వీరిని వెబ్‌సిరీస్‌లే నిలబెట్టాయి

సినిమాల్లేక విలవిల్లాడిన ప్రేక్షకులకు ఆ లోటును ఓటీటీలు తీర్చాయి. కొన్ని చిత్రాలు నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఆహా లాంటి వేదికలపై

Published : 15 Dec 2020 10:39 IST

సినిమాల్లేక విలవిల్లాడిన ప్రేక్షకులకు ఆ లోటును ఓటీటీలు తీర్చాయి. కొన్ని చిత్రాలు నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఆహా లాంటి వేదికలపై విడుదలై వినోదాన్ని పంచాయి. విడుదలైనవి కొన్నే, అందులో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సినిమాలూ తక్కువే.  అయితే ఈ ఏడాది విడుదలైన కొన్ని వెబ్‌సిరీస్‌లు మాత్రం సంచలన విజయం సాధించాయి. అందులో నటించిన నటీనటులకు కనీవినీ ఎరుగని స్టార్‌డమ్‌ని సాధించి పెట్టాయి. అలా ఈ ఏడాది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న వెబ్‌ సిరీస్‌ తారలపై ఓ లుక్కేద్దాం.

స్కామ్‌ 1992.. ప్రతీక్‌ గాంధీ

ఈ ఏడాది విడుదలైన ‘స్కామ్‌ 1992’ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే చర్చ. ఇందులో నటించిన నటులకూ అంతే పేరు తెచ్చిందీ వెబ్‌సిరీస్‌. హర్షద్‌ మెహతా జీవితం ఆధారంగా హన్సల్‌ మెహతా తెరకెక్కించారు. ఇందులో హర్షద్‌గా నటించిన ప్రతీక్‌ గాంధీకి ప్రేక్షకుల నుంచి ప్రశంసలే కాక సినీ పరిశ్రమ నుంచి అవకాశాలూ భారీగా పెరిగాయి. సోనీ ఓటీటీ సంస్థ అయిన సోనీలివ్‌కు ఈ వెబ్‌ సిరీస్‌ వల్లే ఊహించని రీతిలో చందాదారులు పెరిగిపోయారు. ‘స్కామ్‌ 1992 ’ కన్నా ముందే ఆయన అనేక నాటకలు, సినిమాల్లో నటించారు. ఇన్నేళ్లు చేసిన సినిమాలు తీసుకురాని పేరు ఆయనకు ఈ ఒక్క వెబ్‌సిరీస్‌ తీసుకొచ్చింది. ఇది ఒక్కరోజులో వచ్చిన విజయం కాదు. దీని వెనక 16 ఏళ్ల కష్టం ఉందంటున్నారు ఆయన. ప్రస్తుతం ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయని, మంచి ప్రాజెక్టులతో మళ్లీ ప్రేక్షకులను అలరిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మిర్జాపూర్‌.. మున్నాభయ్యా

అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన మిర్జాపుర్‌ మంచి విజయం సాధించింది. మొదటి సీజన్‌తోనే ప్రేక్షకుల మనసులను చూరగొన్న ఈ వెబ్‌ సిరీస్‌ రెండో సీజన్‌ కోసం అభిమానులు ఈ ఏడాది ఆసక్తిగా ఎదురుచూశారు. ఇందులో మున్నాభయ్యాగా నటించిన దివ్యేందుశర్మకు యువతలోనూ విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. సామాజిక మాధ్యామాల్లో మున్నాభయ్య సందడి అంతాఇంతా కాదు. ఫేస్‌బుక్‌లో అభిమాన సంఘాలు, మీమ్స్‌తో ఆన్‌లైన్‌లో ఇప్పటికీ సందడి చేస్తునే ఉన్నారాయన. ఈ సిరీస్‌కు ముందు బాలీవుడ్‌లో ప్యార్‌ కా పంచనామ, టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమకథ లాంటి చిత్రాల్లో నటించారు. వాటికన్నా ఎక్కువ క్రేజ్‌ మిర్జాపుర్‌లో  పోషించిన పాత్రకు లభించింది. ఇంతలా క్రేజ్‌ పెరిగిపోడానికి మున్నాభయ్యాగా ఆయన చెప్పిన డైలాగ్స్‌, స్క్రీన్‌పై ఆయన చూపించిన ఆటీట్యూడే కారణం. ఇందులో నటించిన పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, శ్వేతా త్రిపాఠిలకూ ప్రేక్షకుల్లో క్రేజ్‌ పెరిగింది.

పాతాళ్‌ లోక్‌.. జయదీప్‌

అనుష్క శర్మ నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌కూ ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇందులో ఓ కేసును దర్యాప్తు చేసే పోలీసు అధికారి హాథీరామ్‌ చౌదరీ పాత్రకు మంచి పేరొచ్చంది. వ్యవస్థలోని లోపాలను, సమాజంలోని వివక్షనను కళ్లకు కట్టినట్లు చూపించిందీ ఈ వెబ్‌ సిరీస్‌. హాథీరామ్‌ చౌదరీగా నటించిన జయదీప్‌ అహ్లావత్‌ ప్రేక్షకుల మన్ననలు పొందారు. దీనికన్నా ముందే రాక్‌స్టార్‌, విశ్వరూపం, గబ్బర్‌ లాంటి పలు చిత్రాల్లో నటించారు. పాతాళ్‌ లోక్‌లో విశాల్‌ త్యాగి, తోప్‌ సింగ్‌ పాత్రలకూ మంచి ఆదరణే లభించింది.

పంచాయత్‌.. జితేంద్ర కుమార్‌

ఉద్యోగావకాశాలు లేక ఓ మారుమూల గ్రామంలో పంచాయతీ సెక్రెటరీగా విధుల్లోకి చేరతాడు ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అభిషేక్‌ త్రిపాఠి. అక్కడ ఆయనకు ఎదురైన అనుభవాలేంటన్నదే పంచాయత్‌ వెబ్‌ సిరీస్‌. అక్కడ ఎదురయ్యే సంఘటనలతో సరదాగా సాగిపోతుంటుంది. ఇందులో అభిషేక్‌ త్రిపాఠిగా నటించిన జితేంద్ర కుమార్‌కు మంచి మార్కులు పడ్డాయి. నీనా గుప్తా పోషించిన పాత్ర కూడా ఆకట్టుకుంటుంది.

వీరితో పాటు స్పెషల్‌ ఆప్స్‌, అసుర్‌, బందీష్‌ బైండిట్స్‌, అభయ్‌, ఆశ్రమ్‌, ఫ్లెష్‌ లాంటి వెబ్‌ సిరీస్‌లూ ఆకట్టుకున్నాయి. వాటిల్లోని పాత్రలకు, వాటిని పోషించిన నటులకు మంచి గుర్తింపును తెచ్చాయి. ఓటీటీల ద్వారా ఈ ఏడాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న వారిలో బాబీ డియోల్‌, అర్షద్‌ వార్సీ, సుస్మితా సేన్‌ లాంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని