నాని, సుధీర్‌బాబు ఓటీటీకి వస్తున్నారా?

అన్నీ సిద్ధం.. ఇక విడుదలే ఆలస్యం అనుకుని.. లాక్‌డౌన్‌ వల్ల నిలిచిపోయిన సినిమాల్లో ‘వి’ ఒకటి. నాని, సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఉగాదికి విడుదల చేయాలని చిత్రబృందం

Published : 13 Aug 2020 13:25 IST

హైదరాబాద్‌: అన్నీ సిద్ధం.. ఇక విడుదలే ఆలస్యం అనుకుని.. లాక్‌డౌన్‌ వల్ల నిలిచిపోయిన సినిమాల్లో ‘వి’ ఒకటి. నాని, సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఉగాదికి విడుదల చేయాలని చిత్రబృందం తొలుత భావించింది. అయితే కరోనా వైరస్‌ - లాక్‌డౌన్‌ అమలు కారణంగా వాయిదా పడింది. ఈలోగా సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారంటూ వార్తలు రావడం, వాటిని చిత్రబృందం అధికారికంగా, అనధికారికంగా ఖండించడమూ జరిగింది. అయితే ఇప్పుడు అనుకున్నదే అవుతోందట.

గత కొద్ది కాలంగా పెద్ద తెర మీద ‘వి’ అంటూ పట్టుపట్టి కూర్చున్న చిత్రబృందం ఇప్పుడు ఓటీటీవైపు చూస్తోందట. ఓటీటీ వేదికగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందట. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యక్రమాలు చివరిదశకు వచ్చాయని ఓటీటీ వర్గాల టాక్‌. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల ఐదున ‘వి’ని అమెజాన్‌ ప్రైమ్‌లో చూసేయొచ్చని చెబుతున్నారు. దీని కోసం అమెజాన్‌ ప్రైమ్‌ పెద్ద మొత్తంలో ఆఫర్‌ చేసిందనీ అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈవిషయంలో చర్చలు పూర్తికాలేదని దిల్‌ రాజు పీఆర్‌ టీమ్‌ తెలిపింది. 

‘వి’ దారిలో టాలీవుడ్‌లో మరికొన్ని సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి అంటున్నారు. వాటిలో చాలా వరకు ఇటీవల కాలంలో ‘ఓటీటీకి వెళ్లిపోతాయి’ అంటూ వార్తలు వచ్చిన సినిమాలే ఉన్నాయని సమాచారం. థియేటర్లు తెరుచుకునే అంశంలో స్పష్టత రాకపోవడంతో కొందరు నిర్మాతలు ఓటీటీ విడుదల గురించి ఆలోచిస్తున్నారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని