Acharya: ఓటీటీలోకి ‘ఆచార్య’.. స్ట్రీమింగ్‌ అప్పటి నుంచే?

‘ఆచార్య’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందా? అవుననే సమాధానం వినిపిస్తోంది సినీ వర్గాల్లో. చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన చిత్రం థియేటర్లలో ఇటీవల విడుదలైంది.

Published : 05 May 2022 22:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆచార్య’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందా? అవుననే సమాధానం వినిపిస్తోంది సినీ వర్గాల్లో. చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. క్రేజీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ ప్రాజెక్టు అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రం ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్‌ కానుందని టాక్‌. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ధర్మస్థలి అనే ఊరు చుట్టూ తిరిగే ఈ కథను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.

క‌థేంటంటే: 800 యేళ్ల చ‌రిత్ర ఉన్న టెంపుల్ టౌన్ ధ‌ర్మ‌స్థ‌లి. ధర్మానికి.. ఆయుర్వేద వైద్యానికి ప్ర‌సిద్ధి. అక్క‌డ అధ‌ర్మం చోటు చేసుకున్న‌ప్పుడు అమ్మ‌వారే ఏదో రూపంలో వ‌చ్చి ధ‌ర్మాన్ని నిల‌బెడుతుంటుంది. అమ్మవారి పాదాల చెంత ధ‌ర్మ‌మే ప‌ర‌మావధిగా నివ‌సిస్తున్న ఓ చిన్న తండాకి పాద‌ఘ‌ట్టం అని పేరు. ఆ పాద‌ఘ‌ట్టం, దానిప‌క్క‌న ఉన్న సిద్ధ‌వ‌నంపై కొంత‌మంది అక్ర‌మార్కుల క‌న్ను ప‌డుతుంది. టెంపుల్ టౌన్ ధ‌ర్మ‌స్థ‌లిపై కూడా బ‌స‌వ (సోనూసూద్‌) పాగా వేస్తాడు. ఎదురొచ్చిన‌వాళ్లని అంతం చేస్తూ అక్ర‌మాలు కొన‌సాగిస్తుంటాడు. పాద‌ఘ‌ట్టం జ‌నాల్ని, ధ‌ర్మ‌స్థ‌లిని కాపాడేవారే లేరా అనుకునే స‌మ‌యంలో కామ్రేడ్ ఆచార్య (చిరంజీవి) (Chiranjeevi) వ‌స్తాడు. ఇంత‌కీ ఆచార్య ఎవ‌రు?ఆయ‌న్ని ఎవ‌రు పంపించారు? ధ‌ర్మ‌స్థ‌లిలోనే పెరిగిన సిద్ధ (రామ్‌చ‌ర‌ణ్) (Ram charan)కీ, ఆచార్య‌కీ సంబంధ‌మేమైనా ఉందా? త‌దిత‌ర విష‌యాల్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని