మా మధ్య గొడవలుంటాయ్‌: ఉపాసన

వివాహబంధంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజమని రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల తెలిపారు. వ్యాపార రంగంలో ఎప్పుడూ బిజీగా ఉండే ఉపాసన వాలంటైన్స్‌ డే సందర్భంగా తమ ప్రేమ బంధంలోని కొన్ని విశేషాలను...

Published : 15 Feb 2021 01:10 IST

ఆరోజు ఎప్పటికీ మర్చిపోను

హైదరాబాద్‌: వివాహబంధంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజమని రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల తెలిపారు. వ్యాపార రంగంలో ఎప్పుడూ బిజీగా ఉండే ఉపాసన వాలంటైన్స్‌ డే సందర్భంగా తమ ప్రేమ బంధంలోని కొన్ని విశేషాలను బయటపెట్టారు. చరణ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎనిమిదేళ్ల తమ బంధంలోని ఓ ప్రేమికుల దినోత్సవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె తెలిపారు.

‘బహుమతులకన్నా అపురూప క్షణాలకే మేము ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాం. ఎంత ఖరీదైన బహుమతులిచ్చామన్నది కాదు.. మన జీవిత భాగస్వామిని ఎంత ఆనందంగా చూసుకున్నామనే విషయానికి మేమిద్దరం ఓటేస్తాం. అలాంటి ఎన్నో మధురక్షణాలను చరణ్‌ నాకు అందించాడు. వివాహమైన తర్వాత మొదటి వాలంటైన్స్‌డేని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే, సినిమా షూట్‌లో బిజీగా ఉన్నప్పటికీ చరణ్‌ ఎంతో శ్రమించి హృదయాకారంలో ఉన్న చెవి రింగులను తయారు చేయించి ఇచ్చాడు. చెర్రీని కలవడానికి సెట్‌కు వెళ్లగానే కారవాన్‌లో ఆ బహుమతి నాకు అందించాడు. అవి నాకెంతో ప్రత్యేకమైనవి. వాటిని ఎప్పటికీ వదులుకోలేను.’

‘వివాహబంధంలో విభేదాలు రావడం సహజం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడే ఆ బంధం మరింత బలోపేతమవుతుంది. ఇదే విధంగా మా ఇద్దరి మధ్య కూడా అప్పుడప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. మనస్పర్థలు వస్తుంటాయి. కానీ వాటిని మేమిద్దరం కలిసి ఎదుర్కొంటాం. అలా, మా బంధాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాం. వివాహబంధంలో వచ్చే సమస్యలను మేమిద్దరం గౌరవిస్తాం. అలాగే ఆనందాలను కలిసి ఆస్వాదిస్తాం’ అని ఉపాసన వివరించారు.

ఇదీ చదవండి

సినిమాల్లో ప్రేమకు నిర్వచనాలు

ప్రియమైన వారికి ప్రేమతో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని