Arul Saravanan: వేల ఉద్యోగులున్న కంపెనీకి బాస్‌.. 51ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ!

సినిమా అనే పురుగు కుట్ట కూడదు.. అది కుట్టిందా? అంతే మనిషిని నిలవనీయదు. కష్టమైనా, నష్టమైనా ‘పద చూసుకుందాం’ అంటుంది.

Updated : 27 Jul 2022 15:16 IST

అరుళ్‌ శరవణన్‌ గురించి ఆసక్తికర విశేషాలు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా అనే పురుగు కుట్ట కూడదు.. అది కుట్టిందా? అంతే మనిషిని నిలవనీయదు. కష్టమైనా, నష్టమైనా ‘పద చూసుకుందాం’ అంటుంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. అద్భుతమైన టాలెంట్‌తో పాటు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ‘డబ్బులు ఉంటే అన్నీ చేయొచ్చు’ అని అనుకుంటారు. కానీ, సినిమాపై ప్యాషన్‌ ఉన్నప్పుడే పెట్టిన డబ్బుకు సార్థకత లభిస్తుంది. తనకు సినిమాపై ఉన్న ఆ ఇష్టమే నటుడిగా మారేలా చేసిందని అంటున్నారు ‘ది లెజెండ్‌’ హీరో అరుళ్‌ శరవణన్‌. ఇన్నాళ్లూ వ్యాపారవేత్తగా రాణించిన ఆయన 50ఏళ్ల వయసులో కథానాయకుడిగా మారారు. ఒక్కసారిగా భారీ ప్రమోషన్స్‌తో వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు అందరినీ తొలి చేస్తున్న ప్రశ్న ఒక్కటే. ఇంతకీ ఎవరీ ‘ది లెజెండ్‌’ హీరో?

  • శరవణ స్టోర్స్‌.. తమిళనాడులో ఈ పేరు వినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. టెక్స్‌టైల్స్‌, జ్యువెలరీ స్టోర్స్‌తో పాటు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, నగలు ఇలా శరవణ స్టోర్స్‌లో దొరకనిదంటూ ఏమీ లేదు. ఈ రిటైల్‌స్టోర్స్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరవణన్‌ సెల్వరత్నమ్‌ కుమారుడే అరుళ్‌ శరవణన్‌.
  • అరుళ్‌ శరవణన్‌ 1970వ సంవత్సరంలో చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి శరవణన్‌ సెల్వరత్నమ్‌ వ్యాపారవేత్త.
  • చదువు పూర్తయిన తర్వాత అరుళ్‌ శరవణన్‌ వ్యాపార నిర్వహణలోకి వచ్చేశారు. కొన్నేళ్లుగా దుస్తులు, ఫర్నిచర్‌, జ్యువెలరీ సహా వివిధ వ్యాపారాలను చూసుకుంటున్నారు. వీటి విలువ వందల కోట్ల పైమాటే.
  • అరుళ్‌ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, మోడల్‌గానూ రాణించారు. ‘శరవణ స్టోర్స్‌’కు ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. 2019లో అగ్ర కథానాయికలు తమన్నా, హన్సికలతో ఆయన రూపొందించిన ప్రచార చిత్రాలు విపరీతంగా ట్రెండ్‌ అయ్యాయి.
  • చిన్నప్పటి నుంచి నటించాలని కోరిక ఉన్నా.. వివిధ కారణాలతో అది నెరవేరలేదు. ప్రకటనల ద్వారా సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ రావడంతో ఎలాగైనా నటుడిగా మారాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం చెన్నైలోని అడయార్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో కోర్సు కూడా పూర్తి చేశారు.
  • ది లెజెండ్‌ శరవణ స్టోర్స్‌ కంపెనీ పతాకంపై చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించారు. జె.డి.-జెర్రీ దర్శకత్వంలో, హ్యారిస్‌ జైరాజ్‌ సంగీత దర్శకుడిగా ఈ సినిమాను పట్టాలెక్కించారు. ఈ చిత్ర దర్శకులు జె.డి.జెర్రీలు అజిత్‌తో ‘ఉల్లాసం’ తీశారు.
  • మార్చి 3, 2022న ఈ సినిమాకు ‘ది లెజెండ్‌’ అనే టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు.  ఇందులో శరవణన్‌ శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌటెల ఇందులో కథానాయికగా నటించింది.
  • శరవణన్‌ వ్యక్తిగత విషయాలకు వస్తే, ఆయనకు సూర్యశ్రీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. 2017 జూన్‌లో సోదరి వివాహానికి రూ.13కోట్ల విలువైన దుస్తులు బహూకరించారు. అప్పట్లో చెన్నైలో ఈ వార్త సంచలనమైంది.
  • చిన్నప్పటి నుంచి సినిమాలు, యాక్టింగ్‌పై ఆసక్తి ఉంది. కానీ మా లైఫ్‌స్టైల్, బిజినెస్‌ వేరు. బిజినెస్‌లో సక్సెస్‌ అయ్యా. ఇప్పుడు అవకాశం రావడంతో ఈ సినిమా చేశాను. నటనకు వయసు అనేది అడ్డంకి కాదని భావిస్తున్నాను.. అని శరవణన్‌ అంటున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts