అందుకే ‘వైల్డ్‌డాగ్‌’ అని పెట్టాం: నాగార్జున

నాగార్జున కథానాయకుడిగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. నాగార్జున ఇందులో ఎన్‌ఐఏ ఏజెంట్‌గా

Updated : 01 Mar 2021 20:52 IST

హైదరాబాద్‌: నాగార్జున కథానాయకుడిగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. నాగార్జున ఇందులో ఎన్‌ఐఏ ఏజెంట్‌గా కనిపించనున్నారు. సయామీ ఖేర్‌, దియా మీర్జా, అతుల్‌ కుల్‌కర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 2న థియేటర్‌లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ..‘‘చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరాన్ని నా మనసులోంచి తీసేశా. ఇప్పుడే మిమ్మల్ని కొత్తగా చూస్తున్నట్లుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే హైదరాబాద్‌లో జరిగిన బ్లాస్ట్ గురించి అందరికి తెలిసిందే. ఈ అంశంపైనే సినిమా తీశాం. ఆ బ్లాస్ట్‌లో బాంబులు పెట్టిన వ్యక్తులను పట్టుకోవడమే లక్ష్యంగా కథ సాగుతుంది. ‘సార్‌ ఈ మిషన్‌కి వెళ్లామంటే తిరిగి వస్తామో? రామో.. నాకు ఏం జరిగినా పర్వాలేదు సర్. నేను పోయినా మా అమ్మకు ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు’  డైలాగ్‌ నన్నెంతగానో ఆకట్టుకుంది. ఈ మిషన్‌కి నేను కమాండర్‌గా ఉంటాను. సయామీ ఖేర్‌ ఇందులో ‘రా ఏజెంట్‌’గా పనిచేస్తుంది. మిగతా వాళ్లు అంతా ‘ఎన్‌.ఐ.ఏ’లో ఉంటారు’’

‘‘నేను ఈ పాత్ర కోసం ఎవరిని కలవలేదు. దర్శకుడు ఏం చెబితే అదే చేశా. తొలుత చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలనుకున్నాం. కరోనా వల్ల జనాలు థియేటర్లకు వస్తారా? అని అనుకున్నాం. అయితే అంతలోనే సంక్రాంతికి ‘క్రాక్‌’ సినిమా వచ్చి విజయం అందుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ‘ఉప్పెన’ వచ్చింది. దాంతో మాకు ధైర్యం వచ్చి , సినిమాని ఏప్రిల్‌ 2న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అడవిలో వైల్డ్‌ డాగ్స్‌ సింహాలను కూడా వేటాడతాయి. దాన్ని చంపేంత వరకు అవి విశ్రమించవు. అనుకున్నది సాధించే వరకూ వెనుదిరగవు. అందుకే ఈ సినిమాకు ‘వైల్డ్‌ డాగ్‌’ అని పేరు పెట్టారు. ఇక ‘బంగార్రాజు’ చిత్రాన్ని వచ్చే సంక్రాంతితీసుకురావాలని అనుకుంటున్నాం. జూన్‌ లేదా జులై చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నాం’’అని నాగార్జున తెలిపారు.

ఇక నిర్మాత నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ..‘‘ఇది అందరికి కనెక్ట్‌ అయ్యే కథ. చిత్రాన్ని తొలుత ఓటీటీకి అమ్మేశాం. అయితే తిరిగి మళ్లీ థియేటర్‌లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. అలా ఓటీటీ  నుంచి తిరిగి బయటకు వచ్చిన తొలి సినిమా ఇదే. ఓటీటీకి అమ్మినా, థియేటర్‌లో విడుదల చేసుకునే అవకాశం మాకు ఇచ్చారు. సినిమా థియేటర్‌లో విడుదలైన 30, 40 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల అవుతుంది. ఓటీటీలో అయితే నాగార్జునను యావత్‌ దేశం మొత్తం చూడొచ్చని’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటి సయామీ ఖేర్‌తో పాటు ఇతర నటీనటులు సాంకేతికవర్గం పాల్గొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని