Oscars 2022: ఆస్కార్‌ వేదికపై ఊహించని ఘటన.. వ్యాఖ్యాతకు చెంపదెబ్బ

ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అకాడమీ అవార్డుల(ఆస్కార్‌) ప్రదానోత్సవంలో ఓ అనూహ్య ఘటన జరిగింది....

Updated : 28 Mar 2022 11:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అకాడమీ అవార్డుల(ఆస్కార్‌) ప్రదానోత్సవంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఆనందం, భావోద్వేగాల మధ్య సాగే ఈ వేడుకల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ అందరినీ విస్మయానికి గురి చేసింది. తొలుత అందరూ ‘షో’లో భాగంగానే ఆటపట్టించడానికి జరుగుతున్న ఘటన అని భావించినప్పటికీ.. తర్వాత అసలు విషయం తెలుసుకొని కంగుతిన్నారు. అసలు ఏం జరిగిందంటే..

అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ అకాడమీ అవార్డుల వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు ప్రకటించడానికి ముందు ఆయన వీక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తేందుకు ఓ కామెడీ ట్రాక్‌ను చెప్పుకొచ్చారు. అందులో ప్రముఖ నటుడు విల్‌ స్మిత్‌ సతీమణి జాడా పింకెట్‌ ప్రస్తావనను తీసుకొచ్చారు. జుట్టు పూర్తిగా తొలగించుకొని వేడుకకు హాజరైన ఆమెను ‘జీ.ఐ.జేన్‌’ చిత్రంలో ‘డెమి మూర్‌’ ప్రదర్శించిన పాత్రతో పోల్చారు. ఈ చిత్రంలో ఆమె పూర్తిగా గుండుతో కనిపించడం గమనార్హం. జీ.ఐ.జేన్‌ సీక్వెల్‌లో కనిపించబోతున్నారా?అంటూ హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశారు. పింకెట్‌ ‘అలోపేసియా’ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో జుట్టు ఊడిపోతుంటుంది. ఈ విషయాన్ని ఇటీవల ఆమె బహిరంగంగా తెలిపారు కూడా.

అప్పటి వరకు క్రిస్‌ జోక్‌లకు నవ్వుతూ కనిపించిన స్మిత్‌.. ఒక్కసారిగా లేచి వేదికపైకి నడుచుకుంటూ వెళ్లారు. వేడుక జరుగుతున్న డాల్బీ థియేటర్‌లో నిశ్శబ్దం ఆవరించింది. స్మిత్‌ ఆగ్రహాన్ని పసిగట్టలేకపోయిన క్రిస్‌ అతను దగ్గరకు వచ్చే వరకు నవ్వుతూ అక్కడే నిలబడ్డారు. అక్కడి వరకు వెళ్లిన స్మిత్‌.. క్రిస్‌ చెంప ఛెళ్లుమనిపించి వెనుదిరిగారు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు ‘షో’లో భాగంగా అందరినీ ఆటపట్టించడానికి జరుగుతోందనుకున్నారు. కానీ, వెనక్కి వచ్చిన స్మిత్‌ తన కుర్చీలో కూర్చుని క్రిస్‌పై గట్టిగా అరిచారు. ‘నా భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దు’ అంటూ రెండుసార్లు గట్టిగా హెచ్చరించారు. అసలు విషయాన్ని గమనించిన ప్రేక్షకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. అయితే, క్రిస్‌ మాత్రం దీన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించలేదు. స్మిత్‌ హెచ్చరికకు ‘ఓకే’ అని సమాధానం ఇస్తూనే.. ‘‘టెలివిజన్ చరిత్రలోనే ఇది ఓ గొప్ప రాత్రి’’ అని వ్యాఖ్యానించారు. అంతలోనే వేదికపైకి వచ్చిన సీన్‌ కోంబ్స్‌ వారివురిని సముదాయించారు. ఇద్దరూ కలిసి సమస్యను సామరస్యపూర్వంగా పరిష్కరించుకుంటారని తెలిపి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించారు.

ఘటన జరిగిన 40 నిమిషాల తర్వాత ‘ఉత్తమ నటుడి’గా అవార్డు అందుకునేందుకు విల్‌ స్మిత్‌ వేదికపైకి వచ్చారు. జరిగిన ఉదంతంపై స్పందిస్తూ అకాడమీ, సహచర నామినీలకు క్షమాపణలు చెప్పారు. అయితే, క్రిస్‌ పేరు మాత్రం ప్రస్తావించలేదు. అవార్డు అందుకుంటున్న సమయంలో స్మిత్‌ కన్నీటిపర్యంతం కావడం గమనార్హం. కింగ్‌ రిచర్డ్‌ సినిమాలో టెన్నిస్‌ స్టార్స్‌ వీనస్‌, సెరెనా విలియమ్స్‌ తండ్రి రిచర్డ్‌ విలియమ్స్‌ పాత్రలో స్మిత్‌ కనిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని