Ponniyin Selvan: ‘పొన్నియిన్‌ సెల్వన్‌2’.. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికే అధ్యాయం!

మణిరత్నం (maniratnam) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin selvan) రెండో భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో ఏం చూపించనున్నారని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated : 27 Apr 2023 13:58 IST

Ponniyin Selvan: ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) తన కలల ప్రాజెక్ట్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ను రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన తొలి భాగం బాక్సాఫీస్‌ వద్ద అలరించగా, ఇప్పుడు ‘పొన్నియిన్‌ సెల్వన్‌2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే పార్ట్‌ -1లో మిగిలిపోయిన అనేక సందేహాలకు లభించే సమాధానాల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నలేంటంటే..?

నందిని గతమేంటి..?

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan)లో కీలకపాత్రధారి.. మొత్తం కథకు సూత్రధారి నందిని (Aishwarya Rai). చిన్నతనంలోనే ఆమెను చూసి ప్రేమలో పడతాడు ఆదిత్య కరికాలుడు. ఆమెతో జీవితాన్ని ఊహించకుంటాడు. అయితే, అనాథ అయిన నందినికి చోళ సామ్రాజ్య రాణి అయ్యే అర్హత లేదని భావించిన ఆదిత్య చెల్లి కుందవై (త్రిష) (Trisha) మహారాణితో చెప్పి నందిని రాజ్యం విడిచి వెళ్లిపోయేలా చేస్తుంది. అలా, వెళ్లిపోయిన నందిని పాండ్య రాజు వీర పాండ్యుడిని వివాహం చేసుకున్నట్లు.. ఆదిత్య చేతిలో అతడు మరణించినట్లు.. ఆదిత్య మీద కోపంతో ఆమె చోళ రాజ్య ఆర్థిక మంత్రి పెద్ద పళవేట్టురాయర్‌ (శ‌ర‌త్‌ కుమార్‌)ను వివాహమాడి తంజావూరుకు వచ్చినట్లు పార్ట్‌-1లో చూపించారు. అలాగే, ఆమె చోళ సామ్రాజ్య పతనం, మరీ ముఖ్యంగా ఆదిత్యుడిపై విజయం, అరుణ్‌మొళి వ‌ర్మన్ (జయం రవి) మరణం కోసం ఆమె ఎదురుచూస్తున్నట్లు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో చూపించిన విషయం తెలిసిందే. అయితే, నందిని గతం విషయంలో ప్రేక్షకులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆమెకు ఆదిత్య అంటే ఎందుకంత కోపం? చిన్నతనంలో చోళ సామ్రాజ్యం నుంచి వెళ్లిపోయిన ఆమె పాండ్య రాజుని ఎలా పెళ్లి చేసుకుంది? పెద్ద పళవేట్టురాయర్‌తో ఆమెకు బంధం ఎలా ఏర్పడింది? అరుణ్‌మొళి వ‌ర్మన్‌ను ఆమె ఎందుకు చంపాలనుకుంది?


మధురాంతకుడు రాజ్యం చేజిక్కుకుంటాడా..?

చోళ రాజ్య చక్రవర్తి సుందరచోళుడి (ప్రకాశ్‌రాజ్‌) అన్న కొడుకే మధురాంతకుడు (రెహమాన్‌). తన తండ్రి మరణం తర్వాత రాజ్యాధికారం లెక్కప్రకారం తనకే రావాలని భావించిన మధురాంతకుడు.. చోళ రాజ్య ఆర్థిక మంత్రి పెద్ద పళవేట్టురాయర్‌తో చేతులు కలిపి రాజ్యం కోసం పన్నాగాలు పన్నుతుంటాడు. తన బాబాయ్‌ సుందరచోళుడు, ఆయన పిల్లలు ఆదిత్య, అరున్‌మొళిని తప్పించి.. తానే రాజుస్థానంలో కూర్చోవాలనే ఆశతో సామంత రాజులతో కలిసి మంతనాలు జరుపుతుంటాడు. మరి, ఆయన ప్రయత్నాలు ఎంతవరకూ సఫలమయ్యాయి? మధురాంతకుడు చోళ సామ్రాజ్య రాజు అవుతాడా? లేదా తాను పన్నిన పన్నాగంలో తానే తనువు చాలిస్తాడా?


పెద్ద పళవేట్టురాయర్‌ ఎందుకు శత్రువయ్యాడు..?

చోళ సామ్రాజ్యంలో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తోన్న ఆర్థిక మంత్రి పెద్ద పళవేట్టురాయర్‌ (శ‌ర‌త్‌ కుమార్‌). రాజ కుటుంబ విశ్వాసాన్ని పొందిన అతడు ఉన్నట్టుండి అదే కుటుంబానికి వ్యతిరేకిగా మారడానికి కారణం ఏమిటి? వయసులో తనకంటే ఎంతో చిన్నదైన నందినిని అతడు ఎందుకు వివాహం చేసుకున్నాడు? మధురాంతకుడికి సాయం చేయడం వెనకున్న ప్రధాన కారణమేమిటి?


అరుణ్‌మొళి ఏమయ్యాడు?

చోళ సామ్రాజ్య మరో యువరాజు అరుణ్‌మొళి వర్మన్‌ (Ponniyin Selvan) పడవ ప్రమాదం జరిగి సముద్రంలో పడి చనిపోయినట్లు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ క్లైమాక్స్‌లో చూపించారు. ఆయన నిజంగా మృతి చెందాడా? లేదా బతికే ఉన్నాడా? ఒకవేళ బతికితే తనపై కుట్ర పన్నిన పెద్ద పళవేట్టురాయర్‌ని ఆయన ఏం చేశాడు? శత్రు సైన్యం పాండ్యులను నుంచి ఎలా తప్పించుకున్నాడు? అలాగే తనని చంపాలని చూసిన నందినికి ఎలాంటి బుద్ధి చెప్పాడు? అరుణ్‌మొళి వర్మన్‌ ఎవరిని వివాహం చేసుకున్నాడు?


ఆ ముసలావిడ ఎవరు?

అరుణ్‌మొళి ప్రమాదంలో ఉన్నప్పుడల్లా అతడిని కాపాడటానికి ఒక ముసలావిడ వచ్చినట్లు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan)లో చూడొచ్చు. చివరికి అరుణ్‌మొళి సముద్రంలో పడిపోయినప్పుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆయన్ని వెతుక్కుంటూ సముద్రంలోకి వెళ్తుందావిడ. ఇంతకీ ఆమె ఎవరు? అరుణ్‌మొళి అంటే ఆమెకు ఎందుకంత ఇష్టం? ఆమెకు అరుణ్‌మొళికి ఉన్న అనుబంధం ఏమిటి?


వందియదేవన్‌ వివాహం చేసుకునే చోళ రాజకుమారి ఎవరు?

గంభీరంగా సాగే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో కథలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న పాత్ర వల్లవరాయ వందియదేవన్‌(కార్తి). రెండో భాగంలో కూడా ఈ పాత్రకు ప్రాధాన్యం ఉంటుందా? లేదా? అన్నది చూడాలి. ఇక లంకను వీడి అరుణ్‌మొళి వర్మన్‌ వెళ్తున్న సమయంలో వల్లవరాయుడిని తన తలపాగాను అలకరించి ‘నువ్వు కూడా రాజువు అవుతావు. చోళ యువరాణి నీ పక్కన నిలబడుతుంది’ అంటాడు. మరి వల్లవరాయుడిని వరించే ఆ చోళ యువరాణి ఎవరు? కుందవైని అతడు వివాహం చేసుకుంటాడా? లేదా?


కుందవై రాజనీతి కొనసాగుతుందా?

తన రాజకీయ చతురతతో కథను మలుపుతిప్పే పాత్ర ‘కుందవై’. సామంతులను కూడదీసి మధురాంతకుడిని రాజును చేయాలనుకున్న పెద పళవేట్టురాయర్‌ కుట్రను తన తెలివి తేటలతో భగ్నం చేస్తుంది. సామంతరాజుల కుమార్తెలను తన సోదరులకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి, అప్పటికి గండం గట్టెక్కిస్తుంది. రెండో భాగంలో నందిని కీలకం కావడంతో ఆ పాత్రను ఢీకొట్టే మహిళ కుందవై మాత్రమే. మరి చోళ రాజ్య పతనానికి సాగే కుట్రలను భగ్నం చేయడంలో కుందవై పాత్ర ఏంటో చూడాలి.


దెబ్బ తిన్న ఏనుగు ప్రమాదమా..?

సామ్రాజ్య విస్తరణలో భాగంగా చోళ యువరాజు ఆదిత్య కరికాలుడు (విక్రమ్‌) (Vikram) రాష్ట్రకూటులపై పోరాటం చేస్తాడు. అలా, ఓ యుద్ధంలో రాష్ట్రకూట రాజు కార్తికను ఆదిత్య ప్రాణాలతో వదిలేస్తాడు. ప్రాణభిక్షను ఇష్టపడని కార్తిక..‘‘ఆదిత్యా.. తప్పు చేస్తున్నావు గాయపడ్డ ఏనుగే పులికి అతిపెద్ద శత్రువు’’ అని హెచ్చరించినట్లు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan)లో చూపించారు. సినిమా మొదట్లో కనిపించిన కార్తిక ఆ తర్వాత మరెక్కడా కనిపించిన దాఖలాలు లేవు. మరి, కార్తిక వల్ల ఆదిత్య కరికాలుడికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా?


ఆదిత్య నందినిని చంపేస్తాడా?

తన సోదరుడు అరుణ్‌మొళి చనిపోయాడనే కోపంతో అతడి చావుకు కారణమైన నందినిని తానే చంపేస్తానని ఆదిత్య అంటాడు. చాలా ఏళ్ల తర్వాత తంజావూరుకు చేరుకున్న ఆదిత్య.. నిజంగానే నందినిని శిక్షిస్తాడా? లేదా ఆమె చేతిలో దెబ్బతింటాడా?.. ఇలా ఎన్నో ప్రశ్నలకు మరి కొన్నిరోజుల్లో సమాధానాలు రానున్నాయి.

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) పుస్తకాన్ని ఐదు విభాగాల్లో రచించాడు కల్కి కృష్ణమూర్తి. ఆ ఐదు వాల్యూమ్స్‌లోని సారాంశాన్ని కథగా మార్చుకుని మణిరత్నం రెండు భాగాలుగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాన్ని రూపొందించారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చోళ సామ్రాజ్య వైభవాన్ని కేవలం రెండున్నర గంటల నిడివి గల సినిమాగా తెరకెక్కించడం కోసం మణిరత్నం మరెంతగానో శ్రమించారు. పాత్రల పరిచయం, వాటి ప్రాధాన్యతను తెలియజేస్తూ వచ్చిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’ ఇప్పటికే ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. శుక్రవారం రానున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌ -2’ సైతం విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందని సినీ ప్రియులు ఆకాంక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని