AR Murugadoss: మహేశ్‌బాబు ‘స్పైడర్‌’ విషయంలో నేను చేసిన తప్పు అదే!

AR Murugadoss: మహేశ్‌బాబు స్పైడర్‌, రజనీకాంత్‌ దర్బారు చిత్రాలు ఆశించిన విజయం అందుకోలేకపోవడానికి గల కారణాన్ని దర్శకుడు మురుగదాస్‌ పంచుకున్నారు.

Published : 05 Apr 2023 02:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించిన దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ (AR Murugadoss). భారతీయ సినిమా రూ.100కోట్లు కలెక్ట్‌ చేస్తుందా? అనుకునే రోజుల్లో ‘గజనీ’తో ఆయన అదిరిపోయే సమాధానం ఇచ్చారు. అంతటి స్టార్‌ డైరెక్టర్‌ ఇటీవల వరుసగా పరాజయాలను చవి చూశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మహేశ్‌బాబు ‘స్పైడర్‌’, రజనీకాంత్‌ ‘దర్బార్‌’ చిత్రాలు మెప్పించలేకపోయాయి. ఈ క్రమంలో ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘1947 ఆగస్టు 16’ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘స్పైడర్‌’, ‘దర్బారు’ చిత్రాలు ఆశించిన విజయం అందుకోలేకపోవడానికి గల కారణాన్ని ఆయనే స్వయంగా పంచుకున్నారు.

‘‘పాన్‌ ఇండియా అనే కాన్సెప్ట్‌లేని ఆ రోజుల్లో నేను వేసుకున్న లెక్కలు తప్పాయి. అవేంటంటే, తమిళ, తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా బ్యాలెన్స్‌ చేస్తూ సినిమా చేయడం. ఎస్‌జే సూర్య కోసం తమిళ ప్రేక్షకులు సినిమా చూస్తారని అనుకున్నా. అలాగే తెలుగులో మహేశ్‌ స్టార్‌డమ్‌ ఉపయోగపడుతుందని భావించా. దీంతో మహేశ్‌బాబును తమిళంలో స్టార్‌ కమర్షియల్‌ హీరోగా చూపించే ప్రయత్నం చేయలేదు. ప్రతినాయకుడితో పోలిస్తే, ఆ పాత్ర కాస్త డౌన్‌ ఉంటుంది. దీంతో తెలుగులో మిస్‌ ఫైర్‌ అయింది. కావాలనే తమ హీరో పాత్రను తమిళ డైరెక్టర్‌ తక్కువ చేసి చూపించాడని తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా మహేశ్‌ అభిమానులు భావించారు. ఎస్‌జే సూర్య నా స్నేహితుడు కావడం వల్లే ఆయన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాననే చర్చ జరిగింది. ప్రతి సినిమాకు నేను ఏ స్థాయిలో శ్రమిస్తానో దీనికీ అదే స్థాయిలో కష్టపడ్డా. కానీ, సినిమా యావరేజ్‌గా ఆడిందంతే’’ అని మురుగదాస్‌ తెలిపారు.

ఇక రజనీకాంత్‌ ‘దర్బార్‌’ విషయంలోనూ తన అంచనాలు తప్పాయని చెప్పారు. ఫిల్మ్‌ మేకింగ్‌, స్క్రీన్‌ రైటింగ్‌ చాలా సులభమని, తక్కువ సమయంలో ముగించవచ్చని భావించా. పైగా రజనీ సర్‌ నాకు మార్చిలో డేట్స్‌ ఇచ్చారు. జూన్‌కల్లా ముంబయిలో ఆయన పోర్షన్‌ పూర్తి చేయాలి. లేకపోతే వర్షాలు మొదలై మరింత ఆలస్యమైపోతుంది. పైగా ఆయన ఆగస్టులో రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని, నటుడిగా ఇదే ఆయన చివరి సినిమా అవుతుందని అందరూ భావించారు. దీంతో సినిమాను చుట్టేయాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నారు. ఏ ప్రాజెక్టు విషయంలోనైనా సరైన ప్లానింగ్‌ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. సినిమా విషయంలో తగినంత సమయం తీసుకోవాలని ముఖ్యంగా సెట్స్‌, లొకేషన్స్‌, మేకప్‌, ఫిల్మ్‌ మేకింగ్‌ ఇలా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటేనే సినిమా బాగా వస్తుందని ఆమిర్‌ఖాన్‌ తనతో చెప్పారని మురుగదాస్‌ అన్నారు. ‘మీకో రహస్యం చెబుతాను. షూటింగ్‌ కూడా మొదలు పెట్టకుండా రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తే 50శాతం సినిమా ఫ్లాప్‌ అయినట్లే. ముందు సినిమా మొదలు పెట్టండి. అది ఎలా వస్తుందో చూడండి. 80శాతం చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఒకసారి రషెస్‌ చూసుకోండి. అప్పుడు విడుదల తేదీని ప్రకటించండి. దర్బార్‌ తర్వాత నేను గ్రహించిన విషయం ఇదే’ అని మురుగదాస్‌ కుండ బద్దలు కొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని