Amitabh Bachchan: చిన్న గదిలో ఏడుగురితో పాటు ఉండేవాడిని..: బిగ్‌బీ

బాలీవుడ్‌ అగ్ర నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. తన బ్లాగ్‌లో ఆ జ్ఞాపకాలను వివరించారు. 

Published : 30 Nov 2022 16:07 IST

హైదరాబాద్‌: చిత్రపరిశ్రమలో ఒక బెంచ్‌ మార్కును క్రియేట్‌ చేసిన నటుడు అమితాబ్‌ బచ్చన్‌. తన నటనతో ప్రవర్తనతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సీనియర్‌ హీరో. వయసుతో సంబంధం లేకుండా నేటి తరం నటీనటులతో పోటీపడుతూ అందరిలో స్ఫూర్తిని నింపుతుంటారు. తాజాగా బిగ్‌బీ తన పాత రోజులను గుర్తుతెచ్చుకున్నారు. ఆ పాతజ్ఞాపకాల గురించి తన బ్లాగ్‌లో రాశారు. తను సినిమాల్లోకి రాక ముందు తీసుకున్న చివరి జీతానికి సంబంధించిన రసీదును పంచుకున్న ఆయన.. ఆ రోజుల్లో ఎంతో ఖాళీగా ఉండేవారని చెప్పారు.

‘‘కోల్‌కత్తాలోని బ్లాకర్స్‌ కంపెనీలో నా ఉద్యోగం చివరి రోజు 30 నవంబర్‌ 1968. అప్పుడు నా జీతం రూ.1640 రూపాయలు. దానికి సంబంధించిన ఫైల్‌ ఇంకా భద్రంగా ఉంది. కోల్‌కత్తాలో ఉన్న రోజులు నా జీవితంలో అత్యంత స్వతంత్రమైన, ఖాళీగా ఉన్న రోజులు. 10 చదరపు అడుగులు ఉన్న గదిలో ఏడుగురితో పాటు ఉండేవాడిని. మా వద్ద డబ్బు లేకపోయినా పెద్ద బేకరీలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల దగ్గర నిల్చొనే వాళ్లం. ఏదో ఒకరోజు అందులోకి వెళ్తామనే ఆశతో ఉండేవాళ్లం’’.

అప్పటికీ ఇప్పటికీ అమితాబ్‌ జీవితం ఎంత మారిందో పంచుకున్నారు. ‘‘షూటింగ్‌ కోసం మళ్లీ ఇదే కోల్‌కత్తాకి రావడం, అర్ధరాత్రి సమయాల్లో నేను ఉన్న వీధులను సందర్శించడం. ప్రతి ప్రదేశానికి వెళ్లడం,  అక్కడ జరిగిన వాటిని గుర్తుచేసుకోవడం. అప్పటి స్నేహితుల్లో కొంతమందిని కోల్పోయాను. కొంతమందితో ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నా. ఎప్పటికీ ప్రేమగా ఉండడం ఎదుటివారికి మనమిచ్చే గొప్ప గౌరవం’’ అని చెప్పారు అమితాబ్‌. ప్రస్తుతం బిగ్‌బీ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’లో నటిస్తున్నారు.     

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని