Pavithra Gowda: ఆమె కోసం హత్య కేసులో ఇరుక్కున్న దర్శన్‌.. ఎవరీ పవిత్ర గౌడ..?

ఓ హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీప(Darshan Thoogudeepa)తోపాటు పవిత్ర గౌడ అనే నటి కూడా అరెస్టయ్యారు. అసలు ఆ పవిత్ర ఎవరు..?  

Updated : 13 Jun 2024 22:27 IST

బెంగళూరు: కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీప(Darshan Thoogudeepa) అరెస్టు సంచలనం సృష్టిస్తోంది. రేణుకాస్వామి (28) అనే యువకుడిని హత్య చేసిన ఆరోపణలపై దర్శన్‌, అతడి స్నేహితురాలు, నటి పవిత్రగౌడ (Pavithra Gowda) అరెస్టయ్యారు. ఈ సమయంలో పవిత్ర ఎవరని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

పవిత్ర ఓ నటి. అటు టీవీ ఇండస్ట్రీతో పాటు ఇటు సినిమాల్లోనూ నటించింది. 2016లో 54321 చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. ఛత్రిగాలు సార్‌ ఛత్రిగాలు, అగమ్య, ప్రీతి కితాబు వంటి వాటిల్లో కనిపించారు. తను ఒక మోడల్‌, ఆర్టిస్ట్‌ అని ఇన్‌స్టాగ్రాం బయోలో పేర్కొంది. రెడ్‌ కార్పెట్‌ స్టూడియో 777 పేరిట ఒక బొటిక్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అయితే కొద్దినెలల క్రితం ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో కలకలం సృష్టించింది. ‘‘మా బంధానికి పదేళ్లు’’ అంటూ దర్శన్‌తో ఉన్న చిత్రాలు పంచుకుంది.

వివాదాల డి బాస్‌

అయితే దర్శన్‌ దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు.  దర్శన్‌ కొన్నేళ్లుగా పవిత్ర గౌడతో కలిసి ఉంటున్నారు. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని అశ్లీల సందేశాలు, దర్శన్‌ను విడిచిపెట్టాలని హెచ్చరికలు చేస్తూ వచ్చాడని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసిందని ఇప్పటివరకు వెల్లడైంది. హత్య అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు రూ.30 లక్షలు ఇస్తానని దర్శన్‌ తమకు ఆఫర్‌ ఇచ్చాడని ముగ్గురు నిందితులు నోరు విప్పారు.

ఇదిలాఉంటే.. దర్శన్ హత్య కేసులో ఇరుక్కోవడంతో అతడి అభిమానులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం విచారణ నిమిత్తం అతడిని ఉంచిన పోలీసుస్టేషన్ వద్దకువచ్చిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. నేరానికి అనుగుణంగా పోలీసులే దీనిపై చర్యలు తీసుకుంటారని కర్ణాటక హోంశాఖ మంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ ఇప్పటికే స్పష్టంచేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని