Lakshmi Bhupal: లక్ష్యాలు లేని మనిషిని నేను!

‘‘మనసుని హత్తుకునే ప్రేమకథా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఇది చక్కటి భావోద్వేగాల ప్రయాణం. ప్రేక్షకులు చాలా చోట్ల కంటతడి పెట్టుకుంటారు’’ అన్నారు సంభాషణల రచయిత లక్ష్మీభూపాల.

Updated : 05 Dec 2022 06:52 IST

‘‘మనసుని హత్తుకునే ప్రేమకథా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ (Gurtunda Seetakalam). ఇది చక్కటి భావోద్వేగాల ప్రయాణం. ప్రేక్షకులు చాలా చోట్ల కంటతడి పెట్టుకుంటారు’’ అన్నారు సంభాషణల రచయిత లక్ష్మీభూపాల (Lakshmi Bhupal). సత్యదేవ్‌ (Satya Dev) కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కన్నడలో విజయవంతమైన ‘లవ్‌ మాక్‌టైల్‌’కు రీమేక్‌గా రూపొందింది. నాగశేఖర్‌ దర్శకుడు. ఈనెల 9న విడుదల కానున్న నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

* ‘‘ఓ శీతాకాలంలో ఈ కథతో నా ప్రయాణం మొదలైంది. ఈ కన్నడ రీమేక్‌ను తొలుత మరో దర్శకుడు తెరకెక్కించాలనుకున్నారు. ఆయన నాకు సత్యదేవ్‌ కావాలంటే.. నేను తనకి చెప్పా. మంచి ప్రేమకథ.. నీకు చాలా  బాగుంటుందని చెబితే చేస్తానన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ దర్శకుడు తప్పుకుంటే నాగశేఖర్‌ ముందుకొచ్చారు. అలా ఈ చిత్రం కార్యరూపం దాల్చింది. ఇది రీమేక్‌ చిత్రమైనా.. తెరకెకి ్కంచిన విధానం పూర్తిగా కొత్తగా ఉంటుంది. మాతృకలోని మూలకథను మాత్రమే తీసుకొని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కథనమంతా కొత్తగా సిద్ధం చేసుకున్నాం. సరికొత్తగా సంభాషణలు రాసుకున్నాం’’.

* ‘‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌’, ‘ప్రేమమ్‌’.. ఈ తరహా జానర్లలో సాగే ప్రేమకథలు అరుదుగా దొరుకుతుంటాయి. ఈ ‘గుర్తుందా శీతాకాలం’ అలాంటి విభిన్నమైన ప్రేమకథా చిత్రమే. దేవ్‌ అనే వ్యక్తి జీవితంలోని నాలుగు  ప్రేమకథల్ని ఇందులో చూపించారు. ఇన్ని కోణాలున్న పాత్రను పోషించాలంటే ఆ నటుడు చాలా సమర్థుడై ఉండాలి. అందుకే ఈ కథ కోసం సత్యదేవ్‌ను తీసుకున్నాం. ఎందుకంటే తనకి 19 ఏళ్ల కుర్రాడి పాత్రైనా, 90ఏళ్ల వయసు పైబడిన పాత్ర ఇచ్చినా చేసేస్తాడు’’.

* ‘‘ఏ లక్ష్యాలు లేని మనిషిని నేను. గాలి ఎటు వీస్తే అటు వెళ్తా. ఎందుకంటే నేను ఇదే చేయాలని అనుకొని కూర్చున్నా అనుకోండి.. ఒకవేళ అది అవ్వకపోతే నిరాశలో కూరుకుపోవాల్సి వస్తుంది. అదే ఏ లక్ష్యాలూ లేవనుకోండి.. నేను వెళ్లే దారిలో ఏ మలుపొస్తే అటు తిరిగిపోతుంటా. ఎటు వెళ్లినా.. అక్కడ నేనేంటో చూపించే ప్రయత్నం చేస్తా. దానివల్ల జీవితమెప్పుడూ సంతృప్తిగానే ఉంటుంది. నిరాశకు చోటుండదు. ఇక్కడ ఎన్నేళ్లు ఉంటామో తెలియదు. అందుకే ఉన్నంత కాలం మంచి సినిమాలు రాయాలి.. నేను వెళ్లిపోయాక కూడా అవి గుర్తుండిపోవాలి అనుకుంటా. దర్శకత్వం చేయాలన్న ఆలోచన ఉంది. కానీ, ఇప్పటివరకు ఆ దిశగా ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. నేను ప్రస్తుతం నిర్మాతగా ‘మరీచిక’ అనే సినిమా చేస్తున్నా. అనుపమ పరమేశ్వరన్‌, రెజీనా కథానాయికలు. విరాజ్‌ అశ్విన్‌ కథానాయకుడు. ‘అన్నీ మంచి శకునములే’ చిత్రానికి మాటలందించా. అది త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తుంది’’.

* ‘‘నా కెరీర్‌ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఓసారి రాసిన జానర్‌ మళ్లీ రాయలేదు. ఎక్కడా ఓ ఇమేజ్‌ ఛట్రంలో ఇరుక్కుపోలేదు. అన్ని రకాల జానర్లు ప్రయత్నించా. ఒక్కో చిత్రం ఒక్కో అనుభవాన్నిచ్చింది. ప్రతి సినిమాకీ ఓ కొత్త తరహాలో రాసుకుంటూ వెళ్లడం వల్లే నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ఏ కథకు మాటలందించాలన్నా.. అది ముందుగా మనల్ని కదిలించేలా ఉండాలని నమ్ముతా. ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలు, పొలిటికల్‌ థ్రిల్లర్స్‌.. ఇలా ఏ తరహా చిత్రాలైనా సరే ముందు కథలో బలం ఉండాలి. బలమైన భావోద్వేగాలు పండాలి. ఆ ఎమోషన్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారని నమ్మకం కలిగితే.. అక్కడ మనమేంటో చూపించుకోగలిగే అవకాశం దొరుకుతుంది’’.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని