Updated : 02 Sep 2020 12:38 IST

ఎడిసన్‌ వల్ల సినీ పరిశ్రమ పారిపోయింది

హాలీవుడ్‌ చిత్రాలకు ఉండే క్రేజ్‌ వేరు. అమెరికాలో చిత్రీకరించినా.. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంటాయి. ఈ అమెరికా సినీపరిశ్రమ మొత్తం  కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్‌ ఏంజిల్స్‌లోని హాలీవుడ్ కేంద్రంగా నడుస్తోంది. ఇక్కడే అనేక సినీ స్టూడియోలున్నాయి. ఇక్కడే సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఉంటున్నారు. కానీ ఒకప్పుడు అమెరికా సినీ పరిశ్రమ యూఎస్‌లోనే న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఉండేది. అయితే బల్బు కనిపెట్టిన థామస్‌ అల్వా ఎడిసన్‌ పెట్టే బాధలు భరించలేక లాస్‌ ఏంజిల్స్‌లోని హాలీవుడ్‌కి మారిందట. ఆయనేం చేశారు అంటారా? అయితే ఇది చదవండి..

థామస్‌ అల్వా ఎడిసన్‌.. బల్బు కనిపెట్టడమే కాదు వెయ్యికిపై కొత్త ఆవిష్కరణలు చేసి పేటెంట్‌ హక్కులు సంపాదించారు. అందులో ఎక్కువగా సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఎన్నో పరికరాలు ఉన్నాయి. టాకింగ్‌ మోషన్‌ పిక్చర్‌ తీసే కెనెటోస్కోప్‌ మొదలు థియేటర్లో తెరపై సినిమా వేసే ప్రొజెక్టర్‌ వరకు అనేక వాటిలో ఆయన కనిపెట్టిన పరికరాలకు పేటెంట్‌ హక్కులున్నాయి. దీంతో 20వ శతాబ్దం ప్రారంభంలో ఎవరైనా సినిమా తీయాలంటే ఎడిసన్‌ అనుమతి తీసుకొని, ఆయనకు ఫీజు చెల్లించాల్సి ఉండేది. ఎవరైనా తన పేటెంట్‌ పరికరాలను అనుమతి లేకుండా వాడితే వారిపై దావా వేసేవారు. ఈ క్రమంలో ఎడిసన్‌ పలు ఫిల్మ్‌ స్టూడియోలు, నిర్మాణ సంస్థలతో 1908లో ‘మోషన్‌ పిక్చర్‌ పెటెంట్స్‌ కంపెనీ(ఎంపీపీసీ)’ని స్థాపించారు. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు షూటింగ్స్‌ జరిగే ప్రాంతాలకు వెళ్లి వారు ఎలాంటి పరికరాలను ఉపయోగిస్తున్నారో గమనించేవారు. పొరపాటున ఈ కంపెనీ భాగస్వాములు కాకుండా మరెవరైనా ఎడిసన్‌ కనిపెట్టిన పరికరాలతో అనుమతి లేకుండా సినిమా తీస్తే వారిపై ఈ ఎంపీపీసీ దావా వేయడం.. చిత్రీకరణను నిలిపివేయడం చేసేది.

అయితే స్వతంత్రంగా సినిమాలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద సమస్యగా మారిపోయింది. వీరితో పాటు మరికొన్ని మోషన్‌ పిక్చర్‌ కంపెనీలు కూడా ఎడిసన్‌ కంపెనీ వేసే దావాలతో విసిగిపోయాయి. దీంతో 1910 తర్వాత సినీ పరిశ్రమ న్యూజెర్సీ నుంచి లాస్‌ ఏంజిల్స్‌లోని హాలీవుడ్‌కు మారడం మొదలైంది. న్యూజెర్సీ కేంద్రంగా నడిచే ఎడిసన్‌ కంపెనీ.. 4వేలకుపైగా కి.మీ దూరంలో ఉన్న లాస్‌ ఏంజిల్స్‌లో దావా వేసే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ వేసినా దావా కేసు విచారణకు చాలా సమయం పడుతుంది. పైగా కాలిఫోర్నియా కోర్టులు ఈ దావాలను విచారించడానికి విముఖత చూపుతాయి. ఈ కారణాల వల్ల అమెరికా సినీ పరిశ్రమ మొత్తం హాలీవుడ్‌కి వచ్చేసింది.

బయోగ్రాఫ్‌ అనే మోషన్‌ పిక్చర్‌ కంపెనీ 1910లో ఓ బృందాన్ని లాస్‌ఏంజిల్స్‌కి పంపి చిత్రీకరణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయో లేవో పరీక్షించింది. డైరెక్టర్‌ డీ.డబ్ల్యూ గ్రిఫిత్‌ ‘ఇన్‌ ఓల్డ్‌ కాలిఫోర్నియా’ పేరుతో ఓ చిత్రాన్ని లాస్‌ ఏంజిల్స్‌, హాలీవుడ్‌ ప్రాంతాల్లో చిత్రీకరించాడు. విజయవంతంగా చిత్రం పూర్తి కావడంతో 1911లో నెస్టర్‌ స్టూడియో హాలీవుడ్‌లో తొలి స్టూడియోని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అనేక చిత్ర నిర్మాణ సంస్థలు ఎడిసన్‌ పెటెంట్‌ ఫీజులు తప్పించుకునేందుకు హాలీవుడ్‌కు వలస వచ్చేశాయి. అయితే 1913లో ఎడిసన్‌ పేటెంట్లకు కాలం చెల్లింది. 1915 అక్టోబర్‌ 1న ఫెడరల్‌ కోర్టు ఎంపీపీసీ ఈ చట్టాలను దుర్వినియోగం చేసిందని పేర్కొంది. దీనికి సవాల్‌ చేస్తూ ఎంపీపీసీ అప్పిలియేట్‌ కోర్టుకు వెళ్లగా.. అక్కడ చుక్కెదురు కావడంతో 1918లో ఎంపీపీసీ మూతపడింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని