Womens Day: ‘స్త్రీ’నిమా లోకం.. దర్శకత్వంలో రాణిస్తోన్న మహిళామణులు

సినీ రంగంలో ఎందరో మహిళలు దర్శకత్వంలో రాణిస్తున్నారు. వాళ్లకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు.

Updated : 08 Mar 2023 11:10 IST

తెరపైన హీరోయిన్స్‌గా అలరిస్తూనే తెరవెనుక కూడా మహిళలు సందడి చేస్తున్నారు. ఆర్టిస్టులకు మేకప్‌ వేయడం దగ్గర నుంచి వాళ్లకు యాక్షన్‌ చెప్పడం వరకు.. నిర్మాణం మొదలుకొని దర్శకత్వం వరకూ అన్ని విభాగాల్లోనూ సత్తా చాటుతున్నారు. సినిమా ప్రపంచానికి వాళ్ల ప్రతిభతో మరిన్ని రంగులు అద్దుతున్నారు. ఎంతో కష్టంగా భావించే కెమెరా విభాగంలోనూ మహిళామణులు రాణిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ( Womens Day) పురస్కరించుకుని తెర వెనుక ఉన్న ‘స్త్రీ’నిమా లోకం గురించి తెలుసుకుందామా.. 

అలా మొదలై...

తెలుగు చిత్ర పరిశ్రమలో తొలితరంలో భానుమతి రామకృష్ణ (P Bhanumathi) దర్శకురాలిగా రాణించారు. ఆ తర్వాత నిర్మాతగా, నేపథ్య గాయనిగా తనదైన ముద్ర వేశారు. మొదటిసారి దర్శకత్వం వహించి మహిళా దర్శకుల్లో ముందు వరసలో నిలిచారు. ఆ తర్వాత సావిత్రి, విజయనిర్మల సినిమాల్లో హీరోయిన్స్‌గా చేస్తూనే దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. సావిత్రి ఆరు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక.. విజయ నిర్మల 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కారు. ఆ తర్వాత జీవితా రాజశేఖర్‌, బి.జయ, సుచిత్ర చంద్రబోస్‌, శ్రీప్రియ వంటి వారు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు.

తొలి సినిమాతోనే ‘నంది’ని అందుకొని

ఇక నేటితరం మహిళా దర్శకుల విషయానికొస్తే నందినీ రెడ్డి (B V Nandini Reddy) తాను దర్శకత్వం వహించిన తొలి సినిమాతోనే ‘ఉత్తమ నూతన దర్శకురాలి’గా నంది పురస్కారం అందుకున్నారు. ‘అలా మొదలైంది’ సినిమాతో మొదలైన ఆవిడ దర్శకత్వ ప్రతిభ ‘జబర్దస్త్‌’గా సాగుతోంది. ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకుని అందరితో ఔరా అనిపించుకున్నారు. త్వరలో ‘అన్నీ మంచి శకునాలే’ సినిమాతో పలకరించడానికి సిద్ధమయ్యారు.  దర్శకురాలిగానే కాకుండా నటిగానూ నందినీ రెడ్డి అలరిస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకొని

‘గురు’ సినిమాతో మహిళా దర్శకురాలిగా మంచి విజయాన్ని అందుకున్నారు సుధా కొంగర (Sudha Kongara). ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. విశాఖపట్నంలో పుట్టిపెరిగిన సుధ కొంగర ఎన్నో సినిమాలకు  రైటర్‌గా, అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. మొదటిసారి 2010లో ‘ద్రోహి’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడైన కెప్టెన్ జి.ఆర్ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా "సూరరై పొట్రు" చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఆమె కీర్తి ప్రతిష్ఠలు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమానే తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో డబ్‌ చేయగా ఇక్కడా విజయం సాధించింది. త్వరలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా బయోపిక్ తెరకెక్కించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ దర్శకురాలు మల్టీ టాలెంటెడ్‌..

చలనచిత్ర పరిశ్రమలో తన ప్రతిభతో ఎంతోమందిని ఆకట్టుకుంటోన్న మహిళ ఫర్హా ఖాన్ (Farah Khan)‌. పేరుకు బాలీవుడ్‌ దర్శకురాలైనా ఈమె అన్ని భాషలవారికి సుపరిచితం. బాలీవుడ్‌లో అగ్ర హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2007 లో షారుక్‌ ఖాన్‌తో తీసిన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో అన్ని భాషల్లోని సినీ ప్రియులు ఆమెకు అభిమానులుగా మారిపోయారు. వెండితెరకే పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా న్యాయ నిర్ణేతగా అలరిసున్నారు. సినీ పరిశ్రమలో రైటర్‌గా, నిర్మాతగా, దర్శకురాలిగా, డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తూ మల్టీటాలెంటెడ్‌ అనిపించుకుంటున్నారు. 

కష్టమైనా ఇష్టంతోనే..

ఓ సినిమా వేలమంది కష్టం. ఆ సినిమా వెనక కష్టంగా ఉండే విభాగాల్లో కెమెరా రంగం ఒకటి. ఆ రంగంలో మహిళలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో తాజాగా సంచలనం సృష్టించారు ఓ తెలుగమ్మాయి. తనే యామినీ యజ్ఞమూర్తి (yamini yagnamurthy). కీర్తిసురేశ్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘చిన్ని’ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ దగ్గర శిష్యరికం చేసి కెమెరాకు సంబంధించిన అన్ని విషయాల్లో పట్టుసాధించారు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు, షార్ట్‌ ఫిల్మ్‌లకు కెమెరా వర్క్‌ చేస్తున్నారు. చిన్న వయసులోనే పెద్దరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నేటి తరం యువతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు యామినీ యజ్ఞమూర్తి.  

ఇలా చెబుతూ పోతే సినీరంగమనే నింగిలో మెరుస్తున్న మహిళామణులెందరో ఉన్నారు. అనుకున్నది సాధించడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి మహిళలకు, వాళ్లని చూసి స్ఫూర్తి పొందుతున్న నేటి యువతులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని