ్‌లక్ష్మణ్‌, ఆర్ధర్‌ ఎ.విల్సన్‌, నిరంజన్‌, శ్రీనివాస్‌రెడ్డి, రోల్‌రైడా, ఏ.ఎస్‌.ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని