
rekha vedavyas: ‘ఆనందం’ హీరోయిన్ తిట్లతో తెలుగు నేర్చుకుందట!
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి మంగళవారం రాత్రి 9.30గంటలకు సినిమా ప్రముఖుల సందడితో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం కలిగిస్తోంది ఈటీవీ. సాయికుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘వావ్ 3’ ఎప్పటిలాగే వచ్చేవారం కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నటి హేమ, హీరోయిన్ రేఖా వేదవ్యాస్, అంకిత, యువ నటుడు భరత్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. వినోదంతో పాటు విజ్ఞానం కూడా పంచే ఈ కార్యక్రమంలో అతిథులను సాయికుమార్ ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. మధ్యమధ్యలో టాస్కులతో సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి కార్యక్రమం ఆగస్టు 10న ఈటీవీలో ప్రసారం కానుంది. అప్పటి వరకూ ఈ ప్రోమో చూసి ఆనందించండి. ఇంతకీ ఆ ప్రోమోలో ఏం ఉందంటే..
‘‘ఆనందం’ సినిమాలో వెంకట్ ప్రియురాలిగా నటించింది ఎవరని సాయికుమార్ అడుగుతాడు. వెంటనే బజర్ నొక్కిన భరత్ జవాబు మాత్రం చెప్పలేక సతమతమవుతూ ఉంటాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న రేఖ.. ‘జవాబు నాకు తెలుసు.. కానీ రెండు లక్షలు ఇస్తే చెప్తా’ అంటూ ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత రేఖ తాను హీరోయిన్గా నటించిన ‘ఆనంద్’ చిత్ర అనుభవాలు పంచుకుంది. ఆ సినిమా సమయానికి తనకు తెలుగు తెలియదని, తాను తెలుగు నేర్చుకున్నదే తిట్ల వల్ల అని చెప్తుంది. అయితే.. ‘ఇప్పుడు మాకు ఆ తిట్లు వద్దులేండి’ అని సాయికుమార్ అనడంతో వేదికపై నవ్వులు పూశాయి. సమయం దొరికినప్పుడల్లా నటి హేమ తనదైన పంచ్లతో సందడి చేసింది. అంకిత డ్యాన్స్ పెర్ఫార్మెన్సుతో అదరగొట్టింది. గిన్నిస్బుక్ రికార్డు ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద క్యారెట్ బరువెంత..? భారత అత్యున్నత న్యాయస్థాన నినాదం ఏమిటి..? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈ కార్యక్రమంలో జవాబు దొరకనున్నాయి.