Madhavan: ఇది కలా.. నిజమా! మాధవన్‌ను చూసి ఆశ్చర్యపోయిన సూర్య..!

కథ, అందులోని పాత్ర కోసం తమను తాము మార్చుకున్న కథానాయకులను ఎందరినో చూశాం. తాజాగా అలాంటి దృశ్యమే ‘రాకెట్రీ’(Rocketry The Nambi Effect) సెట్స్‌లో ఆవిష్కృతమైంది

Updated : 28 Jun 2022 15:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కథ, అందులోని పాత్ర కోసం తమను తాము మార్చుకున్న కథానాయకులను ఎందరినో చూశాం. తాజాగా అలాంటి దృశ్యమే ‘రాకెట్రీ’(Rocketry The Nambi Effect) సెట్స్‌లో ఆవిష్కృతమైంది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌(Nambi Narayanan) జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో మాధవన్‌(Madhavan) తెరకెక్కించారు. ఈ సందర్భంగా నంబి నారాయణన్‌తో కలిసి షూటింగ్‌ చూసేందుకు వచ్చిన నటుడు సూర్య సెట్స్‌లో నారాయణన్‌ గెటప్‌లో ఉన్న మాధవన్‌ను చూసి అమిత ఆశ్చర్యానికి గురయ్యారు. ‘ఇది కలా? నిజమా’ అన్నట్లు నోరెళ్లబెట్టారు. సూర్య, నంబి నారాయణన్‌ రాగానే కుర్చీలో నుంచి లేచి మాధవన్‌ ఇరువురికి స్వాగతం పలికారు.

‘నా స్నేహితుడు సూర్య’ అంటూ నారాయణన్‌కు పరిచయం చేశారు. వెంటనే ‘మీ నటన, మీ నాన్నగారు (శివకుమార్‌) దర్శకత్వం నాకు బాగా నచ్చుతుంది’ అంటూ నారాయణన్‌ చెప్పడంతో సూర్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో సూర్య కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే పాత్రను హిందీలో షారుఖ్‌ఖాన్‌ చేస్తున్నారు. ‘రాకెట్రీ’లో నంబి నారాయణన్‌ భార్య పాత్రలో సిమ్రన్‌ నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 1న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో  ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని