Remo Dsouza: ఇవే ‘గుండెపోటు’ నేర్పిన పాఠాలు

ఒక్కోసారి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకున్నాకే జీవితానికి సంబంధించిన పాఠాలు నేర్చుకుంటాం. సరిగ్గా ఇదే జరిగింది ఆ ప్రముఖ దర్శకుడు కొరియోగ్రాఫర్‌ జీవితంలో. ఆయనే బాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా.

Published : 29 Sep 2021 21:12 IST

కోలుకున్నాక ఇవే నేర్చుకున్నా.. మీతో పంచుకుంటున్నా

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఒక్కోసారి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకున్నాకే జీవితానికి సంబంధించిన పాఠాలు నేర్చుకుంటాం. సరిగ్గా ఇదే జరిగింది ఆ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జీవితంలో. ఆయనే బాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా. సిద్ధార్థ్‌ మల్హోత్రా- ఆలియాభట్‌తో ‘డిస్కో దివానే’, రణ్‌బీర్‌- దీపికాపదుకొణెతో ‘బద్తమిజ్‌దిల్‌’, ప్రియంకా చోప్రా- దీపికాతో ‘పింగానీ’, రణ్‌వీర్‌-దీపికాతో ‘ దీవానీ మస్తానీ’ పాటలకు నృత్యాలతో అందాన్ని తీసుకొచ్చారు. జాతీయ పురస్కారంతో పాటు ఐఫా.. ఇలా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. అంతా బాగానే ఉన్నా.. ఆరోగ్యం పట్ల జాగ్రత్త లేకపోవడంతో గతేడాది రెమోకు గుండెపోటు వచ్చింది. దాన్నుంచి కోలుకున్నాక ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని చెప్పారు. బుధవారం ‘‘వరల్డ్‌ హార్ట్‌ డే’’ సందర్భంగా ఆయన నేర్చుకున్న పాఠాలు, అనుభవాలను అభిమానులతో ఇలా పంచుకున్నారు.

‘‘ 2020 డిసెంబర్‌11న నాకు గుండెపోటు వచ్చింది. అప్పుడు నాకు 46ఏళ్లు. మృత్యువుతో పోరాడి ఇలా మళ్లీ మీ ముందుకు వచ్చా. అప్పుడు నాకు తెలిసిందేంటంటే..  ప్రతీ ఒక్కరికి రెండు జీవితాలు ఉంటాయి. మీకు ఇంకా కేవలం ఒక్క జీవితం ఉందని తెలిసినప్పుడే.. మీ రెండో జీవితం ప్రారంభమవుతుంది’. అందుకే గుండెకు సంబంధించి ఆరోగ్యంగా  ఉండేందుకు ఈ నాలుగు టిప్స్‌ ఇస్తున్నా అవేంటంటే.. 

ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి..

ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయి.. ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇలా చేయకండి. ఎందుకుంటే గుండెకు సంబంధించిన వ్యాధులున్నీ ఆహారం నిర్లక్ష్యం చేయడం వల్లే వస్తాయి. ముఖ్యంగా మీరు ఏం తింటున్నారో వాటి పట్ల జాగ్రత్త వహించాలి. నూనె, జంక్‌ఫుడ్‌ తీసుకోకండి. ఇవి చాలా ప్రమాదకరం. వాటి స్థానాల్లో మీ డైట్‌లో ఆకుకూరలు, సలాడ్స్‌, చికెన్‌, సీ ఫుడ్స్‌ చేర్చండి. అలాగే రెడ్‌ మీట్‌కు దూరంగా ఉండండి. అన్నిటికంటే ముఖ్యమైనది.. ఇంట్లో వండిన ఫుడ్‌నే తినండి.

రోజూ ఒక ఫిజికల్‌ యాక్టివిటీ 

ఫిట్‌గా ఉండటం అనేది ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కచ్చితంగా రోజూ ఒక ఫిజికల్‌ యాక్టివిటీ ఉండేలా చేసుకుంటే అది మిమల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ‘‘ మీకోసం మీరు సమయం కేటాయించండి. వర్క్‌వుట్స్‌ అంటే భారీగా ఏం చేయాల్సిన పని లేదు. పరిగెత్తండి. అదీ మీ వల్ల కాకపోతే రోజులో ఓ 30నిమిషాలు కనీసం నడవడం కానీ, స్పీడ్‌ వాక్‌ కానీ చేయండి. ఇదే మీరు మీ గుండెకు ఇచ్చే ఎనర్జీ.

ఒకే సమయానికి నిద్ర

సరైన సమయానికి నిద్రపోకపోతే అది కూడా గుండెకు సంబంధించిన వ్యాధులకు దారితీస్తుంది. రోజుకు ఒక్కో సమయంలో నిద్రపోవడం లాంటివి చేయొద్దు. కచ్చితంగా రోజూ ఒకే సమయానికి బాగా నిద్రపోండి.

ఎక్కువగా ఆలోచించొద్దు

ముఖ్యంగా మానసిక ఆరోగ్యం కూడా గుండె మీద ప్రభావం చూపుతుంది. అందుకే ‘‘సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఒత్తిడికి గురవ్వకుండా మిమల్ని మీరు రిలాక్డ్స్‌గా ఉండేలా చూసుకోండి. అనవసరపు విషయాల గురించి ఎక్కువ సేపు ఆలోచిస్తే సమస్యలను కోరి తెచ్చుకున్నట్లే’’ 

వీటికి దూరంగా ఉండండి

చివరిగా ఒక్కమాట.. జీవనశైలిని ఏ విధంగా ఉంచుకోవచ్చో మన చేతుల్లోనే ఉన్న పని. కాబట్టి మీకు ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నట్లైతే.. వాటికి దూరం ఉండండి. ఇవన్నీ ఆపేయమని చెప్పను. కనీసం అదుపులో ఉంచడానికి ప్రయత్నించండి. అదే మిమల్ని కాపాడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని