Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌కు ‘పవర్‌స్టార్‌’ బిరుదెలా వచ్చింది?

కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కన్నడ చిత్ర పరిశ్రమతో

Published : 30 Oct 2021 01:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు, తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లోని నటులు, సాంకేతిక నిపుణులు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తున్న ఆయనకు గుండె పోటు రావడంతో విక్రమ్‌ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ప్రతి కథానాయకుడికి తమ అభిమానులు ఓ బిరుదు ఇస్తుంటారు. అలా పునీత్‌ రాజ్‌కుమార్‌ను కన్నడ చిత్ర పరిశ్రమలో ‘పవర్‌స్టార్‌’ అంటారు. తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని బాల నటుడిగా రాణించిన పునీత్‌ రాజ్‌కుమార్‌ ‘అప్పు’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. అక్కడి నుంచి వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కన్నడ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఇతర నటీనటుల పట్ల గౌరవం, అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉండటం ఆయనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. తన ఇంటికి వచ్చిన ఏ అభిమానినీ నిరాశతో వెనక్కి పంపరు. ఇక పునీత్‌ నటించిన 29 (హీరోగా) చిత్రాల్లో అత్యధిక చిత్రాలు 100 రోజులకు పైగా ఆడాయంటే అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్‌ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. ఈ స్టామినానే ఆయనకు ‘పవర్‌స్టార్‌’ బిరుదు వచ్చేలా చేసింది. అంతేకాదు, కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో పునీత్‌ ఒకరు.

ఓ సందర్భంలో తన పేరు ముందున్న ‘పవర్‌స్టార్‌’ బిరుదు గురించి మాట్లాడుతూ.. ‘‘పవర్‌స్టార్‌’ అనే బిరుదును నా అభిమానులే నాకు ఇచ్చారు. అసలు నిజం ఏంటంటే, వాళ్లే నా పవర్‌’ అని చెప్పుకొచ్చారు. ఈ వినయ, విధేయతలే ఆయననకు కన్నడ ‘పవర్‌స్టార్‌’గా నిలబెట్టాయి. నటుడిగా, వ్యాఖ్యాతగా, గాయకుడిగా కన్నడ చిత్ర పరిశ్రమపై పునీత్‌ రాజ్‌కుమార్‌ చెరగని ముద్రవేశారు.

పునీత్‌ కళ్లు దానం చేసిన కుటుంబ సభ్యులు!

పునీత్‌ గుండె పోటుతో మరణించడంతో ఆయన రెండు కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. ‘నారాయణ నేత్రలయ’కు చెందిన వైద్యులు పునీత్‌ నేత్రాలను భద్రపరిచారు.

కరోనా కాలంలో ఓటీటీకే మద్దతు

నటుడిగానే కాదు, నిర్మాతగానూ కన్నడ చిత్ర పరిశ్రమలో సత్తా చాటారు పునీత్‌ రాజ్‌కుమార్‌. పీఆర్‌కే ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై పలు చిత్రాలు నిర్మించారు. గతేడాది కరోనా కారణం సినిమా థియేటర్లు మూత పడటంతో తాను నిర్మించిన రెండు చిత్రాలను ఓటీటీలో విడుదల చేశారు. ‘లా’, ‘ఫ్రెంచ్‌ బిర్యానీ’ చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలై అలరించాయి. ఆరు సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో ‘ఫ్యామిలీ ప్యాక్‌’, ‘వన్‌ కట్‌.. టు కట్‌.. యాన్‌ ఫ్లవర్‌ ఈజ్‌ కేమ్‌’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని